ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరంజీవి

6 Oct, 2019 12:58 IST|Sakshi

సాక్షి, తాడేపల్లిగూడెం : మహానటుడు ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమని మెగాస్టార్‌ చిరంజీవి తెలిపారు. ఎస్వీఆర్‌ వంటి గొప్ప నటుడు తెలుగువారు కావడం మన అదృష్టమని, ఆయన నటనే తనకు ప్రేరణ అని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం హౌసింగ్‌ బోర్డు సెంటర్‌లో నెలకొల్పిన ఎస్వీ రంగారావు తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....‘ నా అభిమాన నటుడు ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఏడాది క్రితం నన్ను కోరారు. అయితే సైరా సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండటంతో కుదరలేదు. 

ఇన్నాళ్లకు ఆ అవకాశం లభించింది. ఎస్వీ రంగారావుగారిని చూసే నేను నటుడిని అవ్వాలని మద్రాస్‌ వెళ్లాను. ఈ రోజు మీ ముందు ఇలా నిలబడగలిగాను.  విగ్రహావిష్కరణకు ప్రభుత్వ అనుమతులు తీసుకుని, చొరవ తీసుకున్న ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు నా ప్రత్యేక ధన్యవాదాలు. నా జిల్లాకు వచ్చిన నన్ను అక్కున చేర్చుకున్న అందరికీ కృతజ్ఞతలు. అలాగే సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఎస్వీ రంగారావుగారి ఆశీస్సులు ఎప్పటికీ నాకు ఉంటాయి.’ అని అన్నారు.

నర్సాపురం పార్లమెంట్‌ సభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ సంవత్సర కాలంగా చిరంజీవితో ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించాలని చూశాం. ఈ విగ్రమం సైరా నరసింహారెడ్డి విజయోత్సహం తర్వాత ఆవిష్కరిస్తానని చెప్పారు. అదేవిధంగా చిరంజీవి మాట నిలబెట్టుకున్నారు. చలన చిత్రరంగం ఉన్నంతవరకూ చిరంజీవి స్థానం ఎప్పటికీ చిరంజీవిలానే ఉంటుందన్నారు. ఎస్వీఆర్‌ నటించిన రెండు సినిమాల్లో చిరంజీవి తండ్రి కూడా నటించారని ఎంపీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున‍్నారు.

మరిన్ని వార్తలు