ఉషాకుమారికి లైన్‌క్లియర్

6 Feb, 2014 02:06 IST|Sakshi
ఉషాకుమారికి లైన్‌క్లియర్
  • మున్సిపల్ శాఖ నుంచి వెలువడిన ఉత్తర్వులు
  •  ఉడా వీసీగా నేడు బాధ్యతలు స్వీకరించే అవకాశం
  •  ఫలించని రామారావు యత్నాలు
  • సాక్షి, విజయవాడ : ఉడా వైస్ చైర్మన్ బదిలీ వ్యవహారంలో ఉత్కంఠ తొలగింది. వీజీటీఎం ఉడా వైస్ చైర్మన్‌గా నియమితులైన పి.ఉషాకుమారిని చార్జ్ తీసుకోవాలని సూచిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ నుంచి బుధవారం ఉత్తర్వులు రావటంతో ఆమెకు లైన్‌క్లియర్ అయ్యింది. గురువారం ఆమె బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. ఉడా వైస్ చైర్మన్ బదిలీ వ్యవహారం ఇప్పటివరకు అనేక మలుపులు తిరిగింది. ప్రస్తుత వైస్ చైర్మన్ రామారావు సీటు కాపాడుకోవటానికి చివరి నిమిషం వరకు ప్రయత్నాలు సాగించారు.

    వాస్తవానికి గత నెల 31న పి.ఉషాకుమారిని ఉడా వైస్‌చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వైస్ చైర్మన్‌గా పనిచేస్తున్న రామారావు ఉడాకు వచ్చి ఎనిమిది నెలలు కూడా పూర్తికాకపోగా, బదిలీ క్రమంలో పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు అందాయి.

    దీంతో ఆయన పోస్టింగ్ కోసం ప్రయత్నాలు చేయటంతో పాటు అవకాశం ఉంటే ఉడాలోనే కొనసాగించాలని ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ శాఖ కార్యదర్శిని కలిసి విన్నవించారు. ఈ క్రమంలో రామారావు ఇంకా రిలీవ్ కాకుండా కొనసాగుతున్నారు. ఉన్నతాధికారుల వద్ద ఆవేదన మొర పెట్టుకోవడంతో ఫలితం ఉంటుందని రామారావు భావించినా తాజా ఉత్తర్వులతో ఆయన రిలీవ్ కావటం అనివార్యంగా మారింది.
     

మరిన్ని వార్తలు