ఈకేవైసీ నమోదుపై అపోహలు వద్దు - ప్రభుత్వ చీఫ్‌విప్‌

25 Aug, 2019 10:38 IST|Sakshi
రాయచోటి పోస్టాఫీసులోని ఆధార్‌ సెంటర్‌లో ప్రజలతో మాట్లాడుతున్న చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి 

సాక్షి, రాయచోటి : ఈకేవైసీ చేయకపోవడం వల్ల ఏ ఒక్క సంక్షేమ పథకమూ దూరం కాదు. ఇప్పటికిప్పుడు దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాయచోటిలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈకేవైసీపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దన్నారు. నమోదు కోసం ప్రజలు ఒక్కసారిగా వచ్చి ఇబ్బందులు పడుతున్నారని చీఫ్‌విప్‌ ఆవేదనను వ్యక్తం చేశారు. కొంతమంది పనిగట్టుకుని ప్రభుత్వ విధానాలపై తప్పుడు ప్రచారాలను చేస్తున్నారంటూ మండిపడ్డారు. రోజుల తరబడి చిన్నబిడ్డలతో కలిసి క్యూలో నిరీక్షించాల్సి రావడం ఇబ్బందిగా మారిందన్నారు. ఈ పరిస్థితులపై  స్పందించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

ఈనెల చివరికల్లా ఈకేవైసీ చేసుకోని వారికి రేషన్‌ కార్డులు, రేషన్‌ రద్దు అవుతాయన్న ప్రచారాన్ని జేసీ కొట్టి పారేశారని చెప్పారు. ఇదే విషయంపై ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన చేసిందన్నారు. ఈకేవైసీ నమోదు చేసుకోనంత మాత్రాన కార్డులు రద్దు కావన్నారు. గల్ఫ్, ఇతర దేశాలు, ప్రాంతాల్లో ఉన్న వారు సైతం ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. తమ ప్రభుత్వం ఎప్పుడు ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తుందన్నారు. ప్రజలకు తప్పనిసరి పరిస్థితుల్లో అవసరమైతే ప్రభుత్వం వార్డులు, వీధులలో అదనపు యంత్రాలను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని పూర్తి చేయిస్తుందే తప్పా ఇబ్బంది పెట్టదన్నారు. రెవెన్యూ శాఖ, డీలర్లు వారి వద్దకు వచ్చిన ప్రజలకు అవగాహనను కల్పించాలన్నారు. ఈకేవైసీ సాకుగా చూపి అర్హులకు రేషన్‌ ఇవ్వకపోవడం, రేషన్‌ కార్డులు రద్దయ్యాయని చెబుతున్న డీలర్లపై కఠిన చర్యలు తప్పవన్నారు.

ఆధార్‌ కేంద్రాన్ని సందర్శించిన చీఫ్‌విప్‌
రాయచోటి ప్రధాన పోస్టాఫీసులో ఏర్పాటు చేసిన ఆధార్‌ సెంటర్‌ను ఆదివారం ఉదయం చీఫ్‌విప్‌ సందర్శించారు. ఈకేవైసీ నమోదు విషయంపై అక్కడి ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. రాయచోటిలో రెండు ఆధార్‌ కేంద్రాల ద్వారా రోజుకు వంద మందికి అప్‌డేట్‌ చేస్తే లక్షమంది జనాభా  ఈ ప్రాంతంలో ఉన్నారని, వారందరికీ ఈకేవైసీ అప్‌డేట్‌ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందో ఆలోచించాలన్నారు. మరోమారు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిశీలిస్తామన్నారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు రియాజుర్‌ రహెమాన్‌ కూడా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు