మోదీ-బాబుది నయవంచన

25 Nov, 2014 02:22 IST|Sakshi
మోదీ-బాబుది నయవంచన

తిరుపతితుడా: ఆచరణ సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన అధికార పార్టీ నేతలు ప్రజల్ని మోసం చేస్తున్నారని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ ఆరోపించారు. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ర్టంలో సీఎం చంద్రబాబు వంచనకు పాలప్పడ్డారని ఆయన అన్నా రు. హామీల అమలు, జాతీయ ప్రాజెక్టుల పనులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ డీసీసీ ఆధ్వర్యంలో తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ మోదీ వస్తే మంచిరోజులు వస్తాని తప్పుడు ప్రచారం చేశారన్నారు. మంచి రోజులు కాదు మహిళలు, రైతులు, యువకులు, నిరుద్యోగులతో పాటు అభివృద్ధికి గడ్డుకాలం వచ్చిందన్నారు. ఉపాధి హామీ పథకంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక విప్లవం వచ్చిందని పేర్కొన్నారు.

అలాంటి ఉపాధి హామీని పూర్తిగా తొలగించారని మండిపడ్డారు. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాల కారణంగా ఆరు నెలలకే ప్రజలను కన్నీటిపర్యంతం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనే దురుద్దేశంతో జిల్లాకు తీసుకొచ్చిన జాతీయ ప్రాజెక్ట్‌లైన మన్నవరం, దుగరాజపట్నం రేవు, భెల్ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.  ఈ ప్రాంతానికి చెందిన చంద్రబాబు సీఎం అయ్యాడు. మంచి జరుగుతుందిలే అనుకుంటే తన నైజాన్ని మరోసారి ప్రజలపై రుద్దారన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రూ.450గా ఉన్న గ్యాస్ ధరను కేంద్రం ఏకంగా రూ.1000 చేసిందన్నారు.

డీసీసీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రైతులను, మహిళలను మోసం చేసినవారెవ్వరూ బాగుపడినట్టు చరిత్రలో లేదన్నారు. అనంతరం గ్యాస్ ధర పెరుగుదలను నిరసిస్తూ మహిళలు ఆర్డీవో కార్యాలయంలో వంటావార్పు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమార్, ప్రమీలమ్మ, ఆనందమ్మ, గుండ్లూరు వెంకటరమణ, శ్రీని వాసులు, పెనుబాల చంద్రశేఖర్, ప్రభాకర్, గుంటూరు రాజేశ్వరి, నాగభూషణం, అశోక్‌సామ్రాట్, మునాఫ్, బ్రహ్మానందం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు