సిటీకే ‘మెట్రో’ పరిమితం

21 Sep, 2014 03:20 IST|Sakshi
సిటీకే ‘మెట్రో’ పరిమితం
  1.  ఎట్టకేలకు స్పష్టత
  2.  తొలి విడత 26 కిలోమీటర్లు
  3.  బందరు, ఏలూరు రోడ్ల ఎంపిక
  4.  విస్తృతంగా పర్యటించిన శ్రీధరన్ కమిటీ
  5. విజయవాడ సెంట్రల్ : ప్రతిష్టాత్మక మెట్రోరైల్ ప్రాజెక్టుపై స్పష్టత వచ్చింది. మెట్రో ప్రాజెక్ట్ ముఖ్య సలహాదారు శ్రీధరన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ శనివారం విజయవాడలో విస్తృతంగా పర్యటించింది. తొలి విడతగా నగరంలో 26 కిలో మీటర్ల మేర మెట్రోరైల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. బందరురోడ్డులోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్, అక్కడ నుంచి రైల్వేస్టేషన్ మీదుగా ఏలూరు రోడ్డును అనుసంధానం చేస్తూ రామవరప్పాడు రింగ్ వరకు రైల్ లైన్ ఏర్పాటుచేయాలని ప్రాథమికంగా భావిస్తున్నారు. జన సమ్మర్థం ఆధారంగా ఈ రెండు రోడ్లను శ్రీధరన్ బృందం ఎంపిక చేసింది.
     
    బెజవాడకు మీడియం రైలు
     
    చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్ నగరాల్లో ఏర్పాటు చేసిన తరహాలో మీడియం మెట్రోను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 45వేల నుంచి 50 వేల మంది ప్రయాణించేందుకు వీలుగా ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. రూ.7,500 కోట్ల నుంచి రూ.8 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్)ను ప్రభుత్వం ఆమోదించి, నిధులు విడుదల చేస్తే మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
     
    తీరనున్న ప్రయాణికుల కష్టాలు

    మెట్రో రైలు అందుబాటులోకి వస్తే విజయవాడలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రయాణ కష్టాలు తీరే అవకాశం ఉంది. నగర జనాభా ఇప్పటికే 12లక్షలకు చేరింది. రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే స్థాయిలో ట్రాఫిక్ సమస్య కూడా ఉత్పన్నమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో 250 సిటీ బస్సులు, 13 వేలకు పైగా ఆటోలు నడుస్తున్నాయి. అయినప్పటికీ ప్రజలకు ప్రయాణ కష్టాలు తప్పడంలేదు.

    మెట్రోరైలు ప్రాజెక్టు పూర్తయితే తక్కువ ఖర్చుతో సమయం వృథా కాకుండా గమ్యస్థానాన్ని చేరుకొనే అవకాశం ఉంటుంది. బస్సులో గంటసేపు వెళ్లే దూరాన్ని మెట్రో రైలులో కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. రైలు అందుబాటులోకి వచ్చిన తర్వాత బస్సులు, ఆటోల సంఖ్య తగ్గిస్తే నగరంలో కాలుష్యాన్ని కొంత మేర అరికట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
     

మరిన్ని వార్తలు