బాలికల వీరంగంపై సీరియస్‌

19 Feb, 2019 13:40 IST|Sakshi
హెచ్‌ఎం, ఉపాధ్యాయులను విచారిస్తున్న హైమావతి, కొండా రవికుమార్‌

తరగతి గదిలో మద్యం తాగిన విద్యార్థినుల వ్యవహారంపై బాలల హక్కుల కమిషన్‌ దృష్టి

రామవరప్పాడు జెడ్పీ హైస్కూల్‌లో విచారణ .. ఉపాధ్యాయులపై చైర్‌పర్సన్‌ హైమావతి ఆగ్రహం

కృష్ణాజిల్లా, రామవరప్పాడు (గన్నవరం): విజయవాడ రూరల్‌ మండలం నిడమానూరులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సోమవారం రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్‌పర్సన్‌ జి. హైమావతి విచారణ నిర్వహించారు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు తరగతి గదిలో మద్యం సేవించిన వ్యవహారంపై కమిషన్‌ స్పందించింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కమిషన్‌ చైర్‌పర్సన్‌ హైమావతి, సభ్యులు ఎస్‌వీ కృష్ణకుమార్, డీవైఈవో కొండా రవికుమార్, ఎంఈవో, చైల్డ్‌లైన్‌ సభ్యులు పాఠశాలకు వచ్చారు. హెచ్‌ఎం బీ. సురేష్‌కుమార్‌తోపాటు 50 మంది ఉపాధ్యాయుల బృందంపై కమిషన్‌ చైర్‌పర్సన్, డీవైఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో.. అది కూడా తరగతి గదిలో ఇంత జరుగుతున్నా మీరు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులపై నిరంతర పర్యవేక్షణ కొరవడితేనే ఇలాంటి ఘటనలు ఎదురవుతాయన్నారు. గతంలో కూడా పాఠశాలలో జరిగిన ఇటువంటి ఘటనలపై ఫిర్యాదులు అందాయని చెప్పారు.

తెలిసి, తెలియక బాలికలు చేసిన తప్పుకు టీసీలు ఇచ్చి పంపడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడ్డ బాలికలను బాలల సదన్‌లో 15 రోజులపాటు ఉంచి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని సూచించారు. వీరిలో పరివర్తన వచ్చిన తర్వాత తిరిగి పాఠశాలలో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ విద్యార్థులను మంచి నడవడికలో పెట్టే బృహత్తర బాధ్యత తొలుత ఉపాధ్యాయులదేనని చెప్పారు. ప్రతి విద్యార్థిపై నిఘా ఉంచాలని, పాఠశాలకు రాకపోయినా, తరగతులకు హాజరుకాకపోయినా వెంటనే వారి తల్లిదండ్రులకు తెలియపరచాలని సూచించారు. అవసరమైతే ఈ ఘటనకు పాల్ప డిన బాలికల తల్లిదండ్రులు, బాలికలను నేరుగా వారి ఇళ్ల వద్దే కలిసి కౌన్సెలింగ్‌ ఇస్తామన్నారు. వారానికి ఒకసారి సైకాలజిస్టులతో పాఠశాలలోని విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలో తప్పనిసరిగా సలహాలు, సూచనలు – ఫిర్యాదుల బాక్సులను ఉంచాలని, దీనికి ఒక కమిటీని నియమించాలని ఆదేశించారు. విద్యార్థులు అడ్డదారులు తొక్కకుండా పాఠశాలకు వచ్చేపోయే సమయంలో గస్తీ నిర్వహించాలని పోలీసు అధికారులను కోరారు.

బయటి వ్యక్తుల ప్రమేయానికి విద్యార్థుల బలి..
విచారణలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయుల బృందంతో మాట్లాడిన హైమావతికి పలు ఆసక్తికరమైన విషయాలను టీచర్లు వెల్లడించారు. పాఠశాల బయటి వ్యక్తులు, పోకిరీలు విద్యార్థులను అడ్డదారులకు ప్రేరేపిస్తున్నారన్నారు. పాఠశాల గేటు వద్ద కాపు కాసి విద్యార్థుల్ని ప్రలోభానికి గురి చేస్తున్నారని తెలిపారు. గతంలో పాఠశాల విద్యార్థి మద్యం సీసాలతో పాఠశాల భవనం ఎక్కి బయటి వ్యక్తులతో మద్యం సేవించిన విషయాన్ని వారు కమిషన్‌ దృష్టికి తీసుకొచ్చారు. అప్పట్లో బయటి వ్యక్తులను మందలించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. అయితే, ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.

ఆ విద్యార్థినులకు కౌన్సెలింగ్‌ : డీఈవో
మచిలీపట్నం: విజయవాడ నగర శివారులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మద్యం తాగి స్కూల్‌కు వస్తున్న ఇద్దరు విద్యార్థినులకు వారం రోజుల పాటు ఐసీడీఎస్‌ అధికారుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇప్పించే ఏర్పాట్లు చేసినట్లు డీఈవో ఎంవీ రాజ్యలక్ష్మి వెల్లడించారు. ఇద్దరు విద్యార్థినులు తరచూ మద్యం సేవించి పాఠశాలకు వస్తుండగా, ఈ విషయం శనివారం వెలుగులోకి వచ్చిన విష యం తెలిసిందే. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికలు మద్యం సేవించి, పాఠశాలకు వస్తుండటం విద్యా శాఖలో సర్వత్రా చర్చకు దారి తీసింది. దీనిపై విద్యా శాఖ ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగారు. అలాగే, ఐసీడీఎస్‌ అధికారులతో పాటు, పోలీసులు కూడా వివరాలు సేకరించారు. దీనిపై సమగ్ర వివరాలను తెప్పిం చుకునే క్రమంలో డెప్యూటీ డీఈవోను విచారణకు ఆదేశించినట్లు డీఈవో రాజ్యలక్ష్మి తెలిపారు. మద్యం సేవించిన బాలికలకు విజయవాడలోని బాలికల సదనంలో వారం రోజుల పాటు ఉంచి కౌన్సెలింగ్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. వారి భవి ష్యత్‌ దృష్ట్యా టీసీలు ఇవ్వబోమని, సత్ప్రవర్తనకు తీసుకొచ్చి, మళ్లీ పాఠశాలలో చేర్చుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు