రెండు వర్గాల ఘర్షణ : పిడిగుద్దుల వర్షం

4 Jun, 2020 20:35 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాల్లోని ఎన్‌ కొత్తపల్లి గ్రామంలో గురువారం ఉదయం జరిగిన ఒక సామాజిక వర్గ సమావేశంలో చిన్నపాటి మాటలు కాస్తా ఘర్షణకు దారితీశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో ఉపాధి క్షేత్ర సహయకుడిగా పని చేస్తున్న పీ సత్యనారాయణ రాజపై గతంలో కొన్ని అభియోగాల వచ్చాయి. అందుకు సంబంధించిన విషయాలు సామాజిక వర్గ సమావేశంలో చర్చకు వచ్చాయి. చర్చల్లో ఒకరుపై ఒకరు వాదనలకు దిగారు. ఒకే సామాజిక వర్గంలో ఉన్న మనం సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పెద్దలు సముదాయించే లోపు వివాదం తలెత్తి రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ క్రమంలోనే తోపులాటకు దిగారు. దీంతో సమావేశం రసాబసాగా మారి అంతా రోడ్డుపైకి రావడంతో గలాటా ఏర్పడి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు.

ఇందులో పలువురు గాయాల పాలయ్యారు. ఇరు వర్గాలకు చెందిన వారి ఆసుపత్రికి వెళ్ళడంతో అక్కడ నుంచి వచ్చిన సమాచారంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సామాజిక వర్గంలో ఏర్పడ్డ ఘర్షణ ఏ పరిస్థితికి దారితీస్తోందో అని అమలాపురం డీఎస్సీ మసూం భాషా, సీఐలు ఆర్‌ భీమరాజు, సురేష్‌బాబులతో వచ్చి గ్రామంలో పరిస్థితిని సమీక్షించి పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేయించారు. అనవసరంగా గొడవలకు దిగి ఘర్షణలు సృష్టిస్తే ఊరుకునేది లేదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం శిక్షలు తప్పవని హెచ్చరించారు. చిన్న చిన్న గొడవలను సామాజిక మాధ్యమాల్లో పెట్టి పెద్దవి చేస్తున్నారని, అలాంటి వారిపైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు