హిందూపురం ఆస్పత్రిలో మరణమృదంగం

16 Jul, 2018 09:16 IST|Sakshi
ఈనెల 2వ తేదీ సిజేరియన్‌ కాన్పులో చనిపోయిన బిడ

150 పడకల ఆస్పత్రిలో ఒకరే గైనకాలజిస్ట్‌!

సకాలంలో అందని సేవలు

తగ్గితున్న ప్రసవాలు.. పెరుగుతున్న మాతాశిశు మరణాలు

ఆస్పత్రికి రావాలంటేనే హడలిపోతున్న జనం

హిందూపురం ఆస్పత్రి పేరుచెబితేనే గర్భిణులు హడలిపోతున్నారు. రూ.23 కోట్లు ఖర్చు చేసి అట్టహాసంగా ప్రారంభించిన మెటర్నిటీ చైల్డ్‌ హాస్పిటల్‌ (ఎంసీహెచ్‌)కు సిబ్బందిని నియమించకపోవడంతో దిష్టిబొమ్మలా మారింది. 150 పడకలు కలిగిన ఈ ఆస్పత్రిలో కేవలం ఒకే ఒక గైనకాలజిస్ట్‌ విధులు నిర్వర్తిస్తుండటంతో సకాలంలో వైద్యం అందక మాతాశిశు మరణాలు పెరిగిపోతున్నాయి. అందువల్లే చిన్నారుల కేరింతలు వినిపించాల్సిన ఆస్పత్రిలో మరణమృదంగం వినిపిస్తోంది. 

హిందూపురం అర్బన్‌: హిందూపురంలోని ఎంసీహెచ్‌లో మాతృరోదనలు వినిపిస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి వియ్యంకుడు బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో రూ.23 కోట్ల ఖర్చు చేసి మెటర్నిటీ చైల్డ్‌ హాస్పిటల్‌ (ఎంసీహెచ్‌) నిర్మించినా ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యంగా ప్రసవం కోసం ఇక్కడికొచ్చే మహిళలకు నరకం కనిపిస్తోంది. వైద్యుల కొరత... వైద్యసిబ్బంది నిర్లక్ష్యంతో మాతాశిశు మరణాల సంఖ్య పెరిగిపోతోంది. దాదాపు 150 పడకలు కలిగిన ఈ ఆస్పత్రిలో ఒకే ఒక గైనాకాలాజిస్ట్‌ ఉండటంతో వైద్యసేవలు అందడం లేదు. 

రిస్క్‌ ఎందుకని రెఫర్‌
మెటర్నిటీ చైల్డ్‌ హాస్పిటల్‌లో ఎక్కువగా ప్రసవాలు జరగాలి...కానీ సిబ్బంది లేక ఈ ఆస్పత్రి సాధారణ ప్రసాలకే పరిమితమైంది. రాజకీయ సిఫార్సులు చేయించుకుంటే అప్పడప్పుడూ సిజేరియన్లు చేస్తున్నారు. ఇక రిస్క్‌ కేసులు.. అర్ధరాత్రి వస్తున్న కేసులను అనంతపురానికి రెఫర్‌ చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో  సుదూరం నుంచి ఈ ఆస్పత్రికి వచ్చిన గర్భిణులు అనంతపురం వెళ్లలేక స్థానికంగా ఉన్న ప్రవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.

పెరిగిన మాతా శిశు మరణాలు
ఆస్పత్రుల్లో ప్రసవాలు చేయించుకుంటే తల్లీబిడ్డ క్షేమంగా ఉంటారని ఓ వైపు ప్రభుత్వం ప్రచారం హోరెత్తిస్తోంది. కానీ ఆస్పత్రుల్లో సిబ్బందిని మాత్రం నియమించడం లేదు. అందువల్లే హిందూపురం ఆస్పత్రిలో ప్రసవాలు జరుగుతున్నా...శిశువులు మాత్రం తల్లిఒడి చేరడం లేదు. గత ఏడాది 2017 జనవరి నుంచి నేటి వరకు ప్రసవ సమయంలో ముగ్గరు బాలింతలు ముగ్గురు మృత్యుఒడికి చేరగా...  157 మంది పురిటి బిడ్డలు తల్లిఒడికి చేరకముందే కళ్లుమూశారు. ఇక గర్భంలోనే చనిపోయిన శిశువుల సంఖ్య 87కు చేరింది. అందువల్లే ఇక్కడ మాతాశిశుమరణాలు... బాధితుల ధర్నాలు మామూలైపోయాయి. అయినప్పటికీ ఇటు ప్రభుత్వం..అటు ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఎందరో మాతృమూర్తులకు తీరని శోకం మిగులుతోంది.
= ఈనెల 2న మడకశిర మండలం చీపురుపల్లికి చెందిన నాగలక్ష్మికి సిజేరియన్‌ చేసినా మగబిడ్డ మృత్యువాతపడింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు చనిపోయిందంటూ కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
= జూన్‌ 30న రొద్దం మండలం కంబాలపల్లికి చెందిన శాంతమ్మకు సిజేరియన్‌ చేశారు. అనంతరం శిశువు ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని ఐసీయూలో ఉంచామని వైద్యులు చెప్పారు. ఆ తర్వాత మృత శిశువును చేతిలో పెట్టారు. దీంతో శాంతమ్మ కుటుంబీకులు న్యాయం చేయాలని రోడ్డెక్కెరు.. ఇలా ఆస్పత్రిలో తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయినా వైద్యాధికారులు నిమ్మకునీరెత్తినట్లు ఉండటం విమర్శలకు తావిస్తోంది.

ఇలాంటి మరణాలు మామూలే
ఆస్పత్రిలో ఇలాంటి మరణాలు మామూలే. అయితే ఇటీవల పెరగడం దురదృష్టకరం. బాధితుల చెప్పినట్లు వెంటనే వైద్యులపై చర్యలు తీసుకోలేము. దీనిపై విచారణ జరగాలి.. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్పత్రిలో కూడా వైద్యుల నియామకానికి చర్యలు తీసుకుంటున్నారు.    – కేశవులు,సూపరింటెండెంట్, హిందూపురం

మరిన్ని వార్తలు