శాశ్వత యూటీగా హైదరాబాద్

1 Dec, 2013 01:50 IST|Sakshi
శాశ్వత యూటీగా హైదరాబాద్

సోనియాకు చిరంజీవి వినతి
రాజీనామా చేయాలన్న అశోక్ బాబుపై ఆగ్రహం
 
సాక్షి, న్యూఢిల్లీ:
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో తాము ఇప్పటికే పరీక్ష రాశామని, అందులో పాసా, ఫెయిలా అనేది త్వరలోనే తెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ నేత,  కేంద్ర మంత్రి చిరంజీవి శనివారం వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో కృషిచేశామని, మంత్రి పదవులను కూడా త్యజించామని చెప్పారు. రాష్ట్ర విభ జన ప్రక్రియ వేగం పుంజుకున్న నేపథ్యంలో సీమాంధ్రుల ప్రయోజనాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని కోరేందుకు సీమాంధ్ర కేంద్ర మంత్రులు గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా అది సాధ్యపడని విషయం తెలిసిందే. దాంతో శనివారం మరోమారు సీమాంధ్ర కేంద్ర మంత్రులు సోనియా అపాయింట్‌మెంట్ కోరారు. కేంద్ర మంత్రులను బృందంగా కలిసేందుకు నిరాకరించిన సోనియా, చిరంజీవికి మాత్రం ఐదు నిమిషాల సమయం ఇచ్చారు. ఈ సమయంలోనే విభజన విషయంలో సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను చిరంజీవి సోనియా ముందుంచారు. విభజనకు తామంతా అంగీకరిస్తున్నామని, హైదరాబాద్‌ను అసెంబ్లీతో కూడిన శాశ్వత యూటీ చేయాలని కోరారు. అలా వీలుకాని పక్షంలో సీమాంధ్రలో కొత్త రాజధాని నిర్మాణం పూర్తయ్యేవరకైనా హైదరాబాద్‌ను యూటీ చేయాలని కోరారు. చిరంజీవి చెప్పిన అన్ని అంశాలను విన్న సోనియా, పరిశీలిస్తామని చెప్పి పంపినట్లుగా తెలిసింది. ఈ భేటీ అనంతరం చిరంజీవి విలేకరులతో మాట్లాడారు. విభజన అనివార్యమని తెలుస్తున్న పరిస్థితుల్లో సీమాంధ్రుల భద్రత దృష్ట్యా హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయడం మంచిదని సోనియాకు విన్నవించానన్నారు. భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలని, 1956 పూర్వస్థితినే కొనసాగించాలని కోరానన్నారు. రాయల తెలంగాణకు తాను వ్యతిరేకమూ కాదు, అనుకూలమూ కాదని చిరంజీవి స్పష్టం చేశారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుపై చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంతా పదవులకు రాజీనామాలు చేశామని, అశోక్‌బాబు ఉద్యోగానికి రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు