పస్తులతో పోరాటం..

26 Jul, 2019 08:54 IST|Sakshi
మగ్గం నేస్తున్న చేనేత కార్మికుడు

నాలుగేళ్లుగా పెరగని మజూరీలు

దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న చేనేత కార్మికులు

మజూరీలు పెంచుతామని మాట తప్పిన మాస్టర్‌వీవర్లు

తరాల తరబడి ఆకలి పోరాటం వారిది. చేతి వృత్తినే నమ్ముకొని ఎంతో కళాత్మకంగా నేసే బట్టలు వారికి పూట కూడా కడుపు నింపడం లేదు. అందరికీ అందమైన వస్త్రాలను తయారు చేస్తుంటే వారికి మాత్రం రోజంతా పని చేసినా పూట గడవని దుర్భిక్షం. నమ్మిన వారే కష్టానికి కూలీ కట్టకపోవడంతో చేనేత కార్మికులు అర్ధాకలితో జీవనం సాగిస్తున్నారు. కుటుంబమంతా కలిసి ఒక రోజంతా పనిచేస్తే కనీసం రూ.300 కూడా సంపాదించలేని పరిస్థితి. ఈ రూ.300తోనే కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఇతర ఖర్చులు అన్ని సర్దుకుపోవాల్సిన పరిస్థితిల్లో కార్మికులు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

సాక్షి, చీరాల (ప్రకాశం): చేనేత కార్మికులు అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మాస్టర్‌వీవర్లు (పెట్టుబడిదారులు) మాత్రం కోటీశ్వరులుగా మారుతుంటే వస్త్రాలను తయారు చేసే చేనేత కార్మికులు మాత్రం అర్ధాకలితోనే అలమటిస్తున్నారు. ఇప్పటికీ 2016లో ఉన్న మజూరీ(కూలీ)లే అమలవుతున్నాయి. ఇదేమని గొంతెత్తి అడిగితే అలాంటి వారికి పని కల్పించకుండా మాస్టర్‌ వీవర్లందరూ ఒకే విధంగా వ్యవహరించడంతో కనీసం పని కూడా లేక అవస్థలు పడుతున్నారు. అందుకే అవస్థలన్నీ మౌనంగానే ఎదుర్కొంటున్నారు నేత కార్మికులు. కొద్ది నెలల పాటు ఆందోళన చేస్తే కార్మికశాఖ, చేనేత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కుదిరిన ఒప్పందం రేట్లను కూడా అమలు చేయకుండా మాస్టర్‌వీవర్లు మోసానికి ఒడిగడుతున్నారు.

చీరాల ప్రాంతంలో 17 వేల మగ్గాలకు పైగా ఉండగా, 50 వేల మంది కార్మికులు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. మాస్టర్‌వీవర్ల వద్ద కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఇంటి వద్దే మగ్గం పెట్టుకొని మాస్టర్‌వీవర్‌ ఇచ్చే ముడిసరుకుతో వస్త్రాలను తయారు చేసి ఇస్తుంటారు. ఇందుకు గాను వస్త్రాల రకాలను బట్టి కూలీ రేట్లను నిర్ణయిస్తారు. ప్రస్తుతం సాదా చీరకు రూ.1700 వరకు చెల్లిస్తున్నారు. ఈ చీర నేయాలంటే కనీసం ఐదు నుంచి ఆరు రోజులు పడుతుంది. కుప్పడం చీరకు రూ.8500 నుంచి రూ.9వేల వరకు చెల్లిస్తారు. ఈ చీర నేయాలంటే కనీసం 10 రోజులు పడుతుంది.  కంచి బోర్డర్‌కు రూ.7000 వరకు ప్రస్తుతం చెల్లిస్తున్నారు. ఇందులో కార్మికుడు కూడా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అల్లు కట్టినందుకు, అంచులు అతికినందుకు, కడ్డీలు చుట్టినందుకు, గమ్ము పెట్టింనందుకు, ఇతర పనులకుగాను ఒక్కో బారుకు రూ.1000ల వరకు కార్మికుడే ఖర్చు భరాయించాలి.

ఉదాహరణకు కంచి బోర్డర్‌ చీరలు నేస్తే మాస్టర్‌ వీవర్‌ రూ.7000 ఇస్తే అందులో రూ.1000లు అదనంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంది. అంతే సరాసరిన రోజంతా భార్యభర్తలు కలిసి పని చేస్తే రూ.300 పడుతుంది. దీంతో కుటుంబమంతా జీవించడం అసాధ్యంగా మారింది. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలు కొనుగోలు చేయలేని పరిస్థితి దాపురించింది. పిల్లలను చదివించలేని పరిస్థితి ఎదురుకావడంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో వారు కూడా మగ్గంలోనే మగ్గిపోవాల్సి వస్తుంది. ఇంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నా మాస్టర్‌వీవర్లు మానవత్వంగా వ్యవహరించడం లేదు. మజూరీలను పెంచాలని కార్మికులు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా పట్టించుకున్న దిక్కేలేదు. గత రెండు నెలలుగా మజూరీలను పెంచాలని చేనేత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదు.

కనీస వేతన చట్టానికీ కరువే 
కనీస వేతన చట్టం ప్రకారం ఒక కార్మికుడికి రోజుకు రూ.206 చెల్లించాల్సి ఉంటుంది. కానీ చేనేత కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారంగా కూడా కూలీలు అందడం లేదు. చేనేత మగ్గాలపై పీస్‌ వర్క్‌ చేస్తున్నారనే కారణంతో కూలీ ధరలు పరిగణించలేమని కార్మికశాఖ చేతులెత్తేసింది. దీంతో హోటల్‌లో పని చేసే స్వీపర్ల కంటే చేనేత కార్మికుడికి కూలీ తక్కువ. కనీస వేతన చట్టాన్ని అమలు చేసినా కార్మికులకు ప్రయోజనం ఉంటుంది.

2016 నుంచి పెంచని మజూరీలు 
చేనేత కార్మికులు, మాస్టర్‌వీవర్లు ఒప్పందం మేరకు కార్మికశాఖ ఆద్వర్యంలో రెండేళ్లకు ఒకసారి కూలీలు పెంచేవిధంగా ఒప్పందం చేసుకుంటారు. కానీ 2016 నుంచి ఇప్పటి వరకు మాస్టర్‌ వీవర్లు కార్మికుల కూలీలు పెంచేందుకు ముందుకురావడం లేదు. గత కొన్ని నెలలుగా కార్మికులు మజూరీలు పెంచేందుకు ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలు, కార్మికశాఖ కార్యాలయాల ముట్టడిలను చేపట్టారు. ఇప్పటికీ కార్మికులు, మాస్టర్‌ వీవర్ల మద్య మజూరీల ఒప్పందంపై 9 సార్లు చర్చలు జరిగినా ఫలితం శూన్యంగా మారింది. బుధవారం జరిగిన చర్చలకు మాస్టర్‌ వీవర్లు ఎవ్వరూ హాజరుకాలేదు. పైపెచ్చు తమవద్ద పనిచేసే కార్మికులతో తమకు కూలీలు పెంచాల్సిన అవసరం లేదంటూ కార్మికశాఖ అధికారులకు లిఖిత పూర్వకంగా బలవంతంగా సంతకాలు చేయించి అందిస్తున్నారు.

తమతో మాస్టర్‌ వీవర్లు బలవంతంగా సంతకాలు చేయించారని, నిజంగా వారికి కూలీలు పెంచాల్సిన అవసరం లేదని కార్మికశాఖ అధికారుల ముందే కార్మికులు చెప్పాలని కార్మికసంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. కేవలం మాస్టర్‌ వీవర్లను బెదిరించిన కార్మికులనే భయాందోళనలకు గురిచేస్తున్నారని వారి ఆరోపణ. నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఉన్న కూలీలకు అదనంగా 20 శాతం కూలీ పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఫిర్యాదు చేస్తే పని బంద్‌ 
అర్ధాకలితో అవస్థలు పడుతున్న చేనేత కార్మికులు తమ దుర్భర పరిస్థితులపై కార్మిక శాఖాధికారులకు ఫిర్యాదు చేస్తే అంతే సంగతులు... ఆ రోజు నుంచి సదరు మాస్టర్‌వీవర్‌ ఆ కార్మికుడికి పని చూపించడు. మిగతా మాస్టర్‌వీవర్లూ అతనికి పని కల్పించరు. ఒకవేళ కల్పించినా నాసిరకపు రకాలను నేయించడంతో పాటు నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తారు. అందుకే కార్మిక శాఖ అధికారులకు చేసిన ఫిర్యాదులు కూడా కార్మికులు వెనక్కి తీసుకోవడం తప్పితే వారిపై ఉద్యమం చేసేందుకు నిలబడలేని పరిస్థితి.

మరిన్ని వార్తలు