సత్వరం న్యాయం అందించడం దైవ కార్యం 

2 Dec, 2019 04:18 IST|Sakshi
నాగార్జున వర్సిటీలో జరిగిన న్యాయాధికారుల సదస్సులో మాట్లాడుతున్న హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి

న్యాయాధికారులకు సీజే జస్టిస్‌ జేకే మహేశ్వరి ఉద్బోధ  

సాక్షి, అమరావతి:  న్యాయవ్యవస్థపై ప్రజలు ఎంతో నమ్మకం ఉంచారని, శీఘ్రగతిన వారికి న్యాయాన్ని అందించినప్పుడే ఆ నమ్మకానికి సార్థకత చేకూరుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి అన్నారు. ప్రజలకు న్యాయం అందించడమన్నది దైవ కార్యమని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర న్యాయాధికారుల తొలి సదస్సు ఆదివారం గుంటూరులోని ఆచార్య నాగార్జున వర్సిటీ ప్రాంగణంలో జరిగింది. ఈ సదస్సులో హైకోర్టు న్యాయమూర్తులతో పాటు 13 జిల్లాలకు చెందిన దాదాపు 530 మంది న్యాయాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా న్యాయాధికారులను ఉద్దేశించి సీజే జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి ప్రారంభోపన్యాసం చేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముకానివ్వకుండా చూసి న్యాయవ్యవస్థ ప్రతిష్టను పెంచాల్సిన బాధ్యత న్యాయాధికారులపై ఉందన్నారు. ప్రజలు మనదేశంలో న్యాయమూర్తులను దేవుళ్లలా భావిస్తారని, అందుకే న్యాయస్థానాలు ‘న్యాయ ఆలయాలు’ అయ్యాయన్నారు. దేశంలో ఎన్నో దేవాలయాలున్నా, తిరుమల, కాశీ ఇలా కొన్ని దేవస్థానాలకే అత్యంత పవిత్రత ఉందని, అలాగే అనేక రంగాలు ప్రజల కోసం పనిచేస్తున్నా, న్యాయవ్యవస్థకున్న ప్రత్యేకత వేరని తెలిపారు.

న్యాయం అందించే బాధ్యత మన చేతుల్లోకి వచ్చిందంటే అది దైవకృప వల్ల మాత్రమే సాధ్యమైందని, అందువల్ల ప్రజలకు సత్వర న్యాయం అందించడాన్ని దైవ కార్యంగా భావించాలని ఆయన న్యాయాధికారులను కోరారు. ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు ఏం చేయాలి.. ఈ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు.. వాటిని ఎలా అధిగమించాలి.. తదితర అంశాలపై సూచనలు, సలహాలు అందుకునేందుకే ఈ సదస్సును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సదస్సులో తీసుకునే నిర్ణయాలను తప్పనిసరిగా అమలు చేస్తామని తెలిపారు. 
హాజరైన న్యాయాధికారులు  

హైకోర్టు జడ్జిపై 12 వేల కేసుల భారం... 
అధికార గణాంకాల ప్రకారం హైకోర్టులో 1,90,431 కేసులు పెండింగ్‌లో ఉంటే, ప్రస్తుతం ఉన్నది 15 మంది న్యాయమూర్తులేనని సీజే తెలిపారు. ఆ ప్రకారం ఒక్కో న్యాయమూర్తిపై 12,695 కేసులను విచారించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. అలాగే కింది కోర్టుల్లో 5,67,630 పెండింగ్‌ కేసులు ఉంటే, ప్రస్తుతం ఉన్నది 529 మంది న్యాయాధికారులేనని చెప్పారు. పాత కేసుల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వడంతో సరిపెట్టకుండా, కొత్త కేసులు పాత కేసులుగా మారకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దేశంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలు పెద్ద సంఖ్యలో కక్షిదారులుగా మారుతున్నాయని, ఇదే సమయంలో ప్రజల్లో వారి హక్కుల పట్ల అవగాహన పెరుగుతోందన్నారు. ఈ–ఫిర్యాదుల పరంపర చాలా వేగంగా పెరిగిందని, ఈ పరిస్థితుల్లో న్యాయాధికారులపై ఎంతో గురుతర బాధ్యత ఉందని ఆయన గుర్తు చేశారు.    

నైతికత విషయంలో రాజీపడొద్దు..
న్యాయవాదులు, న్యాయమూర్తుల మధ్య సత్సంబంధాలు ఉండటం వల్ల సమర్థవంతంగా న్యాయ పాలన అందించడం సాధ్యమవుతుందని జస్టిస్‌ మహేశ్వరి చెప్పారు. న్యాయపాలనలో న్యాయవాదుల పాత్ర చాలా కీలకమని, వారు కూడా న్యాయమూర్తులతో సమానమని తెలిపారు.  నైతికత విషయంలో న్యాయమూర్తులు ఎన్నడూ కూడా రాజీపడాల్సిన అవసరం లేదని చెప్పారు. యువ న్యాయవాదులను ప్రోత్సహించాలన్నారు. సదస్సులో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేష్‌ కుమార్, జస్టిస్‌ సీహెచ్‌ ప్రవీణ్‌కుమార్, జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి, ఏపీ లా సెక్రటరీ మోహన్‌రెడ్డి, పలువురు న్యాయమూర్తులు, న్యాయాధికారులు పాల్గొన్నారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా