వేగం పెంచిన సీఐడీ

11 Feb, 2020 06:04 IST|Sakshi

రిజిస్ట్రేషన్‌ కార్యాలయం నుంచి దస్తావేజులు స్వాధీనం 

కురగల్లు అసైన్డు భూముల రిజిస్ట్రేషన్‌పై ప్రత్యేక దృష్టి 

అసైన్డు, లంక భూములు ఎలా రిజిస్టర్‌ చేశారన్న దానిపై ఆరా 

అప్పటి అధికారుల తీరుపై విచారణ

టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు 

మంగళగిరి:  రాజధాని భూముల ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సీఐడీ విచారణను వేగవంతం చేసింది. ముఖ్యంగా అసైన్డు భూముల కొనుగోలు వివరాలను సేకరిస్తోంది. రాజధాని ప్రకటన వచ్చిన వెంటనే రాజధానిలోని అసైన్డు భూములు, లంక భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, పరిహారం ఇవ్వదంటూ టీడీపీ నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ మీడియేటర్లు గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అప్పటి ప్రభుత్వం సైతం అసైన్డు, లంక భూములు ప్రభుత్వానివే కనుక ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందంటూ జీవో జారీచేసి ఆ జీవోతో గ్రామాల్లో అసైన్డు, లంక భూముల యజమానులైన దళితులు, బీసీలను భయభ్రాంతులకు గురిచేసింది. మీ భూములు ప్రభుత్వం తీసేసుకుంటుందని, తమకు ఇస్తే ఎంతోకొంత డబ్బులు ఇస్తామంటూ టీడీపీ నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు దళితులు, చిన్నకారు రైతులను భయపెట్టి వారి వద్ద నుంచి ఆ భూములను కొనుగోలు చేశారు.

ఎకరం కోట్లలో ఉన్న భూమిని పది లక్షలు, ఇరవై లక్షలిచ్చి కొనుగోలు చేశారు. అనంతరం ప్రభుత్వం ఆ భూములకు పరిహారం ప్రకటించింది. దీంతో టీడీపీ నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆ భూములను రాజధాని భూసమీకరణకు ఇచ్చి పరిహారంగా పొందిన ప్లాట్లను కోట్లాది రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. అసైన్డ్, లంక భూములను రిజిస్ట్రేషన్‌ చేసే అవకాశం లేకున్నా కోర్టు ఉత్తర్వుల కాపీ ఒకటి సృష్టించి రిజిస్ట్రేషన్‌ అధికారులకు భారీగా లంచాలిచ్చి ముందుగా పెండింగ్‌ రిజిస్ట్రేషన్‌లు చేశారు. అసైన్డ్, లంక భూములను కొనుగోలు చేసిన నీరుకొండకు చెందిన టీడీపీ నాయకుడితో పాటు.. మరో పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు అప్పటి రిజిస్ట్రార్‌తో కలిసి 495 పెండింగ్‌ రిజిస్ట్రేషన్‌లు చేశారు. ఒక్కో రిజిస్ట్రేషన్‌కు లక్షల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు రాగా.. విచారించిన ఉన్నతాధికారులు అప్పటి రిజిస్ట్రార్‌ను సైతం సస్పెండ్‌ చేశారు.  

నాటి రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారుల తీరుపై సీఐడీ ఆరా  
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో రాజధాని భూములపై సీఐడీ విచారణ చేపట్టింది. ఇప్పటికే రాజధానిలో భూములు కొనుగోలు చేసిన తెల్లరేషన్‌ కార్డుదారులకు సంబంధించి రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టగా.. విచారణ నిర్వహించాల్సిందిగా ఆదాయపు పన్ను శాఖనూ సీఐడీ అధికారులు కోరారు. సోమవారం మంగళగిరిలోని రిజిస్టర్‌ కార్యాలయానికి చేరుకున్న సీఐడీ అధికారులు అసైన్డ్, లంక భూముల రిజిస్ట్రేషన్లతో పాటు మరికొన్ని దస్తావేజులు సేకరించి తీసుకెళ్లడం స్థానికంగా సంచలనం కలిగిస్తోంది. టీడీపీ నాయకులకు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు సహకరించిన అప్పటి రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల అధికారుల తీరుపైనా సీఐడీ అధికారులు ఆరా తీశారు. అప్పుడు పనిచేసిన అధికారులెవరు, టీడీపీ నాయకులు, రియల్‌ వ్యాపారులకు సహకరించిన అధికారులు, సిబ్బంది ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారనే అంశాలపై అధికార వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.  

>
మరిన్ని వార్తలు