ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే..

30 May, 2019 08:53 IST|Sakshi
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్న ఆయన బాల్య మిత్రులు వరప్రసాద్, డాక్టర్‌ శివరామ్, హర్ష, భావన, రవీంద్రనాథ్, శ్యామ్‌సుందర్, అమీర్‌ అలీ ఖాన్‌ (ఎడమ నుంచి కుడికి)

జగన్‌ సీఎం కావడం పట్ల బాల్యమిత్రుల ఆనందోత్సాహాలు

హైదరాబాద్‌లో గెట్‌ టు గెదర్‌ ఏర్పాటు చేసుకున్న చిన్ననాటి స్నేహితులు

ఆనాటి మధురానుభూతులు గుర్తు చేసుకుంటూ సంబరాలు

మిత్రుడు సీఎం కావడం పట్ల గర్వంగా ఉందంటూ ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్‌కు మేలు జరగాలంటూ ఆకాంక్ష

నాటి మా క్లాస్‌ లీడర్, స్కూల్‌ కెప్టెన్‌.. నేడు సీఎం అయ్యారు. మాతో కలిసి ఆడుకున్న, చదువుకున్న, దెబ్బలాడుకున్న, ఆనందం పంచుకున్న వ్యక్తి ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా రాజకీయ పార్టీ స్థాపించి ప్రజల ఆదరాభిమానాలతో అఖండ మెజారిటీ సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మా బాల్య స్నేహితుడు సీఎం కావడం.. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ (హెచ్‌పీఎస్‌) నుంచి 1991లో ప్లస్‌ 2 పూర్తి చేసుకున్న మాకందరికీ ఎంతో గర్వకారణం. వివిధ దేశాల్లో, వివిధ ప్రాంతాల్లో పలు హోదాల్లో ఉన్న మా మిత్రులంతా ఇదే చర్చించుకుంటున్నారు. మా చిన్ననాటి మిత్రుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అన్ని విధాలా మేలు జరగాలని ఆశిస్తున్నాం. జగన్‌ హయాంలో ఏపీ సర్వతోముఖాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. – హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ బాల్యమిత్రులు

సాక్షి, అమరావతి : ‘మాతో కలిసి చదువుకున్న వైఎస్‌ జగన్‌లో చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు మెండుగా ఉండేవి. హైదరాబాద్‌ బేగంపేటలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ (హెచ్‌పీఎస్‌)లో ప్లస్‌ 2 వరకూ ఆయన మాతోపాటే చదువుకున్నారు. క్రీడల్లో చాలా చురుగ్గా పాల్గొనేవారు. క్లాస్‌ లీడర్‌గా, హౌస్‌ కెప్టెన్‌గానూ ఉండేవారు. మా లీడరే నేడు ఆంధ్రప్రదేశ్‌ సీఎం కావడం ఆనందంగా ఉంది. అమెరికా, చైనా తదితర దేశాల్లో ఉన్న పూర్వ మిత్రులు కూడా ఈ అంశాన్ని ఫోన్‌ ద్వారా పంచుకుని ఆనందించాం. మా ప్లస్‌ టు 1991లో పూర్తయింది. తర్వాత కూడా జగన్‌తో మా అనుబంధం కొనసాగింది. తర్వాత కాలంలో చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు తదితర కారణాలతో దూరప్రాంతాలకు వెళ్లడం, ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటం వల్ల ఎక్కువగా కలవలేకపోయాం. జగన్‌ విద్యార్థిగా, విద్యార్థి నాయకుడిగా అందరితో చాలా చనువుగా ఉండేవారు’ అని నాటి హెచ్‌పీఎస్‌ విద్యార్థులు ‘సాక్షి’తో తమ ఆనందం పంచుకున్నారు.

స్టూడెంట్‌ లీడర్‌..
వైఎస్‌ జగన్‌ మా అందరికీ స్కూల్‌లో నాయకుడు. ఆయన నాగార్జున హౌజ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తే.. నేను డెప్యూటీ హెడ్‌బాయ్‌గా పనిచేశాను. నాకంత పని ఉండేది కాదు. కానీ, హౌజ్‌ కెప్టెన్‌ అనేది అత్యంత కీలకం. ఆ కీలక బాధ్యతలను జగన్‌ చాలా సులభంగా నిర్వర్తించేవారు. ప్లానింగ్, కో–ఆర్డినేషన్, ఎగ్జిక్యూషన్‌ పర్‌ఫెక్ట్‌గా ఉండేది.  
– సుమంత్, సినీ నటుడు

ఆనందాన్ని చెప్పడానికి మాటల్లేవు
నా పేరు వరప్రసాద్‌. నేను హైదరాబాద్‌లో హెచ్‌ఆర్, లేబర్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాను. మా బాల్య మిత్రుడు సీఎం అవుతున్నందుకు మా ఆనందాన్ని చెప్పడానికి మాటలు లేవు. నేను, జగన్‌ ప్లస్‌ టు వరకూ కలిసే చదువుకున్నాం. తర్వాత ఆయన డిగ్రీ వేరే కళాశాలలో చేరినా నిజాం కళాశాలలో ఉన్న మా వద్దకు తరచూ వచ్చేవారు. అందువల్ల మా స్నేహం కొనసాగింది. ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్నప్పుడు మాత్రం వెళ్లి కలిశాను. చాలా ఆనందంగా, ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ అనుభూతి మాటలకందనిది. మా బాల్య స్నేహితుడు సీఎం అవుతున్నారని తేలిపోవడంతో చాలామంది ఫోన్‌ చేసి ఒకరికొకరం అభినందనలు చెప్పుకున్నాం. జగన్‌ సీఎం అవుతున్న సందర్భంగా ఇప్పుడు మళ్లీ ఇక్కడ మా స్నేహితురాలు భావన సంతోషంతో గెట్‌ టు గెదర్‌కు మిత్రులను ఆహ్వానించారు. దూరదృష్టి ఉన్న జగన్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.    
– వరప్రసాద్, హైదరాబాద్‌

ఆంధ్ర ప్రజలకు ధన్యవాదాలు
నా పేరు భావన. నేను హైదరాబాద్‌లో బంగారు నగల వ్యాపార సంస్థ నిర్వహిస్తున్నాను. గతంలో మా స్కూల్‌ నుంచే మా సీనియర్‌ కిరణ్‌ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మాతో కలిసి చదువుకున్న స్నేహితుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కావడం మాకెంతో గర్వంగా, ఆనందంగా ఉంది. జగన్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మా ధన్యవాదాలు. జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన లాగే జగన్‌ కూడా అందరి ఆదరాభిమానాలు చూరగొనాలని ఆశిస్తున్నా.
– భావన, హైదరాబాద్‌.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ముక్కుసూటిగా మాట్లాడేవారు
క్లాస్‌ లీడర్‌గా, హౌస్‌ కెప్టెన్‌గా జగన్‌ ఏ అంశంపై అయినా ముక్కుసూటిగా మాట్లాడేవారు. అందరితో మంచి సంబంధాలు కలిగి ఉండేవారు. అందువల్లే ఆయనంటే అందరికీ అభిమానం. ఇప్పుడు ఇలాగే రాష్ట్ర ప్రజలందరి అభిమానం సంపాదించి ముఖ్యమంత్రి అయ్యారు. ఇది మాకు గర్వించే అంశం. కొన్ని రోజుల తర్వాత వీలు చూసుకుని అందరం వెళ్లి కలిసి తీపి గుర్తులు పంచుకుని వస్తాం.   
–హర్ష, హైదరాబాద్‌

ఇది మాకు చారిత్రాత్మక రోజు
నా పేరు సుధీర్‌. నేను హెచ్‌పీఎస్‌లో నాగార్జున హౌస్‌లో ఉండేవాడిని. మా హౌస్‌కు, స్కూల్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌కు కెప్టెన్‌ జగనే. ఫుట్‌బాల్‌లో షీల్డు కూడా సాధించారు. జగన్‌లో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయని మేం అప్పట్లోనే గుర్తించాం. జగన్‌ ముఖ్యమంత్రి అయిన ఈ రోజు మాకు చారిత్రాత్మకమైన రోజు. జగన్‌కు శుభాభినందనలు.     
– సుధీర్, హైదరాబాద్‌

ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలి
మా దగ్గర చదువుకున్న జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కావడం ఆయనకు చదువు చెప్పిన గురువుగా నాకెంతో గర్వంగా ఉంది. జగన్‌ 12వ తరగతిలో ఎస్వీడబ్ల్యూ కెప్టెన్‌గా విద్యార్థులకు ఎన్నో విషయాల్లో మార్గదర్శిగా ఉండేవారు. ఇంతటి అఖండ ఘనవిజయాన్ని సాధించిన జగన్‌కు శుభాభినందనలు. జగన్‌ నిబద్ధతకు, క్రమశిక్షణకు మేమెంతగానో గర్విస్తున్నాం. రాష్ట్రానికి సుపరిపాలన అందించాలని, భావితరాలకు స్ఫూర్తివంతమైన నాయకుడిగా ఉండాలని కోరుకుంటున్నా. జగన్‌ ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తున్నా.          
– చంద్రశేఖర్, మ్యాథమెటిక్స్‌ టీచర్‌

రియల్‌ లీడర్‌ జగన్‌
నేను జగన్‌కు ఏడాది జూనియర్‌. క్లాస్‌ లీడర్‌గా, హౌస్‌ కెప్టెన్‌గా జగన్‌ మార్గదర్శకత్వం వహించిన తీరు చూసి మంచి నాయకత్వ లక్షణాలున్నాయని గుర్తించాం. పదేళ్లు ప్రజల కోసం పోరాటం చేసి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నికై రియల్‌ లీడర్‌ అని చాటుకున్నారు. ఇది మాకెంతో ఆనందదాయకం. ఇది మాకు ప్రత్యేకంగా గుర్తుండిపోయే రోజు.     
– ఎన్‌.రమేష్, హైదరాబాద్‌

పదేళ్ల పోరాటం,ప్రజల అభిమానం ఫలితమిది
ఇంతటి ఘనవిజయం సాధించిన నా చిన్ననాటి మిత్రుడు జగన్‌కు అభినందనలు. పదేళ్ల పోరాటం, ప్రజల అభిమానంతోనే జగన్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాల్లో ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నా. జగన్‌కు ఉన్న పట్టుదల, క్రమశిక్షణ, దూరదృష్టి ఆంధ్రప్రదేశ్‌ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతాయని సంపూర్ణ విశ్వాసం ఉంది.              
– డాక్టర్‌ శివరామ్, హైదరాబాద్‌

ఆపదొస్తే ఆయనే గుర్తొస్తారు
జగన్‌లో గొప్ప నాయకత్వ లక్షణాలు చూసేవాళ్లం. మాకేదైనా ఆపద వస్తే ఆయనే గుర్తొస్తారు. సాదాసీదాగా ఉంటూ అందరినీ కలుపుకుని వెళ్లేవారు. అప్పుడే అనుకునే వాళ్లం.. జగన్‌ గొప్ప నాయకుడు అవుతారని. ఏపీ ప్రజల మద్దతుతో జగన్‌ సీఎం అవుతుండటం మాకెంతో సంతోషకరం. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తరహాలోనే జగన్‌ సైతం మైనార్టీలకు మంచి చేస్తారన్న నమ్మకం ఉంది.
 – అమీర్‌ అలీ ఖాన్, మేనేజింగ్‌ ఎడిటర్, సియాసత్‌ పత్రిక 

మరిన్ని వార్తలు