కంచికచర్లలో సీఐడీ అధికారుల దాడులు

29 Feb, 2020 10:36 IST|Sakshi

సాక్షి, విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో రాజధానిలో చోటు చేసుకున్న ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో సీఐడీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఈ క్రమంలో శనివారం కంచికచర్లలో సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కంచికచర్ల తెలుగుదేశం పార్టీ మార్కెటయార్డ్ మాజీ ఛైర్మన్ నన్నపనేని లక్ష్మీ నారాయణ ఇంటిలో సోదాకు వెళ్లారు. అయితే సీఐడీ వస్తుందన్న సమాచారం ముందుగానే తెలుసుకున్న లక్ష్మీనారాయణ ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయారు. దీంతో సీఐడీ అధికారులు ఆయన ఇంటి గుమ్మానికి నోటీసులు అంటించి వెళ్లిపోయారు. కాగా లక్ష్మీనారాయణ అల్లుడు దమ్మాలపాటి శ్రీనివాసరావు.. చంద్రబాబు  హయాంలో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక ఆయన కుమారుడు సీతారామరాజు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు, టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టర్‌గా వ్యవహరించారు. (ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో అక్రమాల 'వరద')

కాగా చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అక్రమాలపై విచారణకు ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిట్‌ ప్రత్యేకాధికారి, ఇంటెలిజిన్స్‌ డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి బృందం శుక్రవారం విజయవాడలో దాడులు నిర్వహించింది. రాజధానిలో భూములు కొనుగోలు చేసిన పేదల వెనుక ఉన్న బినామీల గుట్టు విప్పేందుకు టీడీపీ నేతలకు చెందిన ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. ఇందులో భాగంగా విజయవాడ పటమటలో కొందరు కోటీశ్వరుల ఇళ్లను కూడా తనిఖీ చేసింది. వీరిలో ఒకరు టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బంధువుగా చెబుతున్నారు. వీరి ఇళ్లల్లో సిట్‌ పలు కీలక ఆధారాలు సేకరించింది. ఇక ఇప్పటికే రాజధాని భూముల వ్యవహారంలో టీడీపీ మాజీ మంత్రులు ప్రత్తిపాటి, నారాయణలపై సీఐడీ ఏడు కేసులు నమోదు చేసిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు