వేటాడి... వెంటాడి హత్య

11 Dec, 2014 01:52 IST|Sakshi
వేటాడి... వెంటాడి హత్య

గాజువాక : తుక్కు వ్యాపారుల మధ్య పాతకక్షలు మరోసారి పేట్రేగాయి. మాటేసి పథకం ప్రకారం చేసిన దాడిలో ప్రత్యర్థి మృత్యువాత పడ్డాడు. చినగంట్యాడ జాతీయ రహదారిపై అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై చోటు చేసుకున్న ఈ సంఘటనపై గాజువాక పోలీసుల కథనం ప్రకారం చినగంట్యాడలో తుక్కు వ్యాపారం నిర్వహిస్తున్న పైలా ప్రకాష్ వద్ద కుంచుమాంబ కాలనీకి చెందిన కొణతాల నూకరాజు (27) పని చేసేవాడు.

ఒక మహిళ కోసం ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో నూకరాజు అక్కడ పని మానేసి గంగవరం పోర్టు రోడ్డులో తుక్కు దుకాణం నిర్వహిస్తున్న సాహు రాము వద్ద చేరాడు. అయినప్పటికీ ఇద్దరి మధ్య గొడవలు ఆగలేదు. ఆరు నెలల క్రితం కూడా ప్రకాష్ బృందం సాహు రాము తుక్కు దుకాణంపై దాడికి దిగింది. అప్పటి నుంచి అంతమొందిస్తానంటూ నూకరాజును ప్రకాష్ బెదిరిస్తూ వస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ప్రకాష్ తన అనుచరులను పురమాయించడంతో వారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. పథకం ప్రకారం వారు నూకరాజుతో మంచిగా వ్యవహరిస్తూ ఆరునెలలపాటు కాలం గడిపేశారు. బుధవారం పార్టీ ఇస్తామని నూకరాజును చినగంట్యాడలోని సరిగమ బార్‌కు పిలిచారు. మద్యం సేవించాక మెల్లగా గొడవ ప్రారంభించి ఒక్కసారిగా పెద్దది చేశారు. అరుపులు, కేకలతో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ప్రకాష్ బృందానికి చెందిన ఆరుగురు వ్యక్తులు నూకరాజుపై కత్తితో ఒక్కసారిగా దాడి చేశారు.

పొట్ట భాగంలో కత్తితో పొడవగానే బాధితుడు తప్పించుకొనే ప్రయత్నం చేసి రోడ్డుపైకి పరుగులు తీశాడు. అతడి వెంటే రోడ్డుపైకి వచ్చిన ప్రత్యర్థులు జాతీయ రహదారిపైగల ఒక ఫంక్షన్ హాల్‌కు సమీపంలో నూకరాజును పట్టుకొని అతని తల, తొడ, పొట్ట, ఇతర శరీర భాగాల్లో సుమారు పది పోట్లు పొడిచారు. ఈ సంఘటనతో నూకరాజు కుప్ప కూలిపోవడంతో వారు వెనుదిరిగారు.
 
నిందితులను పట్టుకున్న రూరల్ ఎస్పీ సిబ్బంది
ఆ సమయంలోనే గాజువాక నుంచి అనకాపల్లి వెళ్తున్న రూరల్ ఎస్పీ కోయ ప్రవీణ్ ఈ దృశ్యాన్ని చూశారు. వెంటనే నిందితులను పట్టుకోవాలని సిబ్బందిని ఆదేశించడంతో వారు వెంబడించారు. నిందితుల్లో చొక్కాకుల శివాజీ అలియాస్ శివ (19), కొడాలి భరత్ అలియాస్ నానాజీ (20)లను పట్టుకొని గాజువాక పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. మిగిలిన నిందితులు పరారయ్యారు.

కుప్పకూలిన నూకరాజును తొలుత అక్కడికి సమీపంలోని ఒక ప్రయివేటు ఆస్పత్రికి పోలీసులు తరలించారు. పరిస్థితి విషమించడంతో కేజీహెచ్‌కు తరలించగా అక్కడ మృతి చెందినట్టు ఎస్‌ఐ ఈశ్వరరావు తెలిపారు. నిందితులు ఉపయోగించిన మూడు కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు పైలా ప్రకాష్ పరారవడంతో రెండు బృందాలను నియమించినట్టు సీఐ ఎం.అప్పారావు తెలిపారు.

మరిన్ని వార్తలు