ఖాకీ కక్ష సాధింపు

17 Apr, 2019 10:12 IST|Sakshi
చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు

టీడీపీ అండతో రెచ్చిపోయిన సీఐ నారాయణరెడ్డి

వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగం

బదిలీ చేసినా బరితెగించిన పోలీసు

సస్పెన్షన్‌కు వైఎస్సార్‌ సీపీ నేతల డిమాండ్‌

అనంతపురం సెంట్రల్‌: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్న సీఐ నారాయణరెడ్డి మరో సారి రెచ్చిపోయారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ చేసిన ఫిర్యాదు మేరకు సీఐపై ఎన్నికల కమిషన్‌ వేటు వేసింది. దీంతో తనను బదిలీ చేయించారని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై సీఐ అక్కసు పెంచుకున్నారు. ఈ క్రమంలో సోమవారం ఓ ఘటనకు సంబంధించి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలైన ఖాదర్, హుస్సేన్, రఘులను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించుకుని వారిపై తప్పుడు కేసులు నమోదు చేయించారు. విచారణ పేరుతో విచక్షణారహితంగా చితకబాది థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. ఈ దాడిలో ముగ్గురు కార్యకర్తలూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. జేసీ బ్రదర్స్‌కు అనుకూలంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సీఐని తాడిపత్రిలో ఎం దుకు కొనసాగిస్తున్నారంటూ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నించారు.విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం జిల్లా అ«ధ్యక్షులు గయాజ్‌బాషా, ఎస్సీ జిల్లా అధ్యక్షులు పెన్నోబిలేసు తదితరులు ఆస్పత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు.  

సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఇటీవల ఎన్నికల కమిషన్‌ వేటు వేయడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టార్గెట్‌ చేసుకుని కక్షసాధింపులకు పాల్పడుతున్న సీఐ నారాయణరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని గయాజ్‌బాషా డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఈయనకు తాడిపత్రితో సంబంధం లేకపోయినప్పటికీ ఇక్కడే మకాం వేశారన్నారు. వైఎస్సార్‌సీపీ కోసం పనిచేసిన ముగ్గురు కార్యకర్తలనూ కేసు విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి బండబూతులు తిట్టడమే కాకుండా విచక్షణారహితంగా కొట్టాడని తెలిపారు. ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షులు పెన్నోబిలేసు మాట్లాడుతూ తాడిపత్రిలో జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచకం సృష్టిస్తున్నాడన్నారు. దళితుల జోలికొస్తే పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. పోలీసులు కూడా పచ్చ చొక్కాలు వేసుకొని వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వెంటనే సీఐని సస్పెండ్‌చేయాలని, లేదంటే తాడిపత్రి పట్టణ బంద్, ఎస్పీ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షారెడ్డి, రాప్తాడు జెడ్పీటీసీ వెన్నపూస రవీంద్రారెడ్డి తదితరులు కూడా బాధితులను ఆస్పత్రిలో పరామర్శించారు.  కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కందిగోపుల మురళీధర్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, సంపత్, భాను తదితరులు పాల్గొన్నారు.   

>
మరిన్ని వార్తలు