రోగాల పంజా!

5 Aug, 2015 01:22 IST|Sakshi

సంతకవిటి మండలంపై రోగాలు దాడి చేశాయి. కృష్ణంవలసలో విషజ్వరాలు ప్రబలగా, పోతు
 రాజుపేటలో డయేరియా విజృంభించింది. దీంతో పలువురు మంచం పట్టారు.
 
 సంతకవిటి : కృష్ణంవలస గ్రామంలో విష జ్వరాలు ప్రబలాయి. జ్వరాలు విజృంభించి వారం కావస్తున్నా తగ్గుముఖం పట్టకపోవడం, వైద్యశిబిరాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వంజరాపు సుహాసిని, చిన్నప్పమ్మ, ఎస్.దుర్గమ్మ, రామకృష్ణ, వంకల దాలమ్మ, పాలిన వెంకమ్మ, పాపారావు, వంకల పాపమ్మ, వంకల సాయి, పిన్నింటి సూరమ్మ, లక్ష్మి, రాము, అంజలి, అసిరమ్మ తదితరులు జ్వరంతో విలవిల్లాడుతున్నారు. వీరిలో కొంతమంది రాజాం, శ్రీకాకుళం వెళ్లి చికిత్స పొందుతున్నారు. కళ్లు ఎర్రగా మారడం, కాళ్లు.. చేతులు పీకడంతో పాటు తలనొప్పి అధికంగా ఉంటుందని జ్వరపీడితులు చెబుతున్నారు. రోజురోజుకూ జ్వర పీడితులు పెరుగుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
 
  జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో గ్రామస్తుల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు మంచం పడుతున్నారు. స్థానికంగా వైద్యం అందకపోవడంతో కొంతమంది ఆర్‌ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తుండగా, ఆర్థికంగా ఉన్నవారు రాజాం, శ్రీకాకుళం ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు.  కాగా గ్రామ రహదారి పూర్తగా పాడవ్వడంతో 108 వాహనం కూడా రాలేని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 పోతురాజుపేటలో డయేరియా
 పోతురాజుపేట గ్రామంలో డయేరియా ప్రబలింది. టంకాల మహేశ్వరరావు, పోతురాజు యోగీశ్వరరావు, వేణునాయుడు, తవిటినాయుడు, కెల్ల అప్పలనాయుడు, డి.ల క్ష్మిలతో పాటు వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు.
 
 వీరిలో పోతురాజు, తవిటినాయుడు, కెల్ల అప్పలనాయుడుల పరిస్థితి విషమంగా ఉండడంతో మంగళవారం సాయంత్రం కుటుంబీకులు వీరిని ప్రైవేట్ వాహనంలో శ్రీకాకుళంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. వైద్య సిబ్బంది స్పందించకపోవడంతో ఆర్‌ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. అధికారులు స్పందించి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని కృష్ణంవలస, పోతురాజుపాలెం గ్రామస్తులు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు