‘మూర్ఖంగా ముందుకు వెళ్తే.. సమ్మెకు దిగుతాం’

29 Jul, 2019 13:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మోదీ.. ఇదేనా మీ దేశభక్తి: కార్మిక సంఘాలు

ప్రయాణికులకు ఇచ్చే 47 శాతం సబ్సిడీని కూడా రద్దు అనడం దుర్మార్గం

సాక్షి, విజయవాడ : లాభాల్లో నడుస్తున్న రైల్వేను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజలపై భారాలు మోపే ఆలోచనను మోదీ సర్కార్ విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. రైల్వే ప్రైవేటీకరణ అంశంపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ బెజవాడ రైల్వే స్టేషన్‌ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేపట్టాయి. వివిధ కార్మిక సంఘాల నేతలు ధర్నాలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉమామహేశ్వరావు మాట్లాడుతూ.....తమ సంక్షేమంపై దృష్టి సారిస్తారని భావించి ప్రధాని మోదీకి ప్రజలు రెండోసారి అధికారం అప్పచెప్పారన్నారు.  రైల్వేను ప్రైవేటు పరం చేయబోమని ఎన్నికల ప్రచారంలో మోదీ హామీ ఇచ్చారని... కానీ ఇప్పుడు ప్రధాన రైల్వేస్టేషన్ల ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేశారని ఆరోపించారు. ప్రయాణికులకు ఇచ్చే 47 శాతం సబ్సిడీని కూడా రద్దు చేస్తామని చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. ‘విదేశీ పెట్టుబడిదారులకు సొమ్మును ధారాదత్తం చేయడమే మోదీకి ఉన్న దేశభక్తా? కార్మిక సంఘాలు అన్నీ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతికిస్తున్నా మోదీ మాత్రం నియంతలా వ్యవహరిస్తున్నారు అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయినప్పటికీ మోదీ మూర్ఖంగా ముందుకు వెళితే దేశవ్యాప్త సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు