సిటీ బస్సులపై విద్యార్థుల కన్నెర్ర

24 Aug, 2013 03:49 IST|Sakshi
చేబ్రోలు, న్యూస్‌లైన్: ప్రమాదాలకు కారణమవుతున్న సిటీ బస్సుల రాకపోకలను నిలిపి వేయాలని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. ద్విచక్రవాహనంపై కళాశాలకు వెళ్తున్న నలుగురు విద్యార్థులు గురువారం ఉదయం నారాకోడూరు వద్ద సిటీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం విధితమే. దీనిపై ఆగ్రహించిన తోటి విద్యార్థులు శుక్రవారం వడ్లమూడి, నారాకోడూరుల్లో రాస్తారోకో చేసి నిరసన వ్యక్తంచేశారు. 
 
 ఐదు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. వేజండ్ల అడ్డరోడ్డు వద్ద తెనాలి రహదారిపై తాటాకులు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. వర్సిటీ ఎదురుగా విద్యార్థులు నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. విద్యార్థుల మృతికి కారణమైన సిటీ బస్సులను తెనాలి రోడ్డుపై రాకపోకలు సాగించకూడదని, యూనివర్సిటీ ఎదురుగా స్పీడ్ బ్రేకర్లు వేయాలని, మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో తెనాలి, గుంటూరు వైపు పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. చేబ్రోలు సీఐ జి.పూర్ణచంద్రరావు, ఎస్‌ఐ డి.వినోద్‌కుమార్‌లు విద్యార్థులతో మాట్లాడి శాంత పరిచారు.
 
 నారాకోడూరు వద్ద ఏర్పాటు చేసిన బైపాస్ రోడ్డు అలంకార ప్రాయంగా మారిందని స్థానికులు విమర్శిస్తున్నారు. గుంటూరు, తెనాలి నుంచి వచ్చే వాహనాలను నారాకోడూరు బైపాస్ మీదుగా రాకపోకలు జరిగితే కొంతమేర ప్రమాదాలను నివారించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. రూ.50 లక్షల వ్యయంతో రెండేళ్ల క్రితం బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసినా నేటి వరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం విమర్శలకు దారి తీస్తోంది. 
 
మరిన్ని వార్తలు