ప్రత్తికోళ్లలంక ఉద్రిక్తం

18 Jan, 2019 07:38 IST|Sakshi
ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులు

రెండు వర్గాల మధ్య ఘర్షణ

చింతమనేని ప్రోత్సాహంతోనే దాడులు?

శాంతిభద్రతలకు విఘాతం

పశ్చిమగోదావరి, ఏలూరు రూరల్‌: దెందులూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధి రాక్షస క్రీడకు కొల్లేరు ప్రజలు బలి పశువులయ్యారు. దశాబ్దాల తరబడి కట్టుబాట్లతో కలిసి బతికిన వారు నేడు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. తాజాగా గురువారం ఏలూరు మండలం ప్రత్తికోళ్లలంకలో ఘర్షణలు జరిగాయి. ఒక వర్గం ప్రజలు మరోవర్గంపై దాడులకు తెగబడ్డారు. కనబడిన వ్యక్తి ఆడమగా అని చూడకుండా ఇష్టానుసారం కొట్టారు.  కర్రలు చేతబట్టి ఇళ్లల్లోకి చొరబడి దొరికిన వారిని దొరికినట్టు బాదారు. విలువైన ఫర్నిచర్, ఇళ్లను ధ్వంసం చేశారు. భీతిల్లిన ప్రజలు చెట్టుకొకరు, పుట్టకొకరుగా పరుగులు తీశారు. పక్కనే ఉన్న గుడివాకలంక ప్రజల వద్దకు వెళ్లి తమ బాధలను ఏకరువుపెట్టారు. తమ కుటుంబాలను కాపాడాలంటూ వేడుకున్నారు. మరికొందరు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ ఘర్షణలతో చుట్టుపక్కల కొల్లేరు గ్రామాలూ భీతిల్లాయి. ఏ నిమిషంఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందారు. పోలీసులు గ్రామానికి చేరుకున్నా.. ప్రస్తుతం పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ దుస్థితికి నాలుగేళ్ల కిందట అధికార దాహంతో కన్నుమిన్నూ కానని టీడీపీ ప్రజాప్రతినిధి వేసిన బీజమే కారణమనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. 

గతంలో సమైక్య జీవనం
2014 వరకూ ఈ గ్రామ ప్రజలు కలిసికట్టుగా చేపల సాగు చేసుకుని జీవించారు. కోట్ల రూపాయల మత్స్య సంపదను ప్రజలందరూ పంచుకుంటూ పిల్లాపాపలతో హాయిగా ఉన్నారు. వీరి ఐకమత్యం, ఆర్థికస్థితిని చూసి స్థానిక ప్రజాప్రతినిధికి కన్నుకుట్టింది. అంతే గ్రామాన్ని రెండు వర్గాలుగా విడదీశారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేలా రెచ్చగొట్టారు. రెవెన్యూ అధికారులను ఉసిగొల్పి ఏళ్ల తరబడి ప్రజలు సాగు చేస్తున్న చేపల చెరువులను అక్రమంగా తవ్వారంటూ నోటీసులు ఇప్పించారు. ఆదుకోమని వేడుకొనగా ఇరువర్గాలను కోర్టుకు వెళ్లాలని సూచించారు. ఆఖరికి ‘మీలో ఐకమత్యం లేదు. మీరు చేపల సాగు చేయలేరు.’ అంటూ ఆ చెరువులను టీడీపీ అనుయాయులు, తన అనుచరులకు లీజుకు కట్టబెట్టారు. పోనీలే కష్టపడి బతుకుదామని అనుకున్న ప్రజలకు న్యాయపరంగా ఇవ్వాల్సిన లీజు డబ్బు సుమారు రూ.15 కోట్లు ఇవ్వకుండా కొన్నేళ్లుగా కాలయాపన చేశారు. ఆఖరికి  ప్రజాప్రతినిధి మేక వన్నె పులి వేషాన్ని స్థానికులు గుర్తించారు.

‘మా లీజు డబ్బుతోపాటు మా భూములు మాకు పంచండి’ అంటూ 7 బంటాలు(ఒక్కొక్క బంటాలో 80 నుంచి 100 మంది ఉంటారు) పెద్దలు, ప్రజలు సదరు నేతను ఇటీవల జరిగిన అధికారిక కార్యక్రమంలో సైతం నిలదీశారు. పోలీసు అధికారులకూ ఫిర్యాదు చేసారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలను కలిసి తమకు అండగా ఉండాలని కోరారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరులుగా మారారు. దీన్ని గుర్తించిన ప్రజాప్రతినిధి ప్రజలు ఎదురుతిరుగుతున్నారని గ్రహించి సమస్య పరిష్కరించండి అంటూ కొల్లేరు పెద్దలతోపాటు ఏలూరు పూర్వపు డీఎస్పీ ఈశ్వరరావుకు సూచించారు. దీంతో నాలుగు నెలల క్రితం పెద్దల సమక్షంలో ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా మాజీ సర్పంచ్‌ ఘంటసాల మహాలక్ష్మీరాజుకు జరిగిన నష్టంతో పాటు గ్రామంలో చేపట్టిన ఖర్చులు చెల్లించారు. రెండో అంశంమైన 7 బంటాల ప్రజలకు అప్పగించాల్సిన భూముల పక్రియ ఈ నెల 18న చేపట్టాలని నిర్ణయించారు. ప్రజలకు భూములు పంచే సమయం ఆసన్నమైంది. భూములు పంపకాలు జరిగితే ప్రజలు తన గుప్పెట్లో ఉండరని భావించారు. దీనికితోడు సంక్రాంతి పండగ సందర్భంగా గ్రామస్తులు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీ కట్టారు. ఈ రెండు ఘటనలను జీర్ణించుకోలేకపోయిన నియోజకవర్గ ప్రతినిధి  గురువారం గ్రామంలో టీడీపీ నాయకులు, అనుచరులను రెచ్చగొట్టారు. ఉదయం 10 గంటలకు ఇతర బంటాల ప్రజలు గ్రామ కూడలి వద్దకు రావాలంటూ తన అనుచరులతో మైక్‌లో వినిపించారు. ఓ వర్గం వారిపై దాడులు చేయించారు. దీంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

బాధితులను ఆదుకోవాలి
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌  కుట్ర వల్ల ప్రత్తికోళ్లలంక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. 7 బంటాల ప్రజల కోరిక మేరకు వారి భూములు వారికి ఇవ్వాలి. దాడులతో నష్టపోయిన ప్రజలకు నష్టపరిహారం అందించాలి. న్యాయంగా వారికి అందాల్సిన లీజు డబ్బులు అందించాలి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్తికోళ్లలంక ప్రజలకు అండగా ఉంటుంది. ప్రజల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవడం సిగ్గు చేటు. ప్రజలు కలిసిమెలిసి జీవించాలి.– కొఠారు అబ్బయ్యచౌదరి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దెందులూరు నియోజకవర్గ కన్వీనర్‌

కొఠారు పరామర్శ
ఏలూరు టౌన్‌:  ప్రత్తికోళ్ళలంక గ్రామంలో ఇరు వర్గాల మధ్య నెలకొన్న వివాదం కొట్లాటకు దారితీసింది. ఈ గొడవలో ఒక వర్గంపై మరో వర్గంపై దాడి చేసి, తీవ్రంగా కొట్టటంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలోని బలే రాము ఇంటిపై దాడి చేసి వారి కుటుంబ సభ్యులతోపాటు మరికొందరిని తీవ్రంగా కొట్టారు.  గాయాలపాలైన వారిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దెందులూరు సమన్వయకర్త కొఠారు అబ్బయ్యచౌదరి ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. ఆయనతోపాటు వైఎస్సార్‌సీపీ రైతు విభాగం ఏలూరు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ సతీష్‌ చౌదరి, పార్టీ నేతలు మెండెం ఆనందరావు, శ్రీనివాసరావు, తిరుపతిరావు, ఎం.కొండలరావు తదితరులు ఉన్నారు. ఆసుపత్రిలో తీవ్రంగా గాయపడిన మహిళలను ఆయన పరామర్శించి, తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. అధికారులు వెంటనే దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఆరుగురిపై కేసు నమోదు
ప్రత్తికోళ్ళలంక గ్రామంలో ఇరు వర్గాల మధ్య వివాదంలో బలే రాము ఇంటిపై దాడి చేయగా అతని ఫిర్యాదు మేరకు  పలువురు వ్యక్తులపై ఏలూరు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘంటసాల చంద్రశేఖర్, ముంగర పోతురాజు, ఘంటసాల వెంకన్నబాబు, నారాయణస్వామి, బలే బూసిరాజు, ఘంటసాల కోటి             రమేష్‌ అనే వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు