క్లైమాక్స్‌కు సీను!

8 Jan, 2014 04:04 IST|Sakshi

 అటా... ఇటా.. అసలెటు పోవాలి?.. ఎవరితో కలవాలి?.. ఎన్నికల్లోపు కొత్త పార్టీ వస్తే దాని భవిష్యత్తు ఎలా ఉంటుంది?.. మీడియాలో ఎలాంటి కథనాలు వచ్చినా, రాజకీయ పార్టీల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నా ఇంకా ఎంత కాలం మౌన దీక్ష కొనసాగించాలి?.. ఈ రకమైన ఇబ్బందితో సతమతమవుతున్న అధికార పార్టీలోని పలువురు నేతలు ఈ నెల 23న తామెటో తేల్చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మంత్రి గంటా శ్రీనివాసరావు పీసీసీ తనకు షోకాజ్ ఇస్తే సీఎం సహా సీమాంధ్రలోని ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని మంగళవారం తొలిసారి పార్టీ హై కమాండ్‌పై నేరుగానే మాటల యుద్ధం ప్రారంభించారు.
 
 విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి : సమైక్యాంధ్ర ఉద్యమ పరిణామం అనంతరం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ నుంచి జంప్ చేసే నేతల జాబితాలను తయారు చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో మంత్రి గంటాతో పాటు ఆయన మద్దతు దారులైన ఎమ్మెల్యేలు  ముత్తం శెట్టి శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్, కన్నబాబు రాజు, చింతలపూడి వెంకట్రామయ్య ఉన్నారు. వీరితో పాటు మరికొందరు కూడా ఇదే దారిలో ఉన్నారని గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా ప్రస్తుతానికి పార్టీ మారే ఆలోచన విరమింపజేసినట్టు ప్రచారం జరుగుతోంది. వెళ్లాలనుకుంటున్న వారు పార్టీని వీడుతున్నట్టు ప్రకటించకముందే తామే బయటకు పంపామనే రీతిలో వ్యవహరిస్తే మంచిదనే ఆలోచనతో బొత్స ఈ రకమైన ఎత్తు వేసినట్టు సమాచారం. ఇందులో భాగంగానే విశాఖ జిల్లాలో మంత్రి గంటాకు షోకాజ్ నోటీసు ఇస్తున్నారనే ప్రచారం ప్రారంభమైనట్టు చర్చ జరుగుతోంది.
 
  గంటాతో పాటు మిగిలిన న లుగురు ఎమ్మెల్యేలకు కూడా షోకాజ్ ఇస్తే వివరణ ఇవ్వకుండానే వారు వెళ్లిపోతారని పార్టీ అంచనా వేస్తోంది. ఇందుకోసం ఆయా నియోజక వర్గాల్లో ఇప్పటికే ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారు చేసే పనిలో పడ్డారు సత్తిబాబు. ఇప్పటికే ఒక శాసన సభ్యుడిని ఆయన నేరుగా నువ్వు పార్టీ విడిచి వెళ్లిపోనని హామీ ఇస్తావా? అని పార్టీ నేతలందరి ఎదురుగానే అడిగి ఆ ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చారు. శాసన సభలో తెలంగాణ బిల్లుపై చర్చ పూర్తయ్యేంత వరకు వేచి చూసి అక్కడ పార్టీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించి సమైక్యాంధ్ర లోకల్ చాంపియన్లుగా బయటకు రావాలని గంటా అండ్ కో వ్యూహ రచన చేసింది. ఇందుకోసం ముహూర్తం దగ్గర పడ డంతోనే గంటా తొలిసారి పీపీసీ అధ్యక్షుడిపై నేరుగా  ఎదురుదాడికి దిగినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. చర్చకు అదనపు సమయం కోరుతూ ఈ నెల 16 లేదా 17 తేదీల్లో రాష్ట్రపతికి ప్రభుత్వం లేఖ రాస్తుందని, సమయం వస్తే తమ నిష్ర్కమణ మరింత ఆలస్యం అవుతుందని, లేకపోతే 23 తర్వాత ముఖాలకు ఉన్న రాజకీయ మాస్క్‌లను తొలగించ వచ్చని గంటా ఇప్పటికే తమ మద్దతు దారులకు చెప్పినట్టు సమాచారం.
 
 

>
మరిన్ని వార్తలు