చెలరేగుతున్న చైన్‌స్నాచర్స్

14 Sep, 2015 03:20 IST|Sakshi
చెలరేగుతున్న చైన్‌స్నాచర్స్

నెల్లూరు (క్రైమ్) : పోలీసుల నిఘా వైఫల్యం.. మహిళల ఏమరపాటుతో జిల్లాలో చైన్‌స్నాచర్లు చెలరేగిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఒంటరిగా నడిచి వెళ్తున్న మహిళలను.. మరి కొన్ని చోట్ల పలానా వారి అడ్రసు కావాలంటూ అడుగుతూ మహిళల మెడల్లో బంగారు చైన్లను తెంచుకెళ్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగిన రోజు వాహనాల తనిఖీలతో పోలీసులు సరిపెడుతుండటంతో  చైన్‌స్నాచర్స్ పేట్రేగిపోతున్నారు.  

 నిఘా నిస్తేజం.. రికవరీలు లేవు..
 నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో  చైన్‌స్నాచర్లు హల్‌చల్ చేస్తున్నారు. ప్రధానంగా నగరంలో ప్రతి రోజు ఏదో ఒక పోలీసుస్టేషన్ పరిధిలో మహిళల మెడల్లోని బంగారు గొలుసులు, తాళిబొట్లు తెంపుకెళుతున్నారు. కొందరు పాతనేరస్తులతో పాటు, జల్సాలకు అలవాటు పడిన యువకులు ముఠాలుగా ఏర్పడి ఈ తరహా చోరీలకు పాల్పడుతున్నట్లు సమాచారం. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్ జిల్లాలో తిష్టవేసి దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసు నిఘా వర్గాలు సైతం హెచ్చరించాయి. అయినా జిల్లా పోలీస్ యంత్రాంగం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది. ఏడాది కాలంలో 150కు పైగా చైన్‌స్నాచింగ్‌లు జరిగినట్లు పోలీసు రికార్డుల్లో కేసులు నమోదు అయ్యాయి.

రికార్డులకెక్కని ఘటనలు ఇంకెన్నో ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 86కు పైగా చైన్‌స్నాచింగ్‌లు జరిగాయి. నేరాలను నియంత్రించాల్సిన నిఘా విభాగం నిస్తేజంగా మారింది. దీంతో దోపిడీలు, దొంగతనాలు అధికమవుతున్నాయి. వీటిని నియంత్రించడంలో నగర పోలీసులు విఫలమైయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి పోలీసుస్టేషన్‌లో క్రైం సిబ్బంది, బ్లూకోట్స్, రక్షక్ పోలీసులు, సీసీఎస్ బృందాలున్నా ప్రయోజనం శూన్యంగా మారింది.    

 నిఘా ముమ్మరం చేశాం : నగర డీఎస్పీ ఎస్ మగ్బుల్  
 చైన్‌స్నాచర్ల కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. ఈ తరహా నేరాలకు పాల్పడేవారంతా యువకులు, కొత్త నేరస్తులే. వారిలో జల్సాలకు అలవాటుపడిన విద్యార్థులు, యువకులు ఉన్నారు. హైస్పీడ్ బైక్‌ల్లో శివారు ప్రాంతాలు, కళాశాలలు, జనసంచారం తక్కువగా ఉండే కాలనీల్లో తిరుగుతూ చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. ఎవరికైనా అనుమానమొచ్చినా, నంబరు ప్లేటు లేని మోటారుసైకిళ్లపై అనుమానాస్పదంగా తిరుగుతుంటే వెంటనే డయల్ 100కు, స్థానిక పోలీసుస్టేషన్‌కు సమాచారం అందించాలి.
 
 మచ్చుకు కొన్ని..
► సంగం మండలానికి చెందిన ఓ యువకుడు తన స్నేహితురాలిని బైక్‌పై ఎక్కించుకుని వస్తుండగా పొట్టేపాళెం సమీపంలో దుండుగులు ఆ యువతిని బెదిరించి ఆమె మెడలోని బంగారు గొలుసును దోచుకెళ్లారు.
►నెల్లూరు నగరంలోని జెడ్పీ కాలనీలో ఆగస్టు 24న రాధ అనే వృద్ధురాలిని బెదిరించి ఆమె మెడలోని నాలుగు సవర్ల బంగారు గొలుసును దోపిడీ చేశారు.
► నాయుడుపేటలో ఆగస్టు 26న ఓజిలి మండలం చిలమానుచేనుకు చెందిన మంజుల అనే అంగన్‌వాడీ మెడలోని నాలుగుసవర్ల బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లారు. అంగన్‌వాడీ కార్యకర్తలు పలువురు వెళ్తుండగా ఈ సంఘటన జరగడం విశేషం.
► ఈ నెల 3న నెల్లూరులోని యనమాలవారిదిన్నెకు చెందిన వసంత అనే మహిళ పాలబూత్‌లో పాలు పోసి వెళ్తుండగా బంగ్లాతోట సమీపంలో రెండున్నర సవర్ల చైన్ లాక్కెళ్లారు.
► తాజాగా శుక్రవారం నెల్లూరు నగరంలోని భక్తవత్సలనగర్‌లో ఓ చిరునామా అడుగుతూ వచ్చిన ఇద్దరు దుండగులు జషింతమ్మ అనే మహిళ మెడలోని ఎనిమిది సవర్ల బంగారు చైన్లు లాక్కెళ్లారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు