పైరవీలతో భంగపాటు !

23 Jan, 2019 07:48 IST|Sakshi

మళ్లీ నిలిచిన సీఐల బదిలీలు

డీఐజీ రవికుమార్‌మూర్తి మౌఖిక ఆదేశాలు!

ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లే కారణం

సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు: పోలీసుల బదిలీల్లో అధికారులకు పైరవీల తలనొప్పి తప్పడం లేదు. తమకు అనుకూలంగా లేనివారిని నియమించడం ఏమిటంటూ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సీఐల బదిలీలు మళ్లీ నిలిచిపోయాయి. ఒక డీఐజీ స్థాయి అధికారి చేసిన బదిలీలు ఆగిపోవడం  రెండునెలల్లో ఇది మూడోసారి. ఈ నెలాఖరుకు ఉద్యోగ విరమణ చేయనున్న డీఐజీ                      
రవికుమార్‌ మూర్తి రెండురోజుల క్రితం చేసిన బదిలీలను మళ్లీ ఆయనే నిలిపివేసినట్లు సమాచారం. కొత్తపోస్టింగ్‌లలో చేరవద్దంటూ బదిలీ అయిన సీఐలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.

కామినేని పట్టు!
 కైకలూరు సీఐగా పని చేస్తున్న రవికుమార్‌కు మూడేళ్ల కాలపరిమితి పూర్తికాకపోవడంతో అక్కడే కొనసాగించాలని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ పట్టుపడుతున్నారు. అయితే అతనిని మార్చి చెన్నకేశవరావును డీఐజీ నియమించారు. దీనిపై కామినేని శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు ప్రభుత్వ ఉన్నతాధికారులపైనా ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. అలాగే జిల్లాలోని జంగారెడ్డిగూడెం సీఐ విషయంలో స్థానిక ఎమ్మెల్యే పీతల సుజాత మాట వినకుండా ఎంపీ మాగంటి బాబు సూచించిన వ్యక్తికి పోస్టింగ్‌ ఇచ్చారు. కడియం, రాజానగరం సీఐల విషయంలో గోరంట్ల  బుచ్చయ్యచౌదరి, పెందుర్తి వెంకటేష్‌ కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. తాము లేఖ ఇచ్చిన వారికి కాకుండా వేరేవారికి పోస్టింగ్‌ ఇవ్వడంపై వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

ఇంటిలిజెన్స్‌ ఏజీ జోక్యంతోనే!
అయితే ఇంటిలిజెన్స్‌ అడిషనల్‌ డీజీ ప్రమేయంతో ఈ బదిలీలు జరిగినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆయన జోక్యంతో జరిగిన బదిలీలు వివాదానికి కారణంగా మారాయి. దీంతో ఎమ్మెల్యేలకు చెప్పలేక, ఉన్నతాధికారి మాట కాదనలేని పరిస్థితి వివాదానికి దారి తీసింది. ఒకేసారి ఇంతమంది ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో బదిలీలను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు సమాచారం.

గతంలోనూ వివాదం
మరోవైపు గతంలో భీమవరం రూరల్‌ సీఐ నియామక విషయంలో  అధికార పార్టీలోని నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కనుమూరు రామకృష్ణంరాజు, ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు మధ్య కోల్డ్‌వార్‌కు దారి తీసిన సంగతి తెలిసిందే. భీమవరం రూరల్‌ సీఐ నియామకం విషయంలో తాను సిఫార్సు చేసిన అధికారిని కాకుండా మరొకరికి పోస్టింగ్‌ ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ వేటుకూరి శివరామరాజు బెదిరింపులకు దిగడంతో అప్పటికే ఇచ్చిన పోస్టింగ్‌లు రద్దు చేసి ఎమ్మెల్యే చెప్పిన వ్యక్తులకు పోస్టింగ్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతంలో పాలకొల్లు రూరల్‌ స్టేషన్‌కు ఎస్‌బీలో ఉన్న కొండలరావును నియమించగా, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అడ్డుకుని పోస్టింగ్‌ నిలిపివేశారు. తర్వాత తనకు అనుకూలంగా ఉండే సీఐని తెచ్చుకున్నారు. ఏలూరు రేంజి చరిత్రలో ఇన్నిసార్లు పోస్టింగ్‌లు మార్చిన సందర్భాలు లేవని పోలీసు అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు