నవ్వినోళ్లే శభాష్ అన్నారు : బాబూమోహన్

20 Jan, 2014 02:43 IST|Sakshi
నవ్వినోళ్లే శభాష్ అన్నారు : బాబూమోహన్

 హనుమాన్‌జంక్షన్ :  ‘‘నటనపై మోజుతో రెవెన్యూ శాఖలో చేస్తున్న ఉద్యోగం మానేసి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టా.. నా ఫేస్ చూసి అంతా నవ్వారు. నువ్వు నటిస్తావా.. అసలు నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా.. అంటూ ఎగతాళి చేశారు.. కానీ ఆ తర్వాత సీన్ రివర్సయింది. వెండితెరపై నేను కనిపించినప్పుడల్లా ప్రేక్షకులు హాయిగా నవ్వుకున్నారు... థియేటర్లలో చప్పట్లు.. ఈలలు.. హోల్ ఆంధ్రాకే సోల్ అండగాడినంటూ కితాబిచ్చారు... ఇదీ నా సినీప్రస్థానం’’ అంటూ హాస్యనటుడు బాబూమోహన్ చెప్పారు. వెన్నెల ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పుట్టగుంట సతీష్‌కుమార్ హీరోగా ఎన్.కె.రావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘ఎమ్మెల్యే భరత్’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను మూడు రోజులుగా హనుమాన్‌జంక్షన్ పరిసర ప్రాంతాల్లో బాబూమోహన్‌పై చిత్రీకరిస్తున్నారు. ఆదివారం ఆయన్ను కలిసిన ‘న్యూస్‌లైన్’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
 
 న్యూస్‌లైన్: మీ కుటుంబ నేపథ్యం?
 బా.మో : ఖమ్మం జిల్లాలోని బీరవోలు మా స్వగ్రామం. తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులు.
 
 న్యూస్‌లైన్ : సినిమాల్లో మీకు ఫస్ట్ చాన్స్ ఎలా వచ్చింది?
 బా.మో : హైదరాబాదు రవీంద్రభారతిలో నేను ప్రదర్శించిన నాటకాన్ని చూసిన ప్రతాప్ ఆర్ట్స్ అధినేత రాఘవగారు ‘ఈ ప్రశ్నకు బదులేది’ చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఆహుతి, ఆంకుశం చిత్రాల్లో నటించడంతో మంచి గుర్తింపు లభించింది.
 
 న్యూస్‌లైన్ : ఇప్పటివరకు ఎన్ని చిత్రాల్లో నటించారు?
 బా.మో : తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 965 చిత్రాల్లో నటించా.
 
 న్యూస్‌లైన్ : మీకు బాగా గుర్తింపునిచ్చిన సినిమాలు?
 బా.మో : మామగారు సినిమాల్లో వేసిన యాచకుడి పాత్ర హాస్యనటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. అంకుశం, వన్‌బై టూ,  మాయలోడు, రాజేంద్రుడు- గజేంద్రుడు, పెదరాయుడు, జంబలకడిపంబ, అమ్మోరు చిత్రాలు ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి.
 
 న్యూస్‌లైన్ :  ఒకప్పుడు అగ్రశ్రేణి హాస్యనటుడిగా ఎదిగిన మీకు ఇప్పుడు అవకాశాలు సన్నగిల్లడానికి కారణం?
 బా.మో : సినిమాలు, రాజకీయాలు.. రెండింటికీ సమతూకంలో సమయం కేటాయిద్దామనుకున్నా. కానీ ప్రజాజీవితంలో అది కుదరదని తేలిపోయింది. డేట్స్ ఇచ్చిన నిర్మాతలకు ఇబ్బందులు కలగకూడదనే సినిమాలు తగ్గించేశాను.
 
 న్యూస్‌లైన్ : మీ సహనటులకు వచ్చిన పద్మశ్రీ పురస్కారం మీకెందుకు రాలేదు?
 బా.మో : నేను సినిమాల్లోకి వచ్చిన రెండు, మూడేళ్లలోనే బాగా బిజీ అయ్యాను. రోజుకు ఐదారు షూటింగులు ఉండేవి. దీంతో నేను నటించిన చిత్రాల జాబితా రాయడం కుదర్లేదు. అది ఉంటే  నేనూ బ్రహ్మానందంతోపాటే పద్మశ్రీకి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండేది.
 
 న్యూస్‌లైన్ : రాజకీయాలు మీకు తృప్తినిచ్చాయా?
 బా.మో : ఒకే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఏకైన నటుడిని నేనొక్కడినే. ఎన్టీఆర్‌కి కూడా ఈ రికార్డు లేదు. ప్రజలు నాపై ఉంచిన నమ్మకంతో బాధ్యతగా పనిచేశాననే తృప్తి ఉంది. 2014 ఎన్నికల్లో ఆంధోల్ నుంచి పోటీకి సిద్ధమవుతున్నా.
 
 
 

మరిన్ని వార్తలు