పొత్తిళ్ల వేళే..మృత్యుఘోష

21 Mar, 2019 12:10 IST|Sakshi
శిశుమరణంతో వేదనలో ఉన్న గిరిజన కుటుంబాన్ని ఓదారుస్తున్న జగన్‌ (ఫైల్‌)

అరణ్యసీమలో మార్మోగుతున్నమరణ మృదంగం

ఏటా వందల సంఖ్యలో శిశు మరణాలు

‘ఆకాశాన్నంటుతాయా’ అన్నంత ఎత్తున ఉండే మహావృక్షాల నుంచి.. అంగుళానికి మించని గడ్డిమొక్కల వరకూ లెక్కలేనన్ని వృక్షజాతులకు పురుడుపోస్తుంది అడవితల్లి. అలాంటి వనసీమలోనే పురిటికందులపై మృత్యుచ్ఛాయ పరుచుకుంటోంది. ‘అకాల’ యుముడి వికటాట్టహాసంతో ఎందరో పసిబిడ్డల కిలకిలలు మూగబోతున్నాయి. వారిని కన్నతల్లుల్నీ ప్రాణగండం వెన్నాడుతోంది. అయినా.. ఈ అరణ్యరోదన ఈ పాలకుల చెవిని సోకడం లేదు.’

సాక్షి, రంపచోడవరం: నవమాసాలు మోసి, పురిటి నొప్పులు పడి  బిడ్డలను ఈ లోకంలోకి తీసుకువచ్చిన వనసీమలో గర్భశోకమే మిగులుతోంది. ఆదివాసీల ఆరోగ్యంపై సర్కారు అలసత్వంతో పొత్తిళ్లలోనే ఎందరో శిశువులు మృత్యువాత పడుతున్నారు. గత అయిదేళ్లుగా ఏటా తూర్పు మన్యంలో వందల సంఖ్యలో శిశు మరణాలు సంభవిస్తున్నాయి. పురిటి నొప్పులతో వచ్చే గర్భిణులకు సకాలంలో వైద్యం అందదు. బాలారిష్టాలతోనే, పౌష్టికాహార లోపంతోనే జన్మించిన శిశువుల ప్రాణదీపాలను నిలిపే ఆధునిక సదుపాయాల సంగతి వేరే చెప్పనక్కర లేదు. అనారోగ్యంతో పుట్టిన బిడ్డకు తక్షణం వైద్యం చేసే దిక్కు లేక మృత్యువాత పడుతున్నారు. ఏజెన్సీలో ఉన్న ఎన్నో కొండవాగులు ఎండాకాలంలో ఇగిరిపోతుంటాయి. అయితే శిశువులు, బాలింతల మరణాల వల్ల ఆ కుటుంబాల చెక్కిళ్లపై అన్ని రుతువుల్లోనూ కన్నీటివాగులు జలజలా పారుతూనే ఉంటున్నాయి. ఏజెన్సీలో శిశు మరణాలను ఆరికట్టే చర్యలు తీసుకోవడంలో అధికార యత్రాంగం విఫలమైంది. 

పౌష్టికాహార లోపం పెనుశాపం 
ఏజెన్సీలో గర్భిణులకు సరైన వైద్యం, పౌష్టికాహారం అందకపోవడం వారి పాలిట శాపంగా మారుతోంది. వారికి సరైన సమయంలో వైద్యుల పర్యవేక్షణ లభించదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో ఇచ్చే మందులు సక్రమంగా వాడకపోవడంతో వాటి ప్రభావం పుట్టే పిల్లలపై పడుతుంది. ఎందరో శిశువులు తక్కువ బరువుతో, వ్యాధులతో జన్మించి రోజుల వ్యవధిలోనే ఊపిరి విడుస్తున్నారు. 
రక్తహీనతతో బాధ పడుతున్న గర్భిణులకు మందులు, పౌష్టికాహారం ద్వారా ఆ లోపాన్ని చక్కదిద్దడం లేదు. ఐటీడీఏ అధికారులు ప్రతి గ్రామంలో గర్భిణులను గుర్తించి కాన్పుకు కొద్ది రోజుల ముందే రంపచోడవరం ఏరియా ఆసుపత్రి తరలించాలని నిర్ణయించారు. అయితే క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదు. అనేక మంది గర్భిణులు ఇంటి వద్దే పురుడు పోసుకుంటున్నారు. గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఏరియా ఆసుపత్రిలో 296 ప్రసవాలు మాత్రమే జరిగాయ.  ఆసుపత్రుల్లో ప్రసవం సురక్షితమని ప్రచారం చేయడంలో, గర్భిణులు ప్రసవానికి ఆసుపత్రులకు వచ్చేలా చైతన్యం చేయడం చేయడంలో ఐటీడీఏ, వైద్య, ఆరోగ్యశాఖలు విఫలమవుతున్నాయి.

నిరుపయోగంగా ‘న్యూ బోర్న్‌ కేర్‌’ యూనిట్‌
రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో 2013లో స్పెషల్‌ న్యూబోర్న్‌ కేర్‌  యూనిట్‌ను ఏర్పాటు చేశారు. అయితే యూనిట్‌లో వివిధ రుగ్మతలతో చేర్చిన పిల్లల ఆరోగ్య సంరక్షణ, పర్యవేక్షణలకు చిన్న పిల్లలు వైద్య నిపుణులు (పిడియాట్రిక్‌) ఉండాలి. అయితే ఎంతో కాలంగా ఆ పోస్టును భర్తీ చేయడం లేదు. ఫలితంగా లక్షల రూపాయల ఖర్చుతో యూనిట్‌ ఏర్పాటు చేసిన లక్ష్యం నెరవేరడం లేదు. కేవలం ఇద్దరు ఎంబీబీఎస్‌ వైద్యులు, నర్సులు మాత్రమే ఈ యూనిట్లో పనిచేస్తున్నారు. గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 66 మంది పిల్లలను ఈ యూనిట్‌ నుంచి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి, కాకినాడ జీజీహెచ్‌లకు రిఫర్‌ చేశారు. అంటే అత్యవసర వైద్యం అందడం లేదని అర్థమవుతుంది. 

దారిలోనే గాలిలో కలుస్తున్న ఊపిరి
రంపచోడవరం నుంచి రాజమహేంద్రవరం, కాకినాడ తరలిస్తుండగానే ఎందరో శిశువుల ఊపిరి గాలిలో కలిసిపోతోంది. ఏజెన్సీలోని పీహెచ్‌సీల్లో అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడంతో అనారోగ్యంతో ఉన్న పిల్లలను మెరుగైన చికిత్సకు ఇతర ఆసుపత్రులకు తరలించే అవకాశం ఉండడం లేదు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 18 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఇవన్నీ 24 గంటలూవైద్య సేవలు అందించాలి. ఏ సమయంలో రోగి వచ్చినా వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి, అవసరమైతే వేరే ఆసుపత్రులకు రిఫర్‌ చేయాలి. అనేక సందర్భాల్లో పసిపిల్లలను అత్యవసర వైద్యం కోసం పీహెచ్‌సీలకు తీసుకువచ్చినా  వైద్యులు అందుబాటులో ఉండడం లేదు.  పీహెచ్‌సీల్లో వైద్యులు నివాసం ఉండేందుకు క్వార్టర్స్‌ లేకపోవడం ఇందుకు ఒక కారణం.

వైద్యులు లేని తల్లీపిల్లల ఆసుపత్రి
రాజవొమ్మంగి మండలంలో మాతాశిశు మరణాలు ఎక్కువగా సంభవించాయి. ఇక్కడ తల్లీపిల్లల ఆసుపత్రి ఉన్నా  పిడియాట్రిక్, గైనిక్‌ వైద్యనిపుణులను నియమించకపోవడంతో ఉపయోగం లేకుండా పోయింది. ఎంబీబీఎస్‌ వైద్యురాలితోనే ఆసుపత్రిని నడిపిస్తున్నారు. పేరుకు మాత్రమే 24 గంటల ఆసుపత్రిగా ఉంది. జడ్డంగి ప్రాంతంలోనూ మాతా శిశు మరణాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. అయినా ఆ  పీహెచ్‌సీకి నేటికీ అంబులెన్స్‌ సదుపాయం కల్పించలేదు. రాజవొమ్మంగి అంబులెన్స్‌ వస్తేనే అత్యవసర వైద్యం కోసం కాకినాడ తరలించే అవకాశం ఉంటుంది. ఏజెన్సీ ప్రధాన కేంద్రమైన రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో కూడా పిడియాట్రిక్‌ వైద్య నిపుణులు లేరు. పీహెచ్‌సీల నుంచి అత్యవసర వైద్యం కోసం వచ్చే కేసులను రాజమహేంద్రవరం  పంపిస్తున్నారు.

కొనసాగుతూనే ఉన్న కన్నీటికథలు 
అడవిబిడ్డలపై మృత్యువు నీడ పరుచుకునే ఉందనడానికి మంగళవారం జరిగిన మరో శిశుమరణమే సాక్ష్యం. పెద్ద గెద్దాడకు చెందిన నెరం కుమారి రెండు వారాల క్రితం పురిటి నొప్పులతో స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేరింది. ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి పంపగా సాధారణ ప్రసవం అయింది. పుట్టిన శిశువును బాక్స్‌లో పెట్టాలని, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి పంపారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. తల్లిదండ్రులు మృత శిశువును ఆర్టీసీ బస్సులో గెద్దాడకు తీసుకువచ్చారు. 


అయిదేళ్లుగా అంతులేని అలసత్వం
గత అయిదేళ్లలో ఏజెన్సీలో ఎన్నో మాతాశిశు మరణాలు సంభవిస్తున్నా అరికట్టేందుకు ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు. ఆదివాసీలు పౌష్టికార లోపంతో, రక్తహీనతతో బాధపడుతున్నా పట్టించుకోలేదు. మాతాశిశు సంరక్షణ శాఖ ద్వారా ఏజెన్సీలో శిశు మరణాలకు గల కారణాలపై సర్వే చేయించారు. సకాలంలో వైద్యం అందకపోవడం, పౌష్టికాహార లోపం గిరిజనులను పట్టిపీడిస్తున్నట్లు గుర్తించారు.  పౌష్టికాహారం అందించాలన్న నిర్ణయం కొండెక్కింది. ఇంత కాలం పౌష్టికాహారం, రక్తహీనత గురించి పట్టించుకోని సర్కారు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక పౌష్టికాహార కిట్లను పంపిణీ నిమిత్తం జీసీసీ డిపోలకు పంపింది.

కన్నీరు తుడిచిన జననేత 
గిరిజన ప్రాంతంలో మృత్యు తాండవాన్ని చూసి చలించిపోయిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  గత ఏడాది రంపచోడవరంలో శిశువులను కోల్పోయి, కంటికి కడివెడుగా విలపిస్తున్న కుటుంబాలను పరామర్శించారు. పార్టీ తరఫున వారికి ఆర్థిక సాయంఅందించారు. ఏజెన్సీలో వైద్య సేవలను మెరుగు పరిచి, గిరిజనుల బతుకుల్లో వెలుగు నింపుతామని హామీ ఇచ్చారు. 

గత ఐదేళ్లలో ఇదీ మృత్యుహేల..  

   సం.          పుట్టిన శిశువులు       మరణించిన వారు
2014             4604                      233
2015             4481                      239
2016             3854                      239
2017            3367                       103 
2018            4286                        43

మరిన్ని వార్తలు