కీచకుడికి ఖద్దరు వత్తాసు

16 Sep, 2018 08:01 IST|Sakshi

లైంగిక వేధింపుల కేసులో సీఐ సస్పెన్షన్‌

మహిళ ఫిర్యాదుపై ఉన్నతాధికారుల విచారణ 

సీఐ తప్పు చేసినట్లు నిర్ధారించిన అధికారులు

పోస్టింగ్‌ ఇవ్వాలంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిడి

‘లైంగిక వేధింపులకు పాల్పడేవారిని చీపుర్లతో కొట్టండి’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో గుంటూరులో మహిళలకు పిలుపునిచ్చారు. అందుకు భిన్నంగా ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన సీఐని కాపాడేందుకు అధికార పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే ఒకరు రంగంలోకి దిగారు. పోలీసులు సస్పెండ్‌ చేసిన సీఐకి తిరిగి పోస్టింగ్‌ ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారు.

సాక్షి, గుంటూరు: విచక్షణ మరచిన సీఐ ఒకరు ఓ మహిళను లైంగికవేధింపులకు గురిచేశారు. ఎంత బతిమాలినా ఆ సీఐ మాట వినకపోవడంతో బాధితురాలు పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల విచారణలో సీఐ కీచకపర్వం వాస్తవమేనని తేలడంతో అతనిపై సస్పెన్షన్‌ వేటువేశారని సమాచారం. అయితే అధికారపార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే ఒకరు కీచక సీఐకి అండగా నిలిచి, సస్పెన్షన్‌ ఎత్తివేసి పిడుగురాళ్ల టౌన్‌ సీఐగా పోస్టింగ్‌ ఇవ్వాలంటూ డీజీపీ కార్యాలయం నుంచి ఒత్తిడి తెస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

 గుంటూరు జిల్లాలోని అర్బన్, రూరల్‌ జిల్లాల పరిధిలో పలు పోలీసు స్టేషన్లలో ఎస్‌ఐగా, సీఐగా విధులు నిర్వర్తించి ప్రస్తుతం రైల్వేలో సీఐగా పనిచేస్తున్న పోలీసు అధికారి ఒకరు తనపై లైంగిక వేధింపులకు పాల్ప డ్డారంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపారు. సదరు సీఐ లైంగిక వేధింపులకు పాల్పడ్డ విషయం వాస్తవమేనని ఆ విచారణలో తేలింది. సీఐపై చర్యలకు పోలీసు ఉన్నతాధికారులు సిఫార్సు చేశారు. పది రోజుల క్రితమే సదరు సీఐపై సస్పెన్షన్‌ వేటు వేశారని సమాచారం. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. 

అందుకు కారణం అధికార పార్టీ నేతల నుంచి వస్తున్న ఒత్తిళ్లేనని సమాచారం. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండతో వరుసగా లా అండ్‌ ఆర్డర్‌ పోస్టింగ్‌లు పొందుతూ వారికి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆరు నెలల క్రితం కీచక సీఐని వీఆర్‌కు పిలిచి రైల్వేకు బదిలీ చేశారు. అయితే ఆ సీఐ తనతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ మహిళ పలుమార్లు ఎస్పీ, ఐజీకి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించారు. 

ఆ విచారణలో వేధింపులు వాస్తవమేనేని తేలిన తరువాత సస్పెండ్‌ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఆ సీఐను రక్షించేందుకు అధికార పార్టీకి చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని, పిడుగురాళ్ల టౌన్‌ సీఐగా పోస్టింగ్‌ ఇవ్వాలని పోలీసు ఉన్నతా ధికారులపై ఒత్తిడి పెంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఎవరైనా బాధిత మహిళ ఫిర్యాదు చేస్తే వెంటనే కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయడంతోపాటు కఠిన సెక్షన్‌లు వేసి రిమాండ్‌కు పంపే పోలీసు అధికారులు, తమ శాఖకు చెందిన కీచక అధికారి వ్యవహారాన్ని గోప్యంగా ఉంచుతూ సస్పెన్షన్‌ను సైతం ఎత్తివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు