పురిట్లోనే మృత్యుగీతం

18 Sep, 2018 14:43 IST|Sakshi

జిల్లాలో పెరుగుతున్న శిశుమరణాలు

పీహెచ్‌సీల్లో ప్రసవాలు చేయని వైనం

అరకొర డాక్టర్లతో ఇబ్బందులు

సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలం

కడుపులో బిడ్డ పడగానే ఆ తల్లితో పాటు కుటుంబసభ్యుల ఆనందం అంతా ఇంతా కాదు. ఆ బిడ్డ భూమిపై పడేంత వరకు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడటం సహజం. అయితే ఆ బిడ్డ భూమిపై క్షేమంగా వచ్చేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకోవడం లేదు. దీనిపై అధిక శాతం ప్రజలకూ అవగాహన లేదు. ఫలితంగా పుట్టీపుట్టగానే ఎంతో మంది శిశువులు ఈ లోకాన్ని వదిలివెళ్లిపోతున్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనే గత 20 నెలల కాలంలో 2వేల మంది శిశువులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.  

కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు నంద్యాల, ఆదోని మాతాశిశు కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలు ఉన్నచోట తల్లులతో పాటు పిల్లలకూ వైద్యం అందించే ఏర్పాట్లు చేయాలి. అయితే కర్నూలు, నంద్యాలలో మాత్రమే ప్రత్యేక శిశు సంరక్షణ కేంద్రాలు(ఎస్‌ఎన్‌సీయూ) ఏర్పాటు చేశారు. సున్నిపెంటలో దీనిని ఏర్పాటు చేసినా అక్కడికి రోగులు రాకపోవడంతోనిరుపయోగంగా ఉంచారు. జిల్లాలో సంవత్సరంలోపు పిల్లలకు ఎలాంటి తీవ్ర అనారోగ్య సమస్య ఏర్పడినా కర్నూలు, నంద్యాల ఆసుపత్రులకు రావాల్సిందే. కొన్నిసార్లు నంద్యాల నుంచి సైతం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకే శిశువులను మెరుగైన వైద్యం కోసం రెఫర్‌ చేస్తున్నారు. ఫలితంగా ఈ విభాగంలోని ఎస్‌ఎన్‌సీయూ, ఎన్‌ఐసీయూలకు శిశువుల తాకిడి అధికమైంది. 

అనధికారికంగా ఎన్‌ఐసీయూ విభాగం
పసిపిల్లలకు ప్రాణాధారం నియోనేటల్‌ ఇన్సెంటివ్‌ కేర్‌ యూనిట్‌(ఎన్‌ఐసీయూ). దీనిని ప్రతి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. అధికారికంగా జిల్లాలో దీనిని ఎక్కడా ఏర్పాటు చేయలేదు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగంలో పసిపిల్లల రద్దీ దృష్ట్యా అధికారులు అనధికారికంగా ఎన్‌ఐసీయూను ఏర్పాటు చేశారు. అధికారికంగా దీనిని మంజూరు చేయాలని అధికారులు పలుమార్లు వినతి పత్రాలు ఇస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఈ విభాగం ఏర్పాటైతే వైద్యులతో పాటు పారామెడికల్‌ సిబ్బంది పోస్టులు మంజూరై పసిపిల్లలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఈ విభాగంలో నిత్యం 30 నుంచి 40 మందికి పైగా పసిపిల్లలు చికిత్స పొందుతూ ఉంటారు. ఇక్కడి ఎస్‌ఎన్‌సీయులో 20 పడకలు ఉండగా ఒక్కోసారి ఒక్కో రేడియంట్‌ వార్మర్‌పై ఇద్దరేసి పిల్లలకు చికిత్స అందిస్తున్నారు. 

శిశు మరణాలకు ప్రధాన కారణాలివే..
నెలలు నిండకముందే జన్మించడం, తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఆమెకు బీపీ అధికంగా ఉండటం, పిల్లలు బరువు తక్కువగా ఉండి జన్మించడం శిశువుల మరణాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఈ సమస్యను నివారించేందుకు గాను క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నా గర్భవతులకు అందే పోషకాహారం నాసిరకంగా ఉండటం, ఆ పోషకాహారాన్ని సైతం సక్రమంగా తల్లికి అందకపోవడం, ఇంటికి తీసుకెళ్లిన సరుకులను కుటుంబసభ్యులందరూ ఆహారంగా తీసుకోవడం వల్ల తల్లికి పోషకాహారలోపం ఏర్పడుతోంది. ఈ కారణంగా ఆ ప్రభావం పుట్టబోయే బిడ్డపై పడుతోంది.  

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొరవడిన సౌకర్యాలు
జిల్లాలోని ప్రతి సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో గైనకాలజిస్టుతో పాటు పీడియాట్రిషిన్, అనెస్తెటిస్ట్‌ పోస్టులు మంజూరు చేయాల్సి ఉంది. జిల్లాలోని 18 కేంద్రాల్లో  నాలుగింటిలో మాత్రమే పోస్టులు మంజూరయ్యాయి. మిగిలిన వాటిలో ఎంబీబీఎస్‌ స్థాయి వైద్యులే చికిత్స అందిస్తున్నారు. రౌండ్‌ ది క్లాక్‌ పీహెచ్‌సీలు జిల్లాలో 40 ఉన్నా అందులో కనీసం ప్రసవాలు కూడా సరిగ్గా జరడం లేదు. అధిక శాతం ప్రసవాలు కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లల విభాగంలో మూడు యూనిట్లు మాత్రమే ఉన్నాయి. అందులో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్, ఒక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఉన్నాయి. ఇతర విభాగాల్లో రెండు అసిస్టెంట్‌ పోస్టులుండగా ఇక్కడ ఒక్కటి మాత్రమే ఉంది. పిల్లల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అనధికారికంగా నాలుగో యూనిట్‌ను నిర్వహిస్తున్నారు. పిల్లల సంఖ్యకు అనుగుణంగా వైద్యులు, సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు.  కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాలతో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి సైతం తీవ్ర అస్వస్థతకు గురైన పిల్లలను ఇక్కడికే మెరుగైన వైద్యం కోసం పంపిస్తున్నారు.

సౌకర్యాలు మరింతగాపెంచాల్సి ఉంది
చిన్నపిల్లల విభాగంలో చికిత్స కోసం వచ్చే పిల్లల సంఖ్య బాగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా వైద్యులు పోస్టులు, సౌకర్యాలు ఉండటం లేదన్నది వాస్తవం. అదనంగా మరో ఎస్‌ఎన్‌సీయూ మంజూరు చేయాలని, ఎన్‌ఐసీయూకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాం. ఈ విభాగానికి అధికంగా ఇతర జిల్లాల నుంచి, ప్రైవేటు ఆసుపత్రుల నుంచి శిశువులు, పిల్లలను రెఫర్‌ చేస్తున్నారు. పరిస్థితి విషమించి ఇక్కడకు వచ్చిన వారు మరణిస్తుండటంతో ఈ ఆసుపత్రిలో మరణాలు ఎక్కువగా ఉన్నాయన్న భావన కలుగుతోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం మా విభాగంలో శిశువుల మరణాలు తక్కువగా ఉన్నాయి.  
–డాక్టర్‌ జి. రమాదేవి, చిన్నపిల్లల విభాగం ప్రొఫెసర్, పెద్దాసుపత్రి

మరిన్ని వార్తలు