బ్లూ ఫ్రాగ్‌ కాదు.. ఎల్లో ఫ్రాగే!

15 Nov, 2019 05:16 IST|Sakshi

2018లో లక్ష ట్రక్కుల ఇసుక బ్లాక్‌

‘మన శాండ్‌’ యాప్‌ లావాదేవీలపై సీఐడీ ఆరా

టీడీపీ హయాంలో ఇసుక యాప్‌ నిర్వహణ బ్లూ ఫ్రాగ్‌ సంస్థకే

కృష్ణాతీరం వెంబడి ర్యాంపుల నిర్వహణ కూడా..

14 సర్వర్ల సమాచారాన్ని విశ్లేషిస్తున్న సైబర్‌ క్రైం పోలీసులు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఇసుక సరఫరా వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్లూ ఫ్రాగ్‌ మొబైల్‌ టెక్నాలజీ సంస్థ నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. 2018లో ఒక్క ఏడాదిలోనే ‘మన శాండ్‌’ యాప్‌ ద్వారా లక్ష ట్రక్కుల ఇసుకను బ్లాక్‌ చేసినట్టు సీఐడీ పోలీసులకు ఆధారాలు దొరికాయని తెలుస్తోంది. ఈ ఇసుక ఎక్కడికి చేరిందో తెలుసుకునేందుకు దర్యాప్తును సీఐడీ ముమ్మరం చేసింది. ఆ ఇసుకను ఎవరి కోసం బుక్‌ చేశారో అన్న వివరాలు స్పష్టంగా లేవని ఆశాఖ అధికారులు చెబుతున్నారు. టీడీపీ వ్రభుత్వంలో ఇష్టారాజ్యంగా ప్రజల సమాచారాన్ని సేకరించిన ఈ సంస్థ గత ఆరునెలలుగా ఏయే కార్యకలాపాలు నిర్వహించిందనే దానిపై కూడా విశ్లేషిస్తున్నారు.  
 
సర్వర్లలో సమాచార విశ్లేషణకు ప్రత్యేక బృందాలు
రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌ పోర్టల్‌ను బ్లాక్‌ చేసి కృత్రిమ ఇసుక కొరత సృష్టిస్తున్నట్టు బ్లూ ఫ్రాగ్‌పై గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి ఫిర్యాదులు అందిన సంగతి తెలిసిందే. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక సరఫరాకు సంబంధించి ‘మన శాండ్‌’ యాప్‌ను బ్లూ ఫ్రాగ్‌ నిర్వహించేది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఇసుక సరఫరా విధానాన్ని పర్యవేక్షిస్తున్న ఆర్‌టీజీఎస్‌(రియల్‌ టైం గవర్నెన్స్‌ సొసైటీ )ను బ్లాక్‌ చేశారని, లబి్ధదారులు చెల్లించే డబ్బులు కూడా మళ్లింపు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి గత రెండ్రోజులుగా విచారణ చేపట్టారు. బ్లూ ఫ్రాగ్‌కు చెందిన 14 సర్వర్ల సమాచారాన్ని క్రోఢీకరిస్తున్నారు. సర్వర్లలో సమాచారం ఎక్కువగా ఉండటంతో విశ్లేషణకు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. సీజ్‌ చేసిన సమాచారాన్ని పరిశీలన నిమిత్తం ఎప్పటికప్పుడు సైబర్‌ క్రైంకు పంపిస్తున్నారు. గత మూడేళ్లలో బ్లూ ఫ్రాగ్‌ నిర్వహించిన మన శాండ్‌ అప్లికేషన్‌ను నిశితంగా పరిశీలిస్తున్నారు.
 
ఒక్క ఏడాదిలో రూ.6 కోట్ల జీఎస్టీ చెల్లింపులు?
టీడీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణా, గుంటూరు జిల్లాలోని నదీతీరం వెంబడి ప్రధాన ఇసుక ర్యాంపులు బ్లూఫ్రాగ్‌ నిర్వహణలోనే ఉండేవని తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని ఇసుక ర్యాంపుల్లో పనిచేసే కాంట్రాక్టు సిబ్బందిని కూడా బ్లూ ఫ్రాగ్‌ సరఫరా చేసేదని సమాచారం. అప్పట్లో ఒక ఏడాదిలో రూ.6 కోట్ల జీఎస్టీ చెల్లించిన వైనంపైనా సీఐడీ పోలీసులు ఆరా తీస్తున్నారు. 2018 సెపె్టంబర్‌ నుంచి 2019 జనవరి వరకు జీఎస్టీ చెల్లింపులో జాప్యంపై రూ. 1.5 కోట్ల జరిమానా చెల్లించినట్టు వెల్లడైంది.  
 
క్లౌడ్‌ డేటాను పరిశీలిస్తున్నాం
బ్లూ ఫ్రాగ్‌ ప్రభుత్వ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసి ఇసుక కొరత ఉన్నట్టు చూపించిందనే ఫిర్యాదులు వచ్చాయి. వాటికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. బ్లూ ఫ్రాగ్‌ రూపొందించిన అప్లికేషన్ల క్లౌడ్‌ డేటాను పరిశీలించాల్సి ఉంది. రాష్ట్రంలో ఇసుక కొరత లేనప్పటికీ ఉన్నట్టు వెబ్‌సైట్‌లో చూపించారా? ర్యాంపులో ఇసుక ఉన్నా లేనట్లు చూపించారా? వంటి అనేక అనుమానాలు దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది.  
 పీవీ సునీల్‌ కుమార్, సీఐడీ ఏడీజీ  
 
అది టీడీపీ సంస్థే
 అది బ్లూ ఫ్రాగ్‌ కాదు.. ఎల్లో ఫ్రాగ్‌ అని ఎన్నికల ముందే తేలిపోయిందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు. విశాఖలో గురువారం మాట్లాడుతూ సరిగ్గా ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చౌర్యం చేశారనే ఆరోపణలపై బ్లూ ఫ్రాగ్‌పై కేసులు నమోదైన విషయాన్ని గుర్తు చేశారు. ‘అది తెలుగుదేశం పారీ్టకి చెందిన సంస్థే... అందులో అనుమానం లేదు.. అయితే ఇప్పుడు ఇసుక సరఫరాకు సంబంధించిన వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేయడం, కృత్రిమ కొరతను సృష్టించిందన్న ఆరోపణలపై ఇంకా విచారణ కొనసాగుతోంది. దర్యాప్తు పూర్తయిన తర్వాతే అసలు విషయాలు వెల్లడవుతాయి’ అని మంత్రి చెప్పారు.
కన్నబాబు

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు