గుండె గూటిలో వైఎస్సార్‌

8 Jul, 2019 08:36 IST|Sakshi

వ్యవసాయాన్ని పండగ చేశారు

ఉచిత విద్యుత్, రుణమాఫీ, రిజర్వాయర్ల నిర్మాణం

పేదల ఉన్నత చదువులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌

ఆరోగ్యశ్రీతో సామాన్యులకు కార్పొరేట్‌ వైద్యం 

నిరుద్యోగులకు పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి

అభివృద్ధి పనులతో దూసుకెళ్లిన పల్లెలు, పట్టణాలు

నేడు వైఎస్‌.రాజశేఖరరెడ్డి జయంతి

రాయలకాలాన్ని స్వర్ణయుగం అంటాం. దివంగత సీఎం వైఎస్‌.రాజశేఖరరెడ్డి  ఆ నాటి పాలనను మరోసారి పరిచయం చేశారు. ఇందిరమ్మ పేరుతో     గూడులేని పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఆరోగ్యశ్రీ పేరుతో బడుగుజీవులకు ప్రాణాలు పోశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేదల ఉన్నత చదువులకు బాటలు వేశారు. పావలా వడ్డీతో మహిళలను లక్షాధికారులను చేశారు. ఉచిత విద్యుత్, రుణమాఫీ, బీడు భూములకు నీళ్లిచ్చి రైతు బాంధవుడిలా నిలిచిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలతో పేదల గుండె గుడిలో దేవుడిగా నిలిచిపోయారు రాజశేఖరరెడ్డి. అటువంటి నేత జయంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..

మనసంతా నువ్వే!

చినుకు సవ్వడివి నువ్వు
గలగల పారే సెలయేరు నువ్వు
జలయజ్ఞ ప్రదాత నువ్వు
ప్రగతి రథసారథి నువ్వు
భవిత బాటసారి నువ్వు
చదువుల రేడు నువ్వు
ఊపిరిలూదే ప్రాణదాత నువ్వు
రైతు వెన్నుదన్ను నువ్వు
కలకాలం నిలవాలి నీ నవ్వు..

ప్రజల కోసమే బతికావు
ప్రగతి కోసమే జీవించావు
రచ్చబండకని ఏగావు
తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావు
రాజన్నా.. నినుమరువలేమన్నా..
మా ఆశవు నువ్వు..మా శ్వాసవు నువ్వు 
మా ధైర్యం నువ్వు.. మా మనసంతా నువ్వు
 
చెరగదు నీ జ్ఞాపకం
మరువదు నిను ఈ లోకం
కళ్లు మూసినా నువ్వే..
కళ్లు తెరిచినా నువ్వే..
నీ రూపం పదిలం
నీ ప్రగతి అపూర్వం
నాయకా ఇవే మా జోహార్లు
కన్నీటి హారతులు
ఘనమైన నివాళులు..

సాక్షి, తిరుపతి : వైఎస్‌ అంటేనే ఓ బ్రాండ్‌. పేదల సంక్షేమానికి చిరునామా. 2004కు ముందు అప్పటి వాతావరణ పరిస్థితులు.. ప్రభుత్వ నిరాదరణతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకునేవారు. అటువంటి వారి జీవితాల్లో వైఎస్‌.రాజశేఖరరెడ్డి వెలుగు నింపారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అంటే కాదు.. పండగ అని నిరూపించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 6.40 లక్షల మంది రైతులు ఉంటే ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపట్టారు. రైతులందరికీ ఉచిత విద్యుత్‌ ఇచ్చారు. విద్యుత్‌ బకాయిలు మాఫీ చేశారు. పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులకు వడ్డీ కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్న రైతుల రుణాలను మాఫీ చేశారు.

ఆత్మహత్య చేసుకున్న వారికి పరిహారం కింద తక్షణం ఆర్థిక సాయం చేశారు. ఎన్నడూ లేని విధంగా నల్ల బెల్లం రైతులకు గిట్టుబాటు ధర కల్పించారు. ఇతర పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు చేపట్టారు. చంద్రబాబు హయాంలో మూతపడ్డ చెరకు ఫ్యాక్టరీలకు రూ.50 కోట్లు కేటాయించి పునః ప్రారంభించారు. ఆయన మరణం తర్వాత మళ్లీ మూతపడటం తెలిసిందే. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడంతో ప్రస్తుతం పునఃప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలావుండగా  మదనపల్లెలో మూతపడిన విజయా డెయిరీని 2008లో పునఃప్రారంభానికి చర్యలు చేపట్టారు. 5వేల లీటర్లతో ప్రారంభమైన డెయిరీని 70వేల లీటర్ల స్థాయికి పెంచారు.

అపర భగీరథుడు
రాయలసీమ రైతుల కలల ప్రాజెక్టు హంద్రీ నీవాకు జీవం పోశారు. 2012 డిసెంబర్‌ నాటికి పూర్తి చేసి సాగు, తాగునీరు అందించాలని భావించారు. ఆయన అకాల మరణంతో హంద్రీ నీవా పనులు ఆగిపోయాయి. వైఎస్‌ఆర్‌ తర్వాత ముగ్గురు సీఎంలు వచ్చినా ఇప్పటికీ పూర్తి చెయ్యలేకపోయారు. అదేవిధంగా గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసి తాగు సాగునీరు అందించాలని భావించారు. 90వేల ఎకరాలకు సాగు నీరు, వేలాది మంది తాగునీటి సమస్య పరిష్కారం కోసం సోమశిల స్వర్ణముఖి ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే గాలేరు నగరి ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి.

జిల్లా నీటి కష్టాలు తెలుసుకుని కర్నూలు జిల్లా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంచి తెలుగుగంగకు నీటి కొరత లేకుండా చేశారు. తెలుగు గంగ నీటిని సత్యవేడు, తొట్టంబేడు, వరదయ్యపాలెం, బుచ్చినా యుడు కండ్రిగ పరిధిలోని చెరువులకు నీరు నింపే కార్యక్రమానికి వైఎస్‌.రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. ఆ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇంకా మల్లిమడుగు, బాలాజీ రిజర్వాయర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఆయనే.

పేదలకు పక్కా ఇళ్లు
జిల్లాలో వేలాది మంది పేదలు గూడులేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అటువంటి వారి కోసం వైఎస్‌.రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక ఇందిరమ్మ, రాజీవ్‌గృహకల్ప పేరుతో భారీగా పక్కాగృహాల నిర్మాణం చేపట్టారు. మూడు విడతలుగా జిల్లా వ్యాప్తంగా 3.15 లక్షల మందికి పక్కా గృహాలు నిర్మించి ఇచ్చారు. శ్రీకాళహస్తి పట్టణంలో నిరుపేదల కోసం రాజీవ్‌నగర్‌ కాలనీ ఏర్పాటు చేసి 11వేల మందికి పట్టాలు ఇచ్చి, పక్కాగృహాలు నిర్మించి ఇచ్చారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత చదువులు
ఫీజులు చెల్లించలేక చదువు ఆగిపోకూడదన్న ఉద్దేశంతో నాడు వైఎస్‌.రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రారంభించారు. 2004 నుంచి 2008 కాలంలో ఈ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంసీఏ, పీజీ, ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ, ఇతర ప్రొఫెషనల్‌ కోర్సులు చదివిన 24 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయిం బర్స్‌మెంట్‌ పథకం వర్తింపజేశారు.

వైఎస్‌ కలల ప్రాజెక్టు శ్రీసిటీ
ఉపాధి అవకాశాల కల్పన దిశగా వైఎస్‌.రాజశేఖరరెడ్డి పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అందులో సత్యవేడు వద్ద ఏర్పాటు చేసిన శ్రీసిటీ ముఖ్యమైంది. ఇక్కడ 50వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించారు. మరో 30వేల మందికి ఉపాధి కల్పించేందుకు శ్రీకాళహస్తి సమీపంలో విద్యుత్‌ పరికరాల తయారీ కేంద్రం (మన్నవరం) మంజూరు చేయించారు. ఆయన మరణంతో ఆ కేంద్రం చెన్నైకి తరలివెళ్లింది. 

మరిన్ని వార్తలు