హైదరాబాద్‌లోనే చిత్ర పరిశ్రమ విస్తృతి

4 Mar, 2014 01:26 IST|Sakshi
హైదరాబాద్‌లోనే చిత్ర పరిశ్రమ విస్తృతి

 ‘జై బోలో తెలంగాణ’ అభినందన సభలో వక్తల భరోసా
 సాక్షి, హైదరాబాద్: తెలుగు చిత్రపరిశ్రమ హైదరాబాద్‌లోనే మరింత విస్తరించేలా, అది ఇక్కడి నుంచి వీడి వెళ్లకుండా పటిష్టమైన చర్యలు తీసుకునే బాధ్యత భవిష్యత్ తెలంగాణ రాజకీయ నాయకత్వం మీదనే ఉందని టీఆర్‌ఎస్ నాయకుడు కె.తారకరామారావు (కేటీఆర్) అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘జై బోలో తెలంగాణ’ చిత్రం యూనిట్ సభ్యులు సోమవారం హైదరాబాద్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.
 
  ఈ సందర్భంగా అమరవీరుల నమూనా స్తూపం వద్ద అతిథులు శ్రద్ధాంజలి ఘటించారు. ‘‘కళామతల్లికి ప్రాంతీయ, భాషా బేధాలు ఉండవు. సినిమా ఒక మార్మిక కళారూపం. అమరుల త్యాగం, కవులు, కళాకారుల అవిశ్రాంత పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. భవిష్యత్తులో ఇరు ప్రాంతాల ప్రజలు సమన్వయంతో భాగ్యవంతమైన తెలుగుజాతిని నిర్మించాలి’’ అని ప్రజా గాయకుడు గద్దర్ అభిలషించారు. చిత్ర పరిశ్రమలో నాలుగైదు కుటుంబాలే గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్నాయని, ఇదే ధోరణి కొనసాగితే పరిశ్రమ నుంచి మరో ఉద్యమం పుట్టడం ఖాయమని సీపీఐ నేత నారాయణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కె.ఎస్.రామారావు అల్లం నారాయణ, పాశం యాదగిరి, విజేందర్‌రెడ్డి, కె.శ్రీనివాస్, రసమయి బాలకిషన్, విమలక్క, దేవీప్రసాద్, విఠల్, నందిని సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు