వచ్చీరాని వైద్యానికి చిన్నారి బలి

13 Mar, 2019 13:57 IST|Sakshi
రిషిక

ఇంజెక్షన్‌ అధిక డోసు వేయడంతో ఇన్‌ఫెక్షన్‌కు గురైన కాలు

మూడు రోజుల తర్వాత పరిస్థితి విషమించి మృతి

పీఎంపీపై పోలీసులకు మృతురాలి తల్లి ఫిర్యాదు

సాక్షి, చంద్రగిరి(చిత్తూరు) : ఓ ఆర్‌ఎంపీ వైద్యం వికటించి చిన్నారి మృతి చెందిన సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి తల్లిదండ్రుల కథనం..చంద్రగిరి కొత్తపేటకు చెందిన లోకనాథం, శాంతమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు. లోకనాథం సీనియర్‌ ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేయడంతోపాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం లోకనాథం కుమార్తెలు విషిక, రిషిక(9) జ్వరం బారిన పడడంతో స్థానిక ప్రైవేట్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌ సుధాకర్‌ వద్దకు తీసుకెళ్లారు. అతను రాసిచ్చిన ప్రిస్కిప్షన్‌ మేరకు అతని మందుల షాపులోనే మందులు కొని తీసిచ్చారు.

తొలుత విషికకు సుధాకర్‌ చికిత్స చేశారు. అనంతరం రిషికకు వేర్వేరు నడుం దిగువ భాగంలో ఇంజెక్షన్లు వేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం రిషిక కాలుకు తీవ్రంగా వాపు రావడంతో మరోసారి సుధాకర్‌ను సంప్రదించారు. ఇదేమీ కాదని వారికి ఆయన చెప్పారు. అంతేకాకుండా అతని సూచన మేరకు రిషిక కాలుకు వేడినీటితో కాపడం పెట్టారు. సోమవారం ఉదయం పాప కాలు పూర్తిగా వాచిపోవడంతో పాటు వాంతులయ్యాయి. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు తాటితోపు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వెద్యులు చెప్పడంతో అక్కడి నుంచి తిరుపతిలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు.

పాపకు పలు వైద్యపరీక్షలు చేసిన వైద్యులు, చంద్రగిరిలో పాపకు వేసిన ఇంజెక్షన్‌ వలన కాలుకు ఇన్‌ఫెక్షన్‌కు గురైందని, దీనివలన శరీరంలో రక్తం పూర్తిగా గడ్డకట్టడంతో పాటు ప్రాణాపాయ స్థితికి చేరిందని వెల్లడించారు. అనంతరం చికిత్స ప్రారంభించేలోపు పాప కన్నుమూసింది. మృతదేహంతో చంద్రగిరికి చేరుకున్న తల్లిదండ్రులు తమ కుమార్తె మృతికి కారణమైన పీఎంపీ సుధాకర్‌ను కఠినంగా శిక్షించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం మధ్యాహ్నం రిషికకు అంత్యక్రియలు నిర్వహించారు.

అనుమతులు లేకున్నా క్లినిక్స్‌ నిర్వహణ

చంద్రగిరిలో అనుమతులు లేకుండా పీఎంపీలు క్లినిక్స్‌ నిర్వహిస్తున్నారు. వాస్తవానికి పీఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని నిబంధన ఉంది. అయితే కొందరు ఏకంగా మెడికల్‌ షాపులు సైతం అనుబంధంగా పెట్టి, ఆపరేషన్లు సైతం చేస్తుండటం గమనార్హం! మిడిమిడి జ్ఞానంతో రోగుల జీవితాలో చెలగాటమాడుతున్నారు. సుధాకర్‌ కూడా ఆపరేషన్లు చేసేవాడని స్థానికుల ద్వారా తెలిసింది. ఇతని సర్టిఫికెట్‌కి వ్యాలిడిటీ లేకపోయినా సంబం«ధిత అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. క్లినిక్‌కు అనుబంధంగా సుధాకర్‌ ఓ మెడికల్‌ షాపును సైతం నిర్వహిస్తున్నారు. ఇదలా ఉంచితే, సుధాకర్‌ రాసిచ్చిన మందుల ప్రిస్కిప్షన్‌ను మండల స్థాయి వైద్యాధికారి దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లింది.దానిని పరిశీలించిన ఆయన అవి నాసిరకమైన లోకల్‌ మందులుగా ఉన్నాయని, కంపెనీవి కావని వైద్యాధికారి చెప్పారు.

నిద్రావస్థలో వైద్య, ఆరోగ్య శాఖ

జిల్లాలో కొన్నిచోట్ల పీఎంపీలు ఎలాంటి అనుమతి లేకుండా చికిత్స, ఆపరేషన్లు చేస్తున్నా వైద్య, ఆరోగ్యశాఖ దృష్టి సారించడం లేదనే విమర్శలొస్తున్నాయి. దీనిపై డీఎంహెచ్‌ఓను వివరణ కోరగా అది తమ పరిధిలోకి రాదని, డ్రగ్స్‌ అధికారులు చూసుకోవాలంటూ ఫోన్‌ పెట్టేశారు.

మరిన్ని వార్తలు