సీఐడీ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్

17 Mar, 2015 03:25 IST|Sakshi

భార్య హత్య కేసులో నిందితుడు
 
 కర్నూలు : కర్నూలు సీఐడీ విభాగంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న యుగంధర్‌ను హత్యా నేరం కేసులో సోమవారం కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా మేడిపల్లి గ్రామానికి చెందిన యుగంధర్ అదే జిల్లాలోని కేశవపురం గ్రామానికి చెందిన సమీప బంధువు విశాలిని ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. 2002లో పోలీస్ శాఖలో యుగంధర్ ఎస్‌ఐగా ఎంపికయ్యారు. కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు, శ్రీశైలం, సంజామల, కోవెలకుంట్ల ప్రాంతాల్లో పని చేశారు. విశాలి పెళ్లికి ముందే ఓపన్ హార్ట్ సర్జరీ జరగడంతో సంతానం కలగలేదు. కోవెలకుంట్లలో ఎస్‌ఐగా పని చేసేటప్పుడు ఓ ఉపాధ్యాయురాలితో వివాహేతర సంబంధం కొనసాగించారు. ఆమెతోనే కొన్నేళ్లుగా సహజీవనం సాగిస్తూ హోళగుందలో కాపురం పెట్టారు.

ఈ విషయం భార్య విశాలికి తెలిసి భర్తతో గొడవ పడి కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అప్పట్లో యుగంధర్‌పై కేసు కూడా నమోదైంది. కొంత కాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయి తర్వాత భార్యతో రాజీ అయి కాపురం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈనెల 10వ తేదీన ఆమె అనుమానాస్పద స్థితిలో వృతి చెందింది. కర్నూలులోని నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో నివాసం ఉంటున్నాడు. బాత్‌రూంలో కాలు జారి పడి దెబ్బలు తగిలి ఆసుపత్రిలో కోలుకోలేక వృతి చెందిందని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అయితే తన కూతురిని హత్య చేసి ప్రమాదవశాత్తు మరణించిందంటూ బుకాయిస్తున్నాడని విశాలి తండ్రి నారాయణ, తల్లి ప్రమీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి యుగంధర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. విశాలిది హత్యేనని పోలీసుల విచారణలో బయట పడటంతో కర్నూలు డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో సోమవారం సాయంత్రం కర్నూలు హెడ్ పోస్టాఫీసు వద్ద యుగంధర్‌ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి శ్రీనివాసరావు ఎదుట హాజరు పరచగా రిమాండ్‌కు ఆదేశించారు.

మరిన్ని వార్తలు