వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి!

1 May, 2018 13:07 IST|Sakshi

ఏరియా ఆస్పత్రి వద్ద బంధువుల ఆరోపణ

తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్‌ సెంటర్‌): వైద్యులు సకాలంలో స్పందించకపోవడం వల్లే శిశువు చనిపోయిందంటూ బాలింత బంధువులు ఆరోపించారు. వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలంటూ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తాడేపల్లిగూడేనికి చెందిన షేక్‌ పరహానా గర్భిణి కావడంలో తొమ్మిది నెలలుగా స్థానిక ఏరియా ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతోంది. పరీక్షలు చేయించడంతో పాటు మందులు వాడింది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి పరిహానాకు కడుపులో నొప్పిగా ఉండటంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటివరకూ ఆమెకు వైద్యం చేసిన వైద్యురాలు ఆసమయంలో అందుబాటులో లేరు. వైద్యురాలి సూచన మేరకు సిబ్బంది ఆస్పత్రిలో చేర్చుకున్నారు.

ఆరోజు, తర్వాత రోజు ఆదివారం ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది గర్భిణి పరహానాను పట్టించుకోలేదు. సోమవారం వైద్యురాలు వచ్చిన తర్వాత పరీక్షించి ఆపరేషన్‌ చేయాలని చెప్పారని, అవసరమైతే మరో రోజు కూడా ఆగవచ్చని అన్నారని బంధువులు అంటున్నారు. తాము ఆపరేషన్‌ చేసేం దుకు అంగీకరించగా సోమవారం ఉద యం ఆపరేషన్‌ చేయగా మృత శిశువు జన్మించిందని వాపోయారు. ఆస్పత్రిలో వైద్యులు సకాలంలో స్పందించకపోవడంతోనే ఇలా జరిగిందని ఆరోపించారు. దీనిపై ఏరియా ఆస్పత్రి సూపరిం టెండెంట్‌ శివప్రసాద్‌ స్పందిస్తూ పరహానాకు వైద్యసేవలు అందించామన్నారు. అన్ని వివరాలను జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్‌ శంకరరావుకు తెలియజేశామన్నారు. డాక్టర్ల్ల నిర్లక్ష్యం వల్లే శిశువు చనిపోయిందని బాధితురాలి బంధువులు నిరసన వ్యక్తం చేయడంతో పాటు, వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.

మరిన్ని వార్తలు