‘క్లీన్ పాడేరు’కు శ్రీకారం

12 Oct, 2014 00:24 IST|Sakshi
‘క్లీన్ పాడేరు’కు శ్రీకారం
  •  పారిశుద్ధ్యంపై సమరభేరి
  •  చీపుర్లు పట్టిన ఎమ్మెల్యే, పీఓ, సబ్ కలెక్టర్లు
  • పాడేరు : స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా క్లీన్ పాడేరుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శనివారం ఉదయాన్నే పాత బస్టాండుకు చేరుకున్న ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జన్మభూమి ప్రత్యేక అధికారి, అటవీశాఖ కన్సర్వేటర్ భరత్‌కుమార్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.వినయ్‌చంద్, సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ మల్లికార్జునరెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులంతా పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రారంభించారు. వీరంతా తొలుత చీపుర్లు పట్టి రోడ్డును ఊడ్చారు.
     
    అంబేద్కర్ సెంటర్ నుంచి మెయిన్‌రోడ్డు, సినిమాహాల్ సెంటర్, మోదమాంబ ఆలయ ప్రాంతాలకు మూడు బృందాలుగా విడిపోయిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులంతా పెద్ద ఎత్తున పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. క్లీన్ పాడేరు-గ్రీన్  పాడేరు పేరిట పట్టణ పురవీధుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలపై అవగాహనకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాల, పలు  ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా గాంధీజీ వేషధారణలో రెవెన్యూ ఉద్యోగి అచ్చంనాయుడు, మరో బాలుడు అందర్నీ ఆకట్టుకున్నారు.
     
    పాడేరును తీర్చిదిద్దండి : ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

    పాడేరును క్లీన్ పట్టణంగా తీర్చి దిద్దేందుకు ప్రజలంతా భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కోరారు. పాతబస్టాండ్ వద్ద ఆమె మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏజెన్సీలో విజయవంతం చేయాలన్నారు. ప్రజలంతా తమ నివాసాలు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను నిర్మించుకోవాలని సూచించారు.

    ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు పి.నూకరత్నం, ఎంపీపీ వి.ముత్యాలమ్మ, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ వంజంగి కాంతమ్మ, ఎంపీటీసీ సభ్యులు కూడి దేవి, కిల్లో చంద్రమోహన్‌కుమార్, చెండా శ్రీదేవి, బొర్రా విజయరాణి, కో-ఆప్షన్‌సభ్యులు ఎండీ తాజుద్దీన్, సర్పంచ్ కె.వెంకటరత్నం, ఎంపీడీఓ కుమార్, వైఎస్సార్ సీపీ నేత పాంగి పాండురంగస్వామి, పార్టీ విద్యార్థి సంఘం నేతలు జి.నిరీక్షణరావు, కె.చిన్న, టీడీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొర్రా నాగరాజు, మాజీ సర్పంచ్ వర్తన పిన్నయ్యదొర, సీడీపీఓ లలితకుమారి, ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్ శోభారాణి, ఆదినారాయణ, బీజేపీ నేత కురుసా బొజ్జయ్యలతో పాటు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
     

>
మరిన్ని వార్తలు