ఎమ్మెల్యే ఆమంచి దౌర్జన్యం

6 Oct, 2017 12:29 IST|Sakshi

ప్రశ్నించినందుకు మత్య్సకార మహిళ చేపల బండి తొలగింపు

ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం సందర్భంగా ఘటన..

చీరాల: వాడరేవులోని మత్య్సకార మహిళపై చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ దౌర్జన్యానికి దిగారు. నన్నే ఎదిరించి మాట్లాడతావా.. అంటూ ఆమె జీవనోపాధి అయిన చేపల బండిని తీసివేయించి ఆమె బతుకుదెరువును ప్రశ్నార్థకం చేశారు. వివరాలు.. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గురువారం సాయంత్రం వాడరేవు తీరం వద్ద పర్యటించారు. తీరం వద్ద చెత్తాచెదారం ఉండటంతో అక్కడ బండి మీద చేపలు అమ్ముకుంటున్న మత్య్సకార మహిళ కొండూరి అంజమ్మను పిలిచి చెత్తను ఇక్కడ ఎందుకు వేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తామెందుకు చెత్త వేస్తామని ఆమె తిరిగి ప్రశ్నించింది.

అంతేకాకుండా సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు ఉన్నా తమకేమీ ఉపయోగపడటం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే నోరు జాగ్రత్తగా పెట్టుకో.. నన్నే ప్రశ్నిస్తావా.. అసలు బండిపై చేపలు పెట్టుకునేందుకు పంచాయతీ అనుమతి ఉందా... అంటూ ప్రశ్నించారు. ఇక్కడ పెట్టుకున్న బండ్లు లైసెన్సులు లేవని ఆమె అనడంతో ఆవేశానికి గురైన ఎమ్మెల్యే బండిని పంచాయతీ కార్యాలయంలో పెట్టమని రూరల్‌ సీఐ భక్తవత్సలరెడ్డిని ఆదేశించారు.

నువ్వు కావాలనే గొడవ చేసేందుకు వచ్చావని, నాతోనే వాదన పెట్టుకుంటావా..అంటూ ఎమ్మెల్యే ఆవేశంతో మాట్లాడారు. చేపలబండిని ట్రాక్టర్‌పై తీసుకెళ్లి పంచాయతీ కార్యాలయంలో పెట్టారు. ఆవేదనకు గురైన ఆమె తాము ఎమ్మెల్సీ పోతుల సునీత వర్గం కావడంతోనే బండి తీసేశారని, మిగిలిన బళ్లను అక్కడే ఉంచారని ఆరోపించింది. సమస్యలపై ప్రశ్నించినందుకు తన పొట్టపై కొట్టారని అంజమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు