తెరిచేనాటికైనా.. తిప్పలు తప్పేనా?

12 Apr, 2016 02:30 IST|Sakshi
తెరిచేనాటికైనా.. తిప్పలు తప్పేనా?

* సమస్యల వలయంలో ప్రభుత్వ కళాశాలలు
* శిథిలస్థితిలో భవనాలు, చాలని తరగతి గదులు
* మరుగుదొడ్లు, సైకిల్ షెడ్లు కరువు
* భర్తీ కాని అధ్యాపకుల పోస్టులు
* పునఃప్రారంభం నాటికైనా ఇక్కట్లను
* తప్పించాలంటున్న విద్యార్థులు

సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘ప్రభుత్వ కళాశాలకు ఎందుకు పోలే’దని విద్యార్థుల్ని అడిగితే.. ‘అక్కడ వసతుల్లేవు, పాఠాలు చెప్పడానికి అధ్యాపకులు లే’రంటారు!

‘ఎందుకలా’ అని ప్రిన్సిపాల్‌ను అడిగితే ‘ప్రతిపాదనలు పంపాం, ఇంకా మంజూరు కాలే’దంటారు. ‘ప్రతిపాదనలకు మోక్షం ఎప్పు’డని ప్రభుత్వాన్ని అడిగితే ‘ఖజానా ఖాళీ.. నిధుల్లేవు’ అని సమాధానం వస్తుంది. ఈ నేపథ్యంలో.. ‘ఇటు సమస్యలు తీరలేదు.. అటు విద్యార్థులు రాలేదు కాబట్టి రేషనలైజేషన్ సాకుతో కాలేజీలను మూసేస్తే పోలా..’ అని అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సమస్యల చట్రంలో ఇరుక్కొని పేద, మధ్య తరగతి విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు.

రోజురోజుకూ కొత్తకొత్త విధానాలు, హంగులతో ప్రైవేట్ కాలేజీలు దూసుకుపోతుంటే.. సమస్యల గుదిబండలతో ప్రభుత్వ కళాశాలలు వెనుకపడుతున్నాయి. కనీసం ఈ సెలవుల్లోనైనా సమస్యల్ని పరిష్కరించి, వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికైనా కష్టాలను తప్పిస్తారని విద్యార్థులు ఆశిస్తున్నారు.
 
* జిల్లాలో 42 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అలాగే 15 డిగ్రీ కాలేజీలు, మరో 12 ఎయిడెడ్ కాలేజీలు ఉన్నాయి. అక్కడ ఎలాంటి వసతులు కావాలన్నా సమకూర్చుకోవాలని విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కానీ నిధులు సకాలంలో మంజూరుగాక పనులు జరగడం లేదు. ప్రభుత్వ కళాశాలల్లో సమస్యలను తరచి చూస్తే..
 
* జిల్లా కేంద్రం కాకినాడలో ఉన్న పీఆర్ జూనియర్, డిగ్రీ కళాశాలలు వందేళ్ల నాటి శిథిల భవనాలకు తప్ప ఇప్పటికీ కొత్త వసతులకు నోచుకోలేదు. బాలాజీచెరువు సెంటర్లోని పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంలో ఉదయం ఇంటర్మీడియట్, మధ్యాహ్నం ఒకేషనల్ కళాశాలలు నిర్వహిస్తున్నారు. జగన్నాథపురంలోని అన్నవరం సత్యదేవ కళాశాలలోనూ సౌకర్యాలు అంతంతమాత్రమే.
 
* రాజమహేంద్రవరం అటానమస్ డిగ్రీ కళాశాలలో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన పీజీ బ్లాక్ నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోయింది. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు నివేదించినా ఫలితం శూన్యం. ఇక జూనియర్ కళాశాలలో దాదాపు 1,600 మంది విద్యార్థులున్నా సరిపడినన్ని తరగతి గదుల్లేవు. మరుగుదొడ్ల సమస్య పరిష్కారం కాలేదు.
 
* రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలంలోని మురమండలోని పిచ్చుగ కోటయ్య జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మరుగుదొడ్లు లేక రోడ్డు వెంబడి కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. ధవళేశ్వరం జూనియర్ కళాశాలలో రక్షిత మంచినీటి సౌకర్యం లేదు. సైకిల్‌స్టాండ్ లేక విద్యార్థుల సైకిళ్ళు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయి.
 
* ఏలేశ్వరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను 2009లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏర్పాటు చేశారు. ఆయన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కళాశాలకు సొంత భవనాల నిర్మాణంపై దృష్టి పెట్టకపోవడంతో నేటికి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే నిర్వహించాల్సిన పరిస్థితి.
 
* ముమ్మిడివరం ఎంజీఆర్ జూనియర్ కళాశాలను 30 ఏళ్ల క్రితం ఓ ప్రవాసాంధ్రుడు సమకూర్చిన విరాళంతో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. భవనం పైకప్పు పెచ్చులూడిపోయి వర్షాకాలంలో లీకవుతోంది. కిటీకీలకు అద్దాలు లేవు.
 
* మామిడికుదురులో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ భారీ వర్షం పడితే మునిగిపోతోంది. విద్యార్థుల సైకిళ్లకు షెడ్ లేదు.  
 
* సామర్లకోటలో 1972లోనే ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ఏర్పాటును ప్రకటించినా నేటికీ జూనియర్ కళాశాల ఒక్కటే దిక్కు.  మరుగుదొడ్లు, సైకిల్ షెడ్ లేవు. శిథిలమైన భవనాల శ్లాబ్ నుంచి పెచ్చులు రాలిపడుతుండటంతో విద్యార్థులకు గాయాలైన సంఘటనలూ ఉన్నాయి.  
 
* పిఠాపురం ఆర్‌ఆర్ బీహెచ్‌ఆర్ కళాశాలకు నూతన భవనం నిర్మించినా మరుగుదొడ్ల సమస్య తీరలేదు. విద్యార్థినులు ఇక్కట్లకు గురవుతున్నారు. సైకిల్ స్టాండ్ లేదు.
 
* రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిజికల్ డెరైక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఖాళీ. చివరకు ఇంగ్లిష్ లెక్చరర్ పోస్టు కూడా ఖాళీగా ఉండడంతో గెస్ట్ లెక్చరర్‌తో పాఠాలు చెప్పిస్తున్నారు.
 
* రాజానగరం నియోజకవర్గం కోరుకొండలోని రాజ బాబు జూనియర్ కళాశాలలో తరగతి గదులు విద్యార్థులకు సరిపోవడంలేదు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మూడు అదనపు గదులు అందుబాటులోకి వచ్చినా సరిపోవు. ప్రహారీ లేక పశువులు ఆవరణలోకి చొరబడుతున్నాయి.
 
* కొత్తపేటలోని విశ్వకవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తగినన్ని తరగతి గదులు లేవు. ఆరేళ్ల క్రితం అదనపు గదుల నిర్మాణం చేపట్టినా నిధులు విడుదల కాక భవనం అసంపూర్తిగా నిలిచిపోయింది.  రావులపాలెం డిగ్రీ కళాశాలలో పాత భవనం విష సర్పాలకు నిలయంగా మారింది. ఆలమూరు డిగ్రీ కళాశాలను జూనియర్ కళాశాల భవనంలో నిర్వహిస్తున్నారు.  
   
* ఇంకా రామచంద్రపురం కృత్తివెంటి పేర్రాజు పంతులు జూనియర్ కాలేజీ, డిగ్రీ కళాశాల, ద్రాక్షారామ పీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, తుని డిగ్రీ కళాశాల, రాజా జూనియర్ కళాశాల, మహిళా జూనియర్ కళాశాల, మండపేట నియోజకవర్గం రాయవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల, రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాజవొమ్మంగి ప్రభుత్వ జూనియర్ కళాశాల, అడ్డతీగల ప్రభుత్వ జూనియర్ కళాశాల, కరప మండలం వేళంగిలో మెర్లాస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల,  అమలాపురం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, జగ్గంపేట జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, గోకవరం జూనియర్ కళాశాల, రంగంపేట జూనియర్ కళాశాలలను పలు సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. సెలవుల అనంతరం తిరిగి తెరిచే నాటికైనా వాటిని పరిష్కరించి, తాము నిశ్చింతగా చదువుకునే అవకాశం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు