తర'గతి' ఇలా!

24 Jan, 2019 09:08 IST|Sakshi
తరగతి గదిలో ఖాళీగా కూర్చున ఎంసీఏ రెండో ఏడాది విద్యార్థులు

పనిదినాల్లో బోధకులకు శిక్షణ

బీఆర్‌ఏయూలో తరగతులు బంద్‌

తరగతులకు వచ్చి వెనుతిరుగుతున్న విద్యార్థులు  

శ్రీకాకుళం, ఎచ్చెర్ల క్యాంపస్‌: క్రిస్మస్, సంక్రాంతి పండుగ సెలవుల అనంతరం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 21 నుంచి వర్సిటీ పునఃప్రారంభమైంది. అయితే తరగతులు నిర్వహించాల్సిన పనిదినాల్లో బోధన సిబ్బందికి వర్సిటీ అధికారులు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు 27వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇది విద్యార్థులపై ప్రభావం చూపుతోంది. ఇంజినీరింగ్‌ మినహాయించి 22 విభాగాల పీజీ బోధన సిబ్బందికి ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రాం కింద శిక్షణ ఇస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన మహాత్మా గాంధీ గ్రామీణ విద్యా మండలి ఈ శిక్షణ నిర్వహిస్తుంది. శిక్షణలో 90 మంది పైబడి బోధన సిబ్బంది పాల్గొంటున్నారు.

ఇంజినీరింగ్‌కు మాత్రం వర్సిటీలో ఉన్న ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్‌ మూడు బ్రాంచ్‌ల్లో ఒక్క విద్యార్థి వచ్చినా తరగతులు నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 40 శాతం పైబడి విద్యార్థులు ప్రస్తుతం హాజరవుతున్నారు. పీజీ కోర్సుకు సంబంధించి విద్యార్థులు వచ్చి వెనుదిరుగుతున్నారు. ఎంసీఏ, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, గణితం, బయోటెక్నాలజీ వంటి కోర్సులకు సంబంధించి 40 శాతం పైబడి విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు. అధ్యాపకులు రాకపోవడంతో ఒక పూట ఉండి వెనుదిరుగుతున్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా సెలవు తీసుకుంటున్నారు. మరో పక్క శిక్షణకు సైతం పూర్తిస్థాయి బోధన సిబ్బంది హాజరు కావటం లేదు. చాలా మంది వ్యక్తిగత పనులు చూసుకుంటున్నారు. శిక్షణకు హాజరై వెళ్లి పోతున్న బోధన సిబ్బంది సైతం ఉన్నారు. కనీసం తరగతులుకు ఇబ్బంది లేకుండా షిప్టులు వారీగా శిక్షణ ఇచ్చినా సరిపోయేది.

సెలవులు ఇవ్వాల్సింది
క్లాస్‌ వర్క్‌కు సెలవు ప్రకటించాల్సింది. లేదంటే తరగతులు అయినా నిర్వహించాలి. తరగతులు జరిగే సమయంలో బోధన సిబ్బందికి శిక్షణ ఇస్తుండడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
– వి.అనిల్, జర్నలిజం మొదటి ఏడాది విద్యార్థి

విద్యార్థులు పూర్తిస్థాయిలో రావటం లేదు
విద్యార్థులు క్రిస్మస్, సంక్రాంతి సెలవుల అనంతరం పూర్తిస్థాయిలో రావటం లేదు. క్లాస్‌ వర్కు గాడిన పడేందుకు సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో బోధన సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. బోధకులకు శిక్షణ, బోధనా నైపుణ్యాలు అవసరం.– రిజస్ట్రార్, ప్రొఫెసర్‌ కె.రఘుబాబు.

మరిన్ని వార్తలు