-

ఎన్నాళ్లీ ఉన్మాదం

10 Jul, 2015 03:19 IST|Sakshi
ఎన్నాళ్లీ ఉన్మాదం

- పరాకాష్టకు చేరిన విప్ అరాచకత్వం
- అద్దె జనంతో అడ్డగోలు వ్యవహారాలు
- అధికార పార్టీకీ తలనొప్పిగా మారిన చింతమనేని చిల్లర చేష్టలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
స్వచ్ఛమైన జనం, పచ్చనైన పల్లెపట్టులతో ప్రశాంతంగా ఉండే పశ్చిమగోదావరి జిల్లాకు ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ఉన్మాదం మాయని మచ్చను తెస్తోంది. అనుచరులను పోగేసుకుని దాడులు, ధర్నాలు చేస్తూ ప్రజలను, ప్రభుత్వ అధికారులను, చివరకు పోలీసులను కూడా భయపెడుతూ చింతమనేని నెరపుతున్న దుష్ట రాజకీయం ఇప్పుడు పరాకాష్టకు చేరింది. అద్దె జనంతో అడ్డగోలు వ్యవహారాలు ఎన్నాళ్లంటూ అధికారులు ప్రభుత్వాన్ని బహిరంగంగా నిలదీసే పరిస్థితి ఎదురైంది.
 
వనజాక్షిపై దాడితోనే రాష్ట్రమంతా వెలుగులోకి
వాస్తవానికి చింతమనేని చిల్లర చేష్టలు, దందాలు, పంచాయతీలు జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఇక్కడి ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు, పాత్రికేయులకు ఆయన వివాదాస్పద వ్యవహారశైలి కొత్తేం కాదు. ఏడాదికి ముందు టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్ని అరాచకాలు చేసినా.. ప్రతిపక్ష శాసనసభ్యుడిని కాబట్టే తనను పాలకులు వేధిస్తున్నారంటూ నానాయాగీ చేసేవారు. అధికారంలోకి వచ్చిన దరిమిలా, విప్ పదవిలో ఉంటూ చింతమనేని చేస్తున్న వ్యవహారాలు అధికారులకు భరించలేని తలనొప్పిగా పరిణమించాయి.

అటవీశాఖ అధికారిపై దాడి చేసినా, మార్క్‌ఫెడ్ డీఎంపై దౌర్జన్యానికి పాల్పడినా, ఐసీడీఎస్ అధికారులను బెదిరింపులకు గురిచేసినా, ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసినంత పనిచేసి నిందితులను బయటకు తీసుకువెళ్లిపోయినా, చీటికీ మాటికీ ప్రభుత్వ ఉద్యోగులను బండబూతులు తిట్టినా మన జిల్లాలో అధికారులెవరూ బహిరంగంగా ఆయనపై ఫిర్యాదు చేసే సాహసం చేయలేకపోయారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో అతని హావభావ విన్యాసాలన్నీ మౌనంగానే భరించారే గానీ రోడ్డుకెక్కి ఆందోళన చేయలేకపోయారు. కానీ పొరుగున కృష్ణాజిల్లాకు చెందిన ముసునూరు తహసిల్దార్ వనజాక్షి మాత్రం వెనక్కి తగ్గలేదు.

బుధవారం జరిగిన దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతమనేని అరాచకపర్వాన్ని రాష్ట్రమంతటికీ తెలిసేలా చేశారు. ఆమెకు మద్దతుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఉద్యోగ సంఘాల నేతలూ ముందుకురావడంతో మన జిల్లాలోని ఉద్యోగ నేతలూ ధైర్యంగా గళం విప్పారు. చింతమనేనిపై నిప్పులు చెరిగారు. ఆయన నేరచరిత్ర చిట్టా విప్పారు. అరెస్టు చేయకుంటే పాలన స్తంభింపజేస్తామని ప్రకటించారు. కిరాయిమూకలతో ఎంతమందిపై దాడులు చేయిస్తారని ప్రశ్నించారు. ఈ దశలో చింతమనేనిని ప్రభుత్వం అరెస్టు చేస్తుందా.. లేదా ఆయన తన వర్గానికి చెందిన మహిళలతో పెట్టించిన ఎదురుకేసుల నేపథ్యంలో రాజీ చేస్తుందా.. అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
 
టీడీపీ నేతలకూ తలనొప్పి?

కేవలం సామాజికవర్గ నేపథ్యంలో చింతమనేనికి మద్దతిచ్చే నేతలు తప్పించి అధికార తెలుగుదేశం పార్టీలోనూ ఆయన వ్యవహారశైలిపై తీవ్ర అసమ్మతి నెలకొంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన దరిమిలా ఇసుక, మట్టి తవ్వకాలు, ఉద్యోగుల బదిలీల్లో తనదైన ముద్ర వేసి ఆర్థికంగా బలపడుతున్న చింతమనేని జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో తలదూర్చుతున్నారనే అసంతృప్తి ఆయా నేతలకు ఉంది. తాజా పరిమాణాలన్నీ నిశితంగా గమనిస్తున్న చింతమనేని వ్యతిరేకులు ఇదే అదనుగా పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. మరోపక్క మంత్రి పదవి కోసం ఎన్నాళ్ల నుంచో వేచిచూస్తున్న ప్రభాకర్ ఆశకు ఈ ఘటనతో గండిపడినట్టేనని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

మరిన్ని వార్తలు