వారి ఆలస్యం పాప ప్రాణాలను తీసింది

15 Sep, 2019 09:50 IST|Sakshi

సాక్షి, తుని : చిన్నారి ప్రాణాలను కాపాడుకొనేందుకు ఆ తల్లిదండ్రులు ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఎంతో ఖర్చు పెట్టి వైద్యం చేయించారు. చివరికి ఆమెకు డెంగీ ఉన్నట్టు నిర్ధారణ కావడంతో కాకినాడ తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతుండగా, ఇంటిలోంచి సొమ్ము తెచ్చుకోవడంలో ఆలస్యమైంది. ఆ ఆలస్యమే పాప ప్రాణాలను తీసింది. డెంగీతో ఆ పాపకు ఊపిరి తీసుకోలేకపోతుంటే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ పెట్టి కాకినాడ జీజీహెచ్‌కు తరలించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. సొమ్ము కోసం ఇంటికి పరుగున వెళ్లిన ఆ పాప తిరిగి ఆస్పత్రికి వచ్చేసరికి.. ఆ పాప ప్రాణాలు కోల్పోయింది.

స్థానిక 4వ వార్డుకు చెందిన నాగులాపల్లి స్వాతిశ్రీ (5)కి తొలుత సాధారణ జ్వరమని ఆర్‌ఎంపీతో వైద్యం చేయించారు.టైఫాయిడ్, మలేరియాకు మందులు కూడా వాడించారు. చివరకు పరిస్థితి విషమించడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆమె డెంగీతో మృతి చెందింది. నాగులాపల్లి నాగేశ్వరరావు, జ్యోతిలకు ఇద్దరు పిల్లలు. ఇందులో స్వాతిశ్రీ ఆఖరి కుమార్తె. రెండు వారాల క్రితం జ్వరం వస్తే పట్టణంలోని ఆర్‌ఎంపీతో వైద్య పరీక్షలు చేయించి టైఫాయిడ్, మలేరియాకు మందులు వాడించారు.

రెండు రోజల క్రితం ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేటు పిల్లల ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యుడు ఆమెకు డెంగీ ఉన్నట్టు చెప్పారు. ఆమె రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ 47వేలకు పడిపోయింది. వెంటనే కాకినాడ తీసుకువెళ్లాలని వైద్యుడు రిఫర్‌ చేశారు. దీంతో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉండడంతో ఆమెకు ఆక్సిజన్‌ పెట్టి అంబులెన్స్‌లో ఎక్కించారు. చేతిలో సొమ్ము లేకపోవడంతో తల్లి జ్యోతి ఇంటికి వెళ్లి రావడం ఆలస్యమైంది. ఈలోగా పాప ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 

కట్టలు తెంచుకున్న తల్లిదండ్రుల ఆవేదన 
కంటికి రెప్పలా చూసుకున్న చిన్నారి ఇక తిరిగిరాదన్న విషయం తల్లిదండ్రుల ఆవేదన కట్టలు తెచ్చుకుంది. ముందే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చి ఉంటే ప్రాణాలను కాపాడుకునే వాళ్లమని దుఃఖంతో కన్నీరుమున్నీరయ్యారు. డెంగీ చికిత్సకు ఆరోగ్యశ్రీలో అవకాశం కల్పించినప్పటికీ చిన్నారిని బతికించుకోలేక పోయామని ఆవేదన చెందారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. డెంగీ నిర్ధారణ పరీక్ష తునిలో అందుబాటులో లేకపోవడంతో చాలా మంది ప్రైవేటు ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు. పురపాలక సంఘం అధికారులు పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు