మహిళలు తలచుకుంటే సీఎం కూడా దిగిపోవాల్సిందే

27 Jul, 2015 23:41 IST|Sakshi
మహిళలు తలచుకుంటే సీఎం కూడా దిగిపోవాల్సిందే

మందుబాబుల ఆగడాలతో కదంతొక్కిన మహిళలు
{పభుత్వ మద్యం దుకాణం ఎత్తివేయాలని రాస్తారోకో, ధర్నా
ఎక్సైజ్ సీఐ కార్యాలయం ముట్టడి
 

యలమంచిలి : ఎక్కడపడితే అక్కడ ఇష్టారాజ్యంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్ధినులు, మహిళలు, మహిళా ఉద్యోగులు ఆ మార్గాల మీదుగా వెళ్లలేకపోతున్నారు. మందుబాబుల ఆగడాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి. వారి వేధింపులు భరించలేకపోతున్నాం. అత్యంత రద్దీగా ఉండే సీత, తులసీ థియేటర్ల మార్గంలో ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు చేయడమేమిటి? ఈ దుకాణాన్ని అక్కడ నుంచి తరలించాలని ఎంతమందికి చెప్పినా అరణ్యరోదనే అవుతోంది. వెంటనే మందుబాబుల ఆగడాలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు మద్యం దుకాణాన్ని అక్కడ నుంచి తరలించాల్సిందేనంటూ సోమవారం యలమంచిలి పట్టణంలోని 6, 7, 8, 9 వార్డులకు చెందిన మహిళా సంఘాల నేతలు, స్థానిక మహిళలు భారీ ఆందోళన చేపట్టారు.

ఎక్సైజ్ సీఐ కార్యాలయం ఎదురుగా ప్రధాన రహదారిపై రాస్తారోకో, ధర్నా చేపట్టారు. వాహనాల రాకపోకలు అడ్డుకుని నినాదాలు చేశారు. మానవహారంగా ఏర్పడి ఎక్సైజ్ సీఐ, సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతరం ఎక్సైజ్ సీఐ కార్యాలయాన్ని ముట్టడించారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్‌ఐ జి.బాలకృష్ణ మహిళా కానిస్టేబుళ్లు, సిబ్బందితో రాస్తారోకో జరుగుతున్న ప్రదేశానికి చేరుకుని మహిళలకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఎక్సైజ్ సీఐ కార్యాలయంలో డ్యూటీలో ఉన్న సెంట్రీ మహిళా కానిస్టేబుల్‌కు మహిళలు వినతి పత్రం ఇచ్చి, రెండు రోజుల్లోగా ప్రభుత్వ మద్యం దుకాణం వేరేచోటికి మార్చకపోతే మహిళల సత్తా ఏమిటో చూపుతామని హెచ్చరించారు. మహిళలు ధర్నా చేస్తున్న సమయంలో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ ‘మీకేం పనిలేదా ?’ అనడంతో ఆందోళన చేస్తున్న మహిళలు మరింత ఆగ్రహానికి గురయ్యారు.

తాము ఎవరితోనూ మాటలు పడాల్సిన పనిలేదని, మహిళలను చులకనగా చూస్తే భారీ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. మహిళల జోలికి వచ్చినా, అవమానించినా ముఖ్యమంత్రి కూడా కుర్చీదిగిపోవాల్సి వస్తుందని అన్నారు. ఆందోళన కార్యక్రమంలో కరణం రమాదేవి, కాండ్రేగుల నూకరత్నం, వేగి పుష్ప, మళ్ల సరోజిని, కర్రి లక్ష్మి, దొడ్డి పావని, శీరందాసు సూర్యకుమారి, వై.లక్ష్మి, దాడి మంగ, మారిశెట్టి నూకరత్నం, సత్యవతి సహా పలువురు మహిళలు పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు