వైద్యం వికటించి పసికందు మృతి

9 Dec, 2014 03:52 IST|Sakshi
వైద్యం వికటించి పసికందు మృతి

వైద్యుడి నిర్లక్ష్యమే : తల్లి మల్లీశ్వరి ఆరోపణ
డాక్టర్ రాజుపై కేసు నమోదు

 
బుచ్చిరెడ్డిపాళెం: చేతకాని వైద్యంతో ఓ డాక్టర్ మూడు నెలల పసికందును బలి తీసుకున్నాడు. చనిపోయిన విషయం చెప్పకుండా నెల్లూరుకు తీసుకెళ్లమని బాధిత కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. చిన్నారి తల్లి నిలదీయడంతో చనిపోయినట్లు తెలిపాడు. ఈ ఘటన స్థానిక వీఆర్  చిన్నపిల్లల ఆసుపత్రిలో సోమవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు.. మండలంలోని నాగమాంబపురానికి చెందిన గాలి వెంకటరమణయ్య, మల్లీశ్వరి దంపతులకు రెండో సంతానంగా మూడు నెలల క్రితం పాప జన్మిం చింది. ఈ క్రమంలో జలుబు ఎక్కువగా ఉండడంతో మల్లీశ్వరి తన తల్లితో కలిసి పాపను తీసుకుని సోమవారం వీఆర్ చిన్నపిల్లల ఆసుపత్రికి వచ్చింది.

డాక్టర్ సలహా లేకుండానే అక్కడ పని చేస్తున్న ఆస్పత్రి అసిస్టెంట్ ఆ చిన్నారికి ఇంబ్యులేజర్ పెట్టింది. దీంతో ఆ చిన్నారి ఉక్కిరి బిక్కిరి అవుతుండడంతో తల్లి గుర్తించి అక్కడున్న సిబ్బందికి చెప్పింది. అంతలో డాక్టర్ రాజు వచ్చి డెర్ఫిలిన్ ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో శ్వాస ఆడక చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని చెప్పకుండా సీరియస్‌గా ఉందని, చిన్నారిని నెల్లూరుకు తీసుకెళ్లమని చెప్పాడు. తమ బిడ్డకు ఏ మైందని తల్లి, అమ్మమ్మ నిల దీయగా చనిపోయిందని తెలి పాడు. దీంతో బాధిత కుటుం బ సభ్యులు ఆందోళనకు దిగడంతో ఆస్పత్రిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

నా బిడ్డను డాక్టరే చంపాడు
జలుబుగా ఉందని ఆసుపత్రికి తీసుకువచ్చిన నా బిడ్డను డాక్టర్ రాజు చంపాడని చిన్నారి తల్లి మల్లీశ్వరి బోరున విలపిం చింది. తన బిడ్డ మృతికి కారకుడైన రా జుపై తగిన చర్యలు తీసుకోవాలంటూ రోదించడం స్థానికులను కలిచివేసింది.

డాక్టర్‌పై  కేసు నమోదు
ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెల కొనడంతో  ఎస్సై శ్రీనివాసరావు అక్కడికి చే రుకున్నారు. తన బిడ్డను డాక్టర్ రాజు చంపాడని చిన్నారి తల్లి ఎస్సై ఎదుట వాపోయింది.  విచారించిన ఎస్సై చిన్నా రి తండ్రి వెంకటరమణయ్య ఫిర్యాదు మేరకు డాక్టర్‌పై కేసు నమోదు చేశారు.

ఏడాదిలో ఇది రెండో ఘటన
ఈ ఏడాది ప్రారంభంలో పొదలకూరు మండలం మహ్మదాపురానికి చెందిన ఓ చిన్నారికి జ్వరంగా ఉండటంతో తల్లిదం డ్రులు రాజు వద్దకు తీసుకొచ్చారు. ఆయ న హెవీ డోస్  ఇంజెక్షన్ ఇవ్వడంతో బా లుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని దాచి బాలుడికి సీరియస్‌గా ఉందని నెల్లూరుకు తీసుకెళ్లమని సూచిం చాడు. తల్లిదండ్రులు నిలదీయడంతో బా లుడు చనిపోయినట్లు చెప్పాడు. సోమవా రం మళ్లీ అదే ఘటన పునరావృతమైంది.
 
వైద్య పరికరాలేవి?
వీఆర్ చిన్న పిల్లల ఆసుపత్రిలో కనీస వైద్య పరికరాలు కూడా లేవు. ఆక్సిజన్ సిలిండర్ కూడా లేకపోవడం శోచనీయం. చేతకాని వైద్యంతో చిన్నారుల ప్రాణాలు గాల్లో కలుపుతున్న డాక్టర్ రాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.  ఈ విషయమై విలేకరులు డీఎంహెచ్‌ఓ భారతీరెడ్డిని సంప్రదించగా విచారించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వైద్యం అందించా: డాక్టర్ రాజు
జలుబుతో బాధప డుతున్న చిన్నారి ని తమ ఆస్పత్రికి తీసుకొచ్చిన విష యం వాస్తవమేన ని డాక్టర్ రాజు తె లిపారు. తగిన వైద్యం అందించా నని మొదట చెప్పిన ఆయన తర్వాత త నకు సంబంధం లేదని బుకాయించారు. వైద్యానికి ఉపయోగించిన పరికారలేవని ఆరా తీయగా పారేశానని, లోపల ఉన్నాయని మార్చిమార్చి చెప్పాడు. చిన్నారి మృతితో అందరూ బాధలో ఉండగా ఆయన మాత్రం తన స్నేహితులతో నవ్వుల్లో మునిగిపోవడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు