నవజాత శిశువు మృతి

29 Nov, 2018 13:35 IST|Sakshi
శిశువు మృతి చెందడంతో రోదిస్తున్న బంధువులు

వైద్యుల నిర్లక్ష్యంతోనేనంటూ కుటుంబ సభ్యుల ఆందోళన

శువు కుటుంబ సభ్యులే 

కారణమంటున్న వైద్యులు

తూర్పుగోదావరి, తాడితోట (రాజమహేంద్రవరం): వైద్యుల నిర్లక్ష్యం వల్ల నవజాత శిశువు మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. వారి కథనం ప్రకారం.. బొమ్మూరుకు చెందిన శీలం కనక దుర్గ గర్భిణి. నెలలు నిండడంతో ఈనెల 25వ తేదీ ఆదివారం ఆమెకు పురుడు పోసేందుకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని తల్లి పిల్లల వార్డులో చేర్చారు. సోమవారం ఆమెకు ఆపరేషన్‌ చేసి ఆడపిల్లకు జన్మించింది. ఆ నవజాత శిశువుకు మంగళవారం వ్యాక్సిన్‌ వేశారు. సాయంత్రం పాపకు జ్వరం రాగా వెంటనే డాక్టర్ల వద్దకు తీసుకువెళ్లారు. అయితే వారు వ్యాక్సిన్‌ వేసిన పాపకు జ్వరం వస్తుందని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చి పాపను పట్టించుకోలేదు. రాత్రంతా పాప జ్వరంతోనే ఏడుస్తుండగా కుటుంబ సభ్యులు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మరోసారి డాక్టర్ల వద్దకు తీసుకువెళ్లగా మృతి చెందినట్టు చెప్పారు. దీంతో డాక్టర్లు పాపను పట్టించుకోకపోవడం వల్లే మృతి చెందినట్టు ఆరోపించి ఆసుపత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు సార్లు తల్లికి అబార్షన్‌ అయిందని, మూడో బిడ్డ కోసం ఎదురు చూస్తున్న దంపతులకు మృత శిశువును డాక్టర్లు అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశారు.  వైఎస్సార్‌ సీపీ నాయకురాలు దుంగా మంగాలక్ష్మి డాక్టర్ల తో చర్చించారు. 

శిశువు మృతికి కుటుంబ సభ్యులే కారణం 
నవజాత శిశువు మృతికి కుటుంబ సభ్యులే కారణమని ఆసుపత్రి వైద్యులు ఆర్‌.ఎం.ఓ పద్మశ్రీ, పిల్లల వైద్యులు కృష్ణ ప్రకాష్, తదితరులు పేర్కొన్నారు. శిశువు ఏడుస్తుందని పటిక బెల్లం నీళ్లు, తల్లి పాలు పట్టించారని శిశువుకు ఊపిరి ఆడక మృతి చెందిందని, ఈ సంఘటనలో వైద్యుల నిర్లక్ష్యం లేదని వారు పేర్కొంటున్నారు. పుట్టిన పాపకు కనీసం వారం రోజుల వరకు పటికబెల్లం నీళ్లు పట్టించకూడదని, తల్లిపాలు, పటికబెల్లం నీళ్లు ఒకేసారి పట్టించడం వల్ల బిడ్డకు ఊపిరాడక మృతి చెందిందని తెలిపారు.

మరిన్ని వార్తలు