టీడీపీ అడ్డా నుంచే నిమ్మగడ్డ లేఖ?

25 Apr, 2020 02:45 IST|Sakshi

సీఐడీ దర్యాప్తులో వెలుగులోకి వాస్తవాలు.. ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌ ఫార్మాట్‌ 

లేఖ ఆధారాలను ధ్వంసం చేయడంతో బలపడుతున్న అనుమానాలు 

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు లేఖ, నిమ్మగడ్డ లేఖకు ఒకే రిఫరెన్సు నెంబర్‌ 

డీజీపీకి విజయసాయిరెడ్డి ఫిర్యాదుతో కదులుతున్న డొంక

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి పంపించినట్లుగా చెబుతున్న లేఖ ఎక్కడ తయారైందనే అంశంపై సీఐడీ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నట్లుగానే ఆ లేఖ టీడీపీ అడ్డా నుంచే నిమ్మగడ్డకు చేరిందనే అనుమానాలు బలపడుతున్నాయి. నిమ్మగడ్డ లేఖపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ వి.విజయసాయిరెడ్డి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఈనెల 14న ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. కేంద్రానికి రాసినట్లుగా చెబుతున్న లేఖకు సంబంధించిన అన్ని ఆధారాలను ధ్వంసం చేసినట్లు నిమ్మగడ్డ వద్ద సహాయ కార్యదర్శిగా పనిచేసిన కె.సాంబమూర్తి సీఐడీ అధికారుల వద్ద అంగీకరించారు. మొదట ల్యాప్‌టాప్‌లో లేఖ తయారు చేసి పెన్‌డ్రైవ్‌ ద్వారా డెస్క్‌టాప్‌లో వేసినట్లు చెప్పిన సాంబమూర్తి వాట్సాప్‌ వెబ్‌ ద్వారా నిమ్మగడ్డకు పంపినట్టు వెల్లడించారు. ఆ లేఖను రమేష్‌కుమార్‌ మొబైల్‌ నుంచి కేంద్రానికి పంపినట్లు సాంబమూర్తి సీఐడీకి తెలిపారు. అయితే ల్యాప్‌టాప్‌లో ఫైల్స్‌ డిలీట్‌ చేయడం, పెన్‌ డ్రైవ్‌ ధ్వంసం కావడంతోపాటు డెస్క్‌ టాప్‌ను రెండు మూడు పర్యాయాలు ఫార్మాట్‌ చేసినట్లు నిర్ధారణ అయింది. దీనికితోడు కేంద్రానికి నిమ్మగడ్డ రాసిన లేఖ రిఫరెన్స్‌ నెంబర్‌ 221తోనే టీడీపీ ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు రాసిన లేఖ కూడా ఉండటం గమనార్హం. 
 
సీఐడీ అదనపు డీజీ సునీల్‌ కుమార్‌ వెల్లడించిన వివరాలు ఇవీ.. 
► రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన 10–15 నిమిషాల్లోనే అప్పటి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కేంద్రానికి లేఖ రాశారు. 
► నిమ్మగడ్డ లేఖపై వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ విచారణ చేపట్టి కె.సాంబమూర్తిని విచారించాం. ఆయన ఇచ్చిన వాగ్మూలం మేరకు మార్చి 18న నిమ్మగడ్డ కేంద్రానికి లేఖ రాశారు. దీనికి ఒకరోజు ముందే కేంద్ర హోంశాఖ చిరునామా, మెయిల్‌ వివరాలను నిమ్మగడ్డ తీసుకున్నట్లు విచారణలో సాంబమూర్తి చెప్పారు. కానీ సాంబమూర్తి కథనానికి, జరిగిన దానికి చాలా విరుద్ధ్దమైన అంశాలున్నాయి. 
► సుప్రీం కోర్టు తీర్పు రాగానే నిమ్మగడ్డ అప్పటికే రాసుకున్న డ్రాప్ట్‌ను తెచ్చి డిక్టేట్‌ చేస్తే తాను లాప్‌టాప్‌లో టైప్‌ చేసి  పెన్‌డ్రైవ్‌ ద్వారా తీసుకుని డెస్క్‌ట్యాప్‌కు కనెక్ట్‌ చేసి ప్రింటౌట్‌ తీసుకున్నట్లు సాంబమూర్తి చెప్పారు. దీనిపై నిమ్మగడ్డ సంతకం తీసుకుని డెస్క్‌టాప్‌కు ఉన్న స్కానర్‌తో స్కాన్‌ చేసి వెబ్‌ వాట్సాప్‌ ద్వారా తిరిగి నిమ్మగడ్డ మొబైల్‌కు పంపించినట్లు సాంబమూర్తి పేర్కొన్నాడు. నిమ్మగడ్డ తన మొబైల్‌ నుంచి వాట్సాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకుని కేంద్ర హోంశాఖకు మెయిల్‌ ద్వారా పంపించి ఉంటారన్నది సాంబమూర్తి వాంగ్మూలం. 
► ల్యాప్‌టాప్‌లో లెటర్‌ను డిలీట్‌ చేసినట్లు సాంబమూర్తి చెప్పాడు. డెస్క్‌టాప్‌ను రెండు మూడుసార్లు ఫార్మాట్‌ చేసి మళ్లీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను లోడ్‌ చేశారు. పెన్‌డ్రైవ్‌ను ధ్వంసం చేశారు.   
► ఇది నిజంగా సాధారణ ప్రక్రియలో భాగంగా జరిగిన కమ్యూనికేషన్‌ అనుకుంటే ఈ ఆధారాలను «ఇంత హడావుడిగా ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమిటి? అన్న ప్రశ్నకు సాంబమూర్తి సమాధానం చెప్పడం లేదు. ఆ లేఖ బయట నుంచి వచ్చిందా? ల్యాప్‌టాప్‌ ద్వారా మార్పులు చేసుకుని డౌన్‌లోడ్‌ చేసి నిమ్మగడ్డకు ఇచ్చారా? ఇలా పలు ప్రశ్నలకు సాంబమూర్తి సరైన జవాబు చెప్పట్లేదు. 
సమాధానాలు రావడంలేదు. లేఖ బయట నుంచి వచ్చిందా? మీరే తయారు చేశారా? అంటే సహేతుకమైన సమాధానం రాలేదు. 
► సాక్ష్యాలను (ఎవిడెన్స్‌) ట్యాంపర్‌ చేయడాన్ని గమనిస్తే కచ్చితంగా ఏదో జరిగింది. అనుమానించదగ్గ విషయం ఏదో ఉంది. లేదంటే ఆధారాలను ధ్వంసం చేయరు. 
► నిమ్మగడ్డ కేంద్రానికి రాసిన లేఖ నెంబర్‌ 221. టీడీపీ ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు రాసిన లెటర్‌కు 221 నెంబర్‌ ఇచ్చారు. ఒకే నెంబర్‌తో రెండు కమ్యూనికేషన్‌లు జరిగినట్లు  గుర్తించాం. 
► ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లను సైబర్‌ ఫోరెన్సిక్‌ పద్దతుల్లో రిస్టోర్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఫార్మాట్‌ చేసిన హార్డ్‌ డిస్క్‌ను కూడా ఫోరెన్సిక్‌ టూల్స్‌ ద్వారా పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. దీన్ని బట్టి అసలు ఆ లేఖ ఎక్కడ నుంచి వచ్చింది? అనే విషయాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.   
 
సీఐడీ దర్యాప్తులో తేలాల్సింది...
► హోంశాఖకు రాసిన లేఖ రహస్యం అనుకుంటే దాన్ని మాత్రమే డిలీట్‌ చేయాలి కానీ ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌ను ఫార్మాట్‌ చేయాల్సిన అవసరం ఏమిటి? 
► హోంశాఖకు నిమ్మగడ్డ రాసిన లేఖ రహస్యమే అయితే టీడీపీ కార్యాలయంలోని మీడియా ప్రతినిధుల చేతికి ఎలా వచ్చింది? జన సామాన్యంలోకి లేఖ ఎలా వచ్చింది?  

మరిన్ని వార్తలు