దేశాభివృద్ధిలో సివిల్ ఇంజినీర్ల పాత్ర కీలకం

5 Jan, 2014 00:05 IST|Sakshi

 ఘట్‌కేసర్, న్యూస్‌లైన్ :
 దేశ అభివృద్ధికి ప్రధానమైన నిర్మాణాల పూర్తిలో సివిల్ ఇంజినీర్ల పాత్ర కీలకమని ఎల్ అండ్ టీ జియో స్ట్రక్చర్ సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు కన్నప్పన్ పేర్కొన్నారు. మండల పరిధి అంకుశాపూర్‌లోని ఏసీఈ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న ‘రీసెంట్ అప్లికేషన్స్ ఇన్ సివిల్ ఇంజినీరింగ్’ అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో శనివారం ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. నిర్మాణ రంగంలో చోటు చేసుకుంటున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సివిల్ ఇంజినీర్లు అందిపుచ్చుకోవాలని, సమాజానికి ఉపయోగపడేలా పదికాలాల పాటు మన్నేలా నిర్మాణాలు ఉండేలా శ్రద్ధ చూపాలని సూచించారు. తక్కువ ఖర్చుతో నాణ్యత గల కట్టడాల నిర్మాణంపై దృష్టి సారించాలన్నారు.
 
  సివిల్ ఇంజినీరింగ్  కోర్సుల్లో ఇటీవలి కాలంలో యువతులు ఎక్కువగా చేరుతుండటం శుభ పరిణామమని అన్నారు. సివిల్ ఇంజినీర్లకు అపార అవకాశాలు ఉన్నాయనీ, తమ ఎల్‌అండ్‌టీ సంస్థలోనే ప్రతి ఏడాది వెయ్యిమంది వరకు నియామకం అవుతున్నారని తెలిపారు. సదస్సులో యూఎస్‌ఏలోని సౌత్ డకోటా టిక్నికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రామకృష్ణన్, ఏసీఈ కళాశాల మాజీ డెరైక్టర్ పరమేశ్వరన్, ఆస్ట్రేలియాలోని కూర్టిన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బి.వి.రంగన్, ఏసీఈ కళాశాల చైర్మన్ వి.ఎం.రావు, కార్యదర్శి వై.వి.గోపాలకృష్ణమూర్తి, ప్రిన్సిపాల్ బి.ఎల్.రాజు, సదస్సు సమన్వయకర్తలు జగన్నాథరావు, సీఎస్‌వీఎస్ కుమార్, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు