సీఐ శ్యామరావుపై బదిలీ వేటు

4 Aug, 2018 10:46 IST|Sakshi
సీఐ శ్యామరావు, నూతన సీఐ రాజశేఖర్‌

సీఐ నోటిదురుసుతో పోలీసు శాఖకు చెడ్డపేరు

అవినీతి, ఆరోపణలపై     ‘సాక్షి’లో వరుస కథనాలు

రాత్రి వీఆర్‌కు.. ఉదయాన్నే సీసీఎస్‌కు బదిలీ ఉత్తర్వులు

అనంతపురం సెంట్రల్‌: వరుస వివాదాలకే కేరాఫ్‌గా మారిన అనంతపురం నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌ సీఐ శ్యామరావుపై బదిలీ వేటు పడింది. అవినీతి ఆరోపణలు, ముఖ్యంగా న్యాయవాదిపై దాడి ఘట న పోలీసు శాఖకే చెడ్డపేరు తీసుకొచ్చింది. ఉన్నతాధికారులు సైతం సీఐ వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో మందలించడంతో చివరకు క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. దీంతో స్టేషన్‌లో ‘పంచాయితీ’లు కూడా బెడిసికొట్టి వార్తల్లోకెక్కారు. చివరకు తమ కానిస్టేబుల్‌నే లాకప్‌లో వేస్తానని బెదిరించిన ఘటన కలకలం రేపింది. ఈ వ్యవహారాలన్నింటిపై ‘సాక్షి’ లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. అప్పట్లోనే చర్యలు ఉంటాయని భావించినప్పటికీ ఓ ప్రజాప్రతినిధి అండతో ఆయన అలాగే కొనసాగుతూ వచ్చారు. చివరకు సీఐ శ్యామరావును వీఆర్‌ కు బదిలీ చేస్తూ అనంతపురం రేంజ్‌ డీఐజీ ప్రభాకర్‌రావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 

ఉత్తర్వులు తీసుకునేందుకు ససేమిరా  
వీఆర్‌కు బదిలీ చేస్తూ జారీ అయిన ఉత్తర్వులను అందుకోవడానికి సీఐ శ్యామరావు ససేమిరా అన్నట్లు తెలిసింది. బదిలీ ఉత్తర్వులు వచ్చినా యథాస్థానంలో కొనసాగేందుకు ప్రయత్నాలు చేసినట్లు నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో మళ్లీ పైస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి వీఆర్‌ నుంచి సీసీఎస్‌ సీఐగా పోస్టింగ్‌ ఇప్పించుకున్నారు.

నూతన సీఐగా రాజశేఖర్‌
నాల్గవ పట్టణ నూతన సీఐగా రాజశేఖర్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో స్పెషల్‌బ్రాంచ్‌ సీఐగా పనిచేశారు. తర్వాత కర్నూలకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం నాల్గవ పట్టణ సీఐగా నియమించడంతో శుక్రవారం ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. నూతన సీఐకి ఎస్‌ఐలు, సిబ్బంది స్వాగతం పలికారు.    

మరిన్ని వార్తలు