‘దొంగ’దారుల్లో చిత్తూరు ‘దేశం’!

19 Feb, 2019 07:20 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఓట్లు తొలగించాలని జిల్లాలో 17,395 దరఖాస్తులు

ఒక్క చంద్రగిరి నియోజకవర్గం నుంచే 10,224..

వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓట్లు పడే పోలింగ్‌ బూత్‌ల మార్పు

ఇతరుల ఆధార్‌కార్డులోని అడ్రస్‌లు మార్చి చేర్పిస్తున్న వైనం

బరితెగిస్తున్న అధికార పార్టీ నేతలు

వత్తాసు పలుకుతున్న అధికారులు

సాక్షి, చిత్తూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు అధికార టీడీపీ అడ్డదారులు తొక్కుతోంది. ప్రజల్లో ఏమాత్రం ఆదరణ లేకపోవడంతో అధికారం నిలుపుకోడానికి ‘దొంగ’దారులు వెతుక్కుంటోంది. ఓటర్ల మార్పులు, చేర్పులు, నమోదుల్లో చేతివాటం ప్రదర్శిస్తోంది. దీనికి ఇతోధికంగా అధికార యంత్రాంగం కూడా సహకరిస్తోంది. దీంతో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఏ జిల్లాలో లేనంత ప్రహసనంగా చిత్తూరు జిల్లాలో మారింది. ఓటర్ల జాబితాలో కొత్త పేర్లు ఇష్టారీతిన చేరుతున్నాయి. ఒకొక్కరికి 2కు మించి ఓట్లు ఉంటున్నాయి. గంగాధర నెల్లూరు, కుప్పం నియోజకవర్గాల్లో సరైన సమాచారం లేకుండానే వ్యక్తుల పేర్లు ఓటర్ల జాబితాలో దర్శనమిస్తున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో అయితే వైఎస్సార్‌సీపీ ఓట్లు తొలగించాలని ఏకంగా 10,224 దరఖాస్తులు వచ్చాయి. 

పోలింగ్‌ బూత్‌ల మార్పునకు ఒత్తిడి
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కువ ఓట్లున్న పోలింగ్‌ బూత్‌లను మార్చాలని టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. దీనికి కోసం అధికారులపై పెద్దఎత్తున ఒత్తిడి తెస్తున్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పోలింగ్‌ బూత్‌లను ఇప్పటికే మార్చేశారు. ఈ నియోజకవర్గంలోని పెనుమూరు మండలం పెద్దకలికిరిలోని పోలింగ్‌ బూత్‌ను మొరవకండ్రిగకు మార్చారు. కలికిరి గ్రామం మొత్తం వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులున్నారు. దీన్ని టీడీపీ నేతలు మొరవకండ్రిగకు మార్పించారు. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. కమిషన్‌ సమగ్ర సర్వే చేసిన తరువాత పోలింగ్‌ బూత్‌ పెద్ద కలికిరిలోనే ఉండాలని ఆదేశించింది. అయితే, పెనుమూరు పూర్వపు ఎమ్మార్వో రవి ఈసీ ఆదేశాలను సైతం ఖాతరు చేయలేదు. కుప్పం, శ్రీకాళహాస్తి, నగరి నియోజకవర్గాల్లో పోలింగ్‌ బూత్‌ల్లోనూ మార్పులు జరిగాయి. 

టార్గెట్‌ చంద్రగిరి..
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు టీడీపీ కొత్త ఎత్తులు వేస్తోంది. ఓటర్లకే తెలీకుండా ఫాం–7ను నింపి అధికారులకు పంపుతోంది. ఇలా ఓట్లు తొలగించాలని ఈ ఏడాది జనవరి 12 నుంచి ఫిబ్రవరి 14 వరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 17,395 దరఖాస్తులు వచ్చాయి. ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే 10,224 ఓట్లు తొలగించాలని దరఖాస్తు చేశారు. వీటన్నింటినీ పరిశీలిస్తే అవి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులవేనని తేలింది. అలాగే, గత పది సార్వత్రిక ఎన్నికల్లో ఒకే బూత్‌లో ఓటేసిన వారి ఓట్లూ తీసేయాలని దరఖాస్తులు రావడం అనుమానాలకు తావిస్తోంది. ఓట్లు తొలగించాలని వచ్చిన 10 వేల దరఖాస్తుల్లో ఇప్పటికే 7,983 ఓట్లను తొలగించేందుకు టీడీపీ నేతలు అధికారులతో కలిసి కుట్ర చేస్తున్నారని తెలుస్తోంది. 

సీఎం నకిలీ జిత్తులు
ఇదిలా ఉంటే.. సొంత జిల్లాలో ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి సీఎం చంద్రబాబునాయుడు ‘నకిలీ’ ఎత్తులు కూడా వేస్తున్నారు. ఇబ్బడి ముబ్బడిగా దొంగ ఓట్లను జాబితాలో చేరుస్తున్నారు. కుప్పం, గంగాధర నెల్లూరు, నగరి, పలమనేరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు అధికంగా ఉన్నట్లు ఎలక్షన్‌ కమిషన్‌ గుర్తించింది. అయితే, వీటి తొలగింపు ప్రక్రియలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం క్రిష్ణయ్యయానాది కాలనీ, రామకృష్ణాపురం యానాది కాలనీల్లో నివాసంలేని వారి ఓట్లు దర్శనమిస్తున్నాయి.

కుప్పం నియోజకవర్గంలో కర్ణాటక, తమిళనాడు వాసులను ఎక్కువగా ఓటర్ల జాబితాలో చేరుస్తున్నారు. కాగా, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులంటే వారి ఓటుపై వేటు వేస్తున్నారు. అధికారులతో కుమ్మక్కయి ఓట్లను తొలగిస్తున్నారు. దీనిపై పలుమార్లు ఆందోళన చేసినా ఫలితంలేదు. నగరి నియోజకవర్గం వడమాలపేటకు చెందిన మురళీధర్‌రెడ్డి స్థానికంగా పేరున్న నేత. ఆయన ఓటుతో పాటు, ఆయన కుటుంబ సభ్యుల ఓట్లనూ తొలగించారు. అధికారులను అడిగినా సరైన సమాచారం ఇవ్వడంలేదని ఆయన వాపోతున్నాడు. 

మరిన్ని వార్తలు