దోపిడీలను అడ్డుకున్నందుకే బూటకపు ఎన్‌కౌంటర్లు

17 Dec, 2018 13:10 IST|Sakshi
పోలీసులు అరెస్టు చేసిన వారి బంధువులతో మాట్లాడుతున్న పౌరహక్కుల సంఘం నేతలు

మీనా ఎన్‌కౌంటర్‌ పచ్చి బూటకం

ఆమెను పోలీసులు పట్టుకుని కాల్చి చంపారు

ఆండ్రపల్లిలో రెండు రాష్ట్రాల  మానవహక్కుల సంఘం ప్రతినిధుల పర్యటన

సీలేరు(పాడేరు): దోపిడీలపై ఉద్యమిస్తున్నందునే ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల పాలకులు  బూటకపు ఎన్‌కౌంటర్లు,  అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల పౌరహక్కుల సంఘం నేతలు తెలిపారు.  ఆంధ్రా–ఒడిశా సరిహద్దు చిత్రకొండ బ్లాక్‌లోని ఆండ్రపల్లి వద్ద అక్టోబర్‌ 12న జరిగిన ఎన్‌కౌంటర్‌పై వాస్తవాలు తెలుసుకునేందుకు రెండు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు పౌరహక్కుల నేతలు   ఆండ్రపల్లి, పరిసర గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారు ఆదివారం సీలేరులో  విలేకరులతో  మాట్లాడారు. అక్టోబర్‌ 12న జరిగిన ఎన్‌కౌంటర్‌ పచ్చి బూటకమని, పోలీసు బలగాలు ఆమెను పట్టుకుని కాల్చి చంపాయని  తెలిపారు.  ఆండ్రపల్లిలో ప్రజలతో కలసి వివరాలు సేకరించామని చెప్పారు. చిత్రకొండ బ్లాక్‌లో అనారోగ్యంతో ఉన్న మీనా, తోటి సభ్యులను అక్టోబర్‌ 10న సాయుధ పోలీసు బలగాలు  గుర్తించి వెంబడించాయని చెప్పారు. 

వారు నుంచి తప్పించుకుని ఆండ్రపల్లి అటవీ ప్రాంతానికి  చేరుకున్నారని తెలిపారు. అక్టోబర్‌ 11వ తేదీ సాయంత్రం మీనా, సహచరులు షెల్టర్‌ ఏర్పాటు చేసుకున్నారని, ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు 12వ తేదీ ఉదయం 5.30  గంటల ప్రాంతంలో చుట్టుముట్టి కాల్పులు జరిపారని తెలిపారు. ఈ సంఘటనలో   గాయపడిన మీనాను చిత్రహింసలకు గురి చేసి, చంపేశారని  తమ విచారణలో తేలిందన్నారు.  ఆంధ్రా సీఎం చంద్రబాబు నాయుడు, ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌  కనుసన్నల్లో   బాక్సైట్‌ అక్రమ మైనింగ్‌ జరుగుతోందని తెలిపారు. ఆంధ్రా, ఒడిశా, ఛతీస్‌గఢ్, తెలంగాణా, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, దోపిడీ విధానాలపై ఆదివాసీలు ఉద్యమిస్తున్నారని, వారిని అణిచివేయడానికే అక్రమ అరెస్టులు, బూటకపు ఎన్‌కౌంటర్లను నిరంతరం కొనసాగిస్తున్నారని  తెలిపారు. ఈ పర్యటనలో ఏపీ పౌరహక్కుల సంఘ అధ్యక్షుడు చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి  చిలుకా చంద్రశేఖర్, సహాయ కార్యదర్శి శ్రీమన్నారాయణ, ఏపీఈసీ సభ్యుడు బాలాజీరావు, తెలంగాణ నుంచి నారాయణరావు, మదన కుమారస్వామి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు