చిరంజీవి వర్సెస్ పవన్ కళ్యాణ్!

15 Apr, 2014 03:12 IST|Sakshi
చిరంజీవి వర్సెస్ పవన్ కళ్యాణ్!
తమ్ముడు తమ్ముడే.. రాజకీయాలు రాజకీయాలే అని కర్నాటకలో మెగా బ్రదర్స్ సవాల్ విసురుకుంటున్నారు. గత ఎన్నికల్లో మెగా బ్రదర్ కు బాసటగా నిలిచిన పవర్ స్టార్.. 2014 ఎన్నికల సమయం వచ్చే సరికి పరిస్థితులు తారుమారయ్యాయి. అన్నయ్య కాంగ్రెస్ ప్రచారం చేస్తుంటే.. తమ్ముడిని బీజేపీ బరిలోకి దించింది. సొంత రాష్ట్రంలో ప్రభావం చూపలేకపోయిన మెగాస్టార్ ప్రస్తుతం కర్నాటక ఎన్నికల ప్రచారంలో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సీన్ ప్రస్తుతం పక్క రాష్ట్రంలో కనిపిస్తుంటే.. అదే వేడి సీమాంధ్ర, తెలంగాణలో రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ తరపున కర్నాటకలో చిరంజీవి ఇప్పటికే ప్రచారం చేపట్టారు. దాంతో బీజేపీ పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించాలని భావించిందే తడవుగా ఎన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 
 
మోడీ కార్యాలయం నుంచి సమాచారం అందగానే సోమవారం హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ను బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కలిశారు. కర్నాటకలో ప్రచారాన్ని నిర్వహించాలని పవన్ కు కిషన్ రెడ్డి విజ్క్షప్తి చేశారు. దాంతో మంగళవారం ఉదయం కర్నాటకలో ప్రచారం నిర్వహించడానికి బేగంపేటలో ఓ ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేశారు. 
 
అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ కు ఓటు వేయాలని పిలుపుస్తుండగా, పవన్ పూర్తి వ్యతిరేకంగా బీజేపీ ప్రచారం నిర్వహించడంతో మెగా అభిమానుల్లో గందరగోళానికి కారణమవుతోంది. కర్నాటకలో తెలుగు ప్రజలు అత్యధికంగా నివసించే కోలార్, రాయ్ చూర్, గుల్బర్గా ప్రాంతాల్లోని మూడు సభల్లో పవన్ కళ్యాణ్ మంగళవారం పాల్గొంటారు. లోక్‌సభ ఎన్నికల సందర్బంగా ప్రచారంలో చివరి రోజు అయిన మంగళవారం పవన్ కళ్యాణ్‌తో ప్రచారం చేయించి ఇంతో అంతో ఓట్లు సంపాదించాలని బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు రాయచూరులో, మద్యాహ్నం 12.30 గంటలకు కోలారులో, 3.30 గంటల సమయంలో గుల్బర్గాలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని సోమవారం రాత్రి బీజేపీ నాయకులు తెలిపారు. 
 
సోమవారం మెగాస్టార్ చిరంజీవి ఇక్కడి యలహంక, చిక్క బళ్లాపురం, బాగేపల్లి, గౌరిబిదనూరులో ప్రచారం చేసిన వెంటనే పవన్ కళ్యాణ్ మరసటి రోజు ప్రచారానికి వస్తారని ప్రకటించడం కొసమెరుపు.  అవినీతి కాంగ్రెస్ ను ఓడించాలని..దేశాన్ని రక్షించాలని (కాంగ్రెస్ హటావో.. దేశ్ బచావో) పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.  చిరంజీవికి వ్యతిరేకంగా వెళ్లడానికి నిర్ణయం తీసుకోవడం ఇబ్బందే అయినా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తప్పదని గత రెండు సభలో తెలిపారు. ఏది ఏమైనా అన్నదమ్ముల సవాల్ మధ్య తెలుగు ప్రజలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. 
 
మరిన్ని వార్తలు