రాలేం బాబూ! 

28 Jun, 2019 10:54 IST|Sakshi

నిన్న మొన్నటి దాకా ఒక వెలుగు వెలిగిన టీడీపీ ఇప్పుడు డీలా పడిపోయింది. పార్టీలో కీలకంగా రాణించిన నేతలంతా ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లి పోతున్నారు. తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని వణికిపోతున్నారు. మరోపక్క పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్వహించే అంతర్గత సమావేశాలకూ డుమ్మాకొడుతున్నారు. తాము రాలేం.. బాబూ..! అంటూ చేతులెత్తేస్తుండడం గమనార్హం. 

సాక్షి, తిరుపతి : ఐదేళ్ల టీడీపీ పాలన.. అధినాయకత్వం తీరు.. స్వయంకృతాపరాధం.. వెరసి జిల్లాలో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీకి దక్కింది ఒక్క కుప్పం మాత్రమే. అందులోనూ చంద్రబాబు మొదటి రెండు రౌండ్లలో వెనుకంజ వేసిన విషయం తెల్సిందే. జిల్లాలోని మిగిలిన 13 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయఢంకా మోగించింది. ఊహించని విధంగా ప్రజలు తీర్పు చెప్పడంతో టీడీపీ షాక్‌కు గురైంది. దాని నుంచి తేరుకోకముందే టీడీపీ నేతలు ఒక్కొక్కరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. అవినీతి, అక్రమాల నిగ్గుతేల్చేందుకు జగన్‌ ప్రభుత్వం సన్నద్ధం కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని వణికిపోతున్నారు.

సమావేశాలకు రాం..రాం!
ఉండవల్లిలో చంద్రబాబు నివాసం ఉంటున్న భవనం అక్రమం అని తేలడం, ఆ పక్కనే ఉన్న ప్రజావేదికను కూల్చివేయడం తదితర పరిణామాలపై టీడీపీ నేతలు సమావేశమయ్యారు. ప్రభుత్వంపై ఎదురు దాడి చెయ్యాలని నిశ్చయించారు. అంతకుముందు అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీని ఎలా ఎదుర్కోవాలనే విషయంపైనా చంద్రబాబు ఆ పార్టీ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశాలకు చాలా మంది నాయకులు ముఖం చాటేస్తున్నారు. మేం రాలేం రాలేం.. అంటూ చేతులెత్తేస్తున్నారు. 

అజ్ఞాతంలో టీడీపీ నేతలు
అమరావతిలో పలుమార్లు చంద్రబాబు ఆ పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు ప్రతి జిల్లా నుంచి ముఖ్యనాయకులను రమ్మని సమాచారం ఇస్తున్నారు. మాజీ మంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీలు గౌనివారి శ్రీనివాసులు, దొరబాబు, మాజీ ఎంపీ శివప్రసాద్, మాజీ ఎమ్మెల్యే, రాజంపేట పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన సత్యప్రభ, సుగుణమ్మ, శంకర్‌యాదవ్, గాలి భానుప్రకాష్, నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, బొజ్జల సుధీర్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తి నానికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. జిల్లా నాయకులు మాత్రం తాము రాలేమని చెప్పినట్లు సమాచారం. కొందరు బెంగళూరులో ఉన్నామని, మరికొందరు ఆరోగ్యం సరిగా లేదంటూ రకరకాల సమాధానాలు ఇచ్చారు.

తాజాగా ఉండవల్లిలోని ప్రజావేదికను కూల్చే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముఖ్య నాయకులంతా అమరావతికి రావాలని కబురు పంపారు. అమరావతికి వెళ్లడానికి ఇష్టం లేని జిల్లా నాయకులంతా ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ చేసుకున్నట్లు తెలిసింది. ఉండవల్లిలో గురువారం నిర్వహించిన పార్టీ సమావేశలో ఆయా జిల్లా నాయకులకు ఫోన్లు చెయ్యమని చంద్రబాబు అనుచరులకు చెప్పినట్లు సమాచారం. అయితే వారు ఫోన్లు చేస్తే కొందరు ఫోన్లు తియ్యకపోగా.. మరికొందరు స్విచ్‌ ఆఫ్‌. నాయకుల కదలికలపై చంద్రబాబు జిల్లాలో ఉన్న అనుచరుల ద్వారా విషయం తెలుసుకున్నట్లు తెలిసింది. ఎక్కువ మంది అజ్ఞాతంలో ఉంటే.. మరి కొందరు ఉన్నా.. ఫోన్లు తియ్యడానికి ఇష్టపడలేదని తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు ఎక్కువ మంది పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీలో చేరాలని ఎక్కువ మంది ప్రయత్నాలు చేస్తుండగా.. మరి కొందరు బీజేపీలో చేరేందుకు మంతనాలు చేస్తుండడం గమనార్హం.  

మరిన్ని వార్తలు