ప్రాణం తీసిన టాబ్లెట్‌

9 Aug, 2019 12:30 IST|Sakshi
మృతి చెందిన జశ్వంత్‌నాయుడు

అవగాహనా రాహిత్యం ఆ చిన్నారి ప్రాణాలను బలిగొంది. సిబ్బంది నిర్లక్ష్య వైఖరి ఆ కుటుంబానికి కడుపుకోత మిగిల్చింది. నులిపురుగుల నివారణకోసం ఇచ్చిన మాత్ర అభంశుభం తెలియని ఆ బాలుని ఆయుష్సు తీసింది. గరుగుబిల్లి మండలం కె.ఆర్‌.ఎన్‌.వలస అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్తలు అందించిన మాత్ర బాలుని నాన్నమ్మ మింగించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. బిడ్డను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల రోదన అందరి మనసులనూ కలచివేసింది.

సాక్షి, పార్వతీపురం (విజయనగరం): పొట్టలో నులి పురుగులు చంపేందుకు వేసిన మాత్ర ఓ బాలుడు ప్రాణం తీసిన ఘటన కేఆర్‌ఎన్‌వలస గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా కేఆర్‌ఎన్‌వలస గ్రామం అంగన్‌వాడీ కేంద్రంలో కొట్నాన జశ్వంత్‌నాయుడు(2)కు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఆల్‌బెండ్‌జోల్‌ మాత్రను అంగన్‌వాడీ నిర్వాహకులు అందించారు. బాలుడి నాన్నమ్మ అప్పమ్మ ఒడిలో పడుకోబెట్టి ఏఎన్‌ఎం మరడాన సుమతి, అంగన్‌వాడీ నిర్వాహకురాలు కొట్నాన సరస్వతి మాత్రను మింగించారు. తొలుత బాలుడు మాత్రను మింగలేక కక్కేయడంతో రెండోసారి బాలునిచే మింగించారు. మాత్ర మింగిన కొద్ది సేపటికే బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే తల్లిదండ్రులు కొట్నాన చంద్రశేఖరరావు, సుజాత పార్వతీపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లమని అక్కడి వైద్యులు చెప్పడంతో వెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించే సమయానికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

ఆస్పత్రికి చేరుకొన్న అధికారులు
మాత్ర వికటించిన సంఘటనలో బాలుడు మృతి చెందాడని తెలుసుకొన్న డీఎంహెచ్‌ఓ విజయలక్ష్మీ,స్థానిక వైద్యులు పీఏ ప్రియాంక, ఎంపీడీఓ గోపాలకృష్ణ, తహసీల్దార్‌ అజూరఫీజాన్, ఎస్‌ఐ సింహచలం ఆస్పత్రికి చేరుకొని సంఘటనకు గల కారణాలు తెలుసుకున్నారు. దర్యాప్తు చేసి క్రమశిక్షణ చర్యలు చేపడతామన్నారు. విషయం తెలుసుకున్న తహ సీల్దార అజూరఫీజాన్, ఎంపీడీఓ ఎంవీ గోపాలకృష్ణ, కేఆర్‌ఎన్‌ వలస వెళ్లారు. వివరాలు సేకరించారు.

మరో నలుగురు
అల్‌బెండజోల్‌ మాత్రను వేసుకొన్న మరో నలుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారని స్థానికులు బావించి చిన్నారులను పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. వారి పరిస్థితి బాగానే వుందని వైద్యులు తనిఖీలు చేసి పంపించారు.

నివేదిక ఇవ్వండి : మంత్రి
బాలుడి మృతికి కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదికను అందించాలని డీఎంహెచ్‌ఓ విజయలక్ష్మికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ఫోన్‌లో ఆదేశించారు. ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంటో నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు.

తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు..
రైల్వేలో ఉద్యోగం చేసుకుంటూ కాకినాడలో స్థిరపడిన చంద్రశేఖర్, సుజాతలు తన సొంత గ్రామమైన కొట్నాన రామినాయుడు వలస వచ్చారు. తల్లిదండ్రులు శివున్నాయుడు, అప్పమ్మలను చూసేందుకు వచ్చారు. శుక్రవారం కాకినాడ వెళ్లేందుకు సిద్ధం కాగా గురువారం నులిపురుగులు దినోత్సవం కావడంతో తన కుమారుడికి కూడా మాత్రవేసి పొట్టలో నులిపురుగులు ఏమైనా ఉంటే చనిపోతాయని భావించి అంగన్‌వాడీ కేంద్రానికి నాన్నమ్మ అప్పమ్మతో పంపించారు. అక్కడ ఇచ్చిన మాత్రను మింగిన తరువాత తన కుమారుడు మృతి చెందాడని రోదిస్తూ పుట్టెడు దుఖఃంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు. బాలుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.  మృతదేహానికి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. 

మొదటి సంతానానికి మాత్ర కాటేసింది
చంద్రశేఖర్, సుజాతల మొదటి సంతానం జశ్వింత్‌నాయుడు సొంత గ్రామంలో మాత్ర రూపంలో మృత్యువు కాటేసిందని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. ఈ సంఘటన అందర్ని కన్నీరు తెప్పించింది. కాగా సుజాత ప్రస్తుతం గర్భిణి కావడంతో మరణించిన వార్త ఆమెకు ఏమవుతుందోనని కుటుంబ సభ్యులు  మరింత ఆందోళన చెందుతున్నారు.   

మరిన్ని వార్తలు